Andhra Pradesh News: ఆంధ్రప్రదేశ్‌లో మే నెల పింఛన్లు బ్యాంకుల్లో వేయాలని సీఎస్ నిర్ణయించారు. ఆధార్‌తో అనుసంధానమైన బ్యాంకు ఖాతాలు లేని వారికి ఇంటి వద్దే పింఛన్లు ఇచ్చేలా ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల వేళ పింఛన్ల పంపిణీకి వంలటీర్లను దూరం పెట్టాలన్న ఈసీ ఆదేశాలతో రెండు నెలల నుంచి పింఛన్లు పంపిణీపై వివాదం కొనసాగుతోంది. ఏప్రిల్‌లో సచివాలయాల వద్ద పంపిణీ చేసిన ప్రభుత్వం ఈసారి బ్యాంకు ఖాతాల్లో వేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
మే నెలలో కూడా పింఛన్లను లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి ఇవ్వలేమంటున్నారు సీఎస్ జవహర్ రెడ్డి. సిబ్బంది కొరత కారణంగా అది సాధ్యం కాదని తేల్చేస్తున్నారు. అదే టైంలో లబ్ధిదారులను సచివాలయాల వద్దకు రప్పించలేమని పేర్కొన్నారు. అందుకే మధ్యే మార్గంగా ఆధార్‌తో అనుసంధానమైన బ్యాంకు ఖాతాల్లో జమ చేయబోతున్నట్టు ఆదివారం ఆదేశాలు జారీ చేశారు.
ప్రభుత్వం వద్ద ఉన్న లెక్కల ప్రకారం సుమారు 75 శాతం మందికి బ్యాంకు ఖాతాలు ఉన్నాయని అవి వారి ఆధార్‌తో అనుసంధానమై ఉన్నట్టు గుర్తించింది. అందుకే వారికి నేరుగా బ్యాంకు ఖాత్లాల్లో నగదు జమ చేయనుంది. మిగతా 25 శాతం మందికి ఇంటి వద్దకు వెళ్లి అధికారులు అందజేయనున్నారు.
దీనిని కూడా ప్రతిపక్షాలు తప్పుపడుతున్నాయి. బ్యాంకు ఖాతాల్లో వేయడం వల్ల బ్యాంకుల్లో రద్దీ ఏర్పడి గందరగోళం తలెత్తుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వలంటీర్లను విధుల నుంచి పింఛన్ పంపిణీ విధుల నుంచి తప్పించారన్న కోపంతోనే కొందరు అధికారులు వైసీపీకి అనుకూలంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. విపక్షాల వల్లే పింఛన్లు ఇంటింటికీ అందజేయలేకపోతున్నామనే ప్రచారం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. సచివాలయ సిబ్బంది సహా మిగతా సిబ్బందిని వినియోగించుకొని పింఛన్లు ఇంటింటికీ ఇవ్వొచ్చని దీనిపై ఆలోచన ఎందుకు చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు.