Money Found In Boxes In Nallajarla: తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేళ భారీగా అక్రమ నగదు బయటపడుతోంది. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు కొందరు డబ్బును అక్రమంగా తరలిస్తున్నారు. తాజాగా, ఓ ప్రమాదంలో వాహనం బోల్తా పడగా.. తవుడు బస్తాల మధ్య అట్ట పెట్టెల్లో నగదును చూసిన స్థానికులు ఒక్కసారిగా షాకయ్యారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది. నల్లజర్ల (Nallajarla) మండలం అనంతపల్లి (Ananthapalli) వద్ద ఓ లారీ ఢీకొని టాటా ఏస్ వాహనం బోల్తా పడింది. ఆ వాహనంలో తవుడు బస్తాల మధ్యలో 7 బాక్సుల్లో నగదు బయటపడింది. దీన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకుని నగదును స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న నగదు మొత్తం రూ.7 కోట్లు ఉన్నట్లు సమాచారం. ఈ వాహనం విజయవాడ నుంచి విశాఖ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని తెలిపారు. ప్రమాదంలో టాటా ఏస్ వాహనం డ్రైవర్ కు గాయాలు కాగా.. అతన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ నగదుపై మరింత సమాచారం ఆరా తీస్తున్నారు.




నడిరోడ్డుపై రూ.2 కోట్లు


అలాగే, శ్రీ సత్యసాయి (Satyasai) జిల్లా లేపాక్షిలో (Lepakshi) కొందరు గుర్తు తెలియని వ్యక్తులు నడిరోడ్డుపైనే పడేశారు. తమను పోలీసులు వెంబడిస్తున్నారనే భయంతో రహదారిపైనే దాదాపు రూ.2 కోట్ల డబ్బును వదిలేసి వెళ్లినట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా పోలీస్ సైరన్ వినిపించడంతో ఇళ్ల ముందు డబ్బు సంచులు పడేసి వెళ్లిపోయినట్లు సమాచారం. ఈ నగదు హిందూపురానికి తరలిస్తున్నట్లు తెలుస్తోంది. కొంతసేపటి తర్వాత వచ్చి చూడగా దాదాపు రూ.40 లక్షలు మాయమైనట్లు గుర్తించారు. అయితే, అక్కడి వారిని విచారించి లాభం లేక మిగిలిన డబ్బులతో వారు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై అధికారిక సమాచారం లేదు.


టోకెన్లు ఇస్తున్నారా.?


ఎన్నికల వేళ కొన్ని చోట్ల కొందరు కొత్త పద్ధతుల్లో ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. కేవలం నగదు పంపిణీయే కాకుండా.. ఎవరికీ అనుమానం రాకుండా వారికి టోకెన్లు ఇచ్చి తాయిలాలు అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఒంగోలు (Ongole) నియోజకవర్గంలో ఓటర్లకు రూ.10, మహిళలకు రూ.50 నోట్లు టోకెన్లుగా ఇస్తున్నట్లు సమాచారం. షాపులకు వెళ్లి వీటిని చూపిస్తే రూ.10కు క్వార్టర్ మద్యం బాటిల్, రూ.50కు బియ్య బస్తాలు అందిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ సమాచారం అందుకున్న ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీలు చేపట్టగా.. ఓ గోదాంలో 3 లారీల బియ్య బస్తాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.


ఇప్పటికే, ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసిన పోలీసులు, ఎన్నికల అధికారులు సమన్వయంతో సోదాలు నిర్వహిస్తున్నారు. కొన్నిచోట్లు భారీగా అక్రమ నగదు స్వాధీనం చేసుకున్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎన్నికల అధికారులు హెచ్చరిస్తున్నారు. ఓటర్లు ప్రలోభాలకు గురి కాకుండా నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచిస్తున్నారు. 


Also Read: AP Assembly Elections: సొంతూళ్లకు వెళ్దాం, సోమవారం ఓటేద్దాం: సోషల్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారం