Young India Skill University In Telangana: తెలంగాణ యువతలో నైపుణ్యాల కల్పనకు ప్రభుత్వం సంకల్పించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీ ఏర్పాటు చేయనుంది. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేటలో 57 ఎకరాల్లో ఈ వర్సిటీని నిర్మించనున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌తో కలిసి వర్సిటీ నిర్మాణానికి ఆగస్టు 1న ఈ మేరకు శంకుస్థాపన చేశారు. వర్సిటీతోపాటు అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్‌, ప్రైమరీ హెల్త్‌ సెంటర్‌లకు కూడా శంకుస్థాపన చేశారు. కొత్త విశ్వవిద్యాలయ నిర్మాణానికి ఏడాదికి పైగా సమయం పట్టే అవకాశం ఉందని.. అప్పటివరకు ఆగకుండా ఈ ఏడాది అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా(ఆస్కి)లో ఆరు కోర్సులతో ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు 1న శాసనసభలో ప్రకటించారు. 


యువతకు అపార అవకాశాలు..
సాంకేతిక నైపుణ్యాలు పెంచుకుని ప్రపంచంతో పోటీ పడాలని ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. ప్రపంచవ్యాప్తంగా నిపుణుల కొరత ఉందని, వృత్తి నైపుణ్యం లేకపోవడం వల్ల నిరుద్యోగం పెరుగుతోందని, చాలామందికి పట్టాలున్నా ఉద్యోగాలు దొరకడం లేదని పేర్కొన్నారు. అందుకే తెలంగాణ విద్యార్థులకు అన్ని రకాల నైపుణ్యాలను అందించి.. దేశానికి ఆదర్శంగా నిలిపేందుకు 'యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ' ఏర్పాటు చేస్తున్నామని సీఎం వెల్లడించారు. దీనివల్ల యువతకు అపార అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అప్పట్లో యంగ్ ఇండియా పత్రికను మహాత్మాగాంధీ మొదలుపెట్టారని.. ఆయన స్పూర్తితోనే ఈ యూనివర్సిటీ తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. లక్షలాది మంది యువతకు ఉపాధి కల్పించడమే స్కిల్ యూనివర్సిటీ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ యూనివర్సిటీలో కోర్సు పూర్తి చేసిన వారికి సర్టిఫికేట్స్ అందించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ యువతకు ప్రాధాన్యమిస్తాం. 


17 కోర్సులతో ప్రారంభం..
ఈ వర్సిటీలో 17 కోర్సులను ప్రవేశపెట్టనున్నారు. శిక్షణ కాలం మూడు నుంచి ఆరు నెలలు ఉంటుంది. డిగ్రీతో పాటు డిప్లొమా కోర్సులుంటాయి. కోర్సు పూర్తి చేసినవారికి పట్టాలు ఇస్తారు. ఏడాదికి రూ.50 వేల నామమాత్రపు ఫీజు వసూలు చేస్తారు. అవసరమైతే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ పిల్లలకు బోధన రుసుం రీయింబర్స్ చేస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు. శిక్షణ సమయంలోనే అభ్యర్థులను ఎంపిక చేసుకుని.. శిక్షణ పూర్తయిన వెంటనే ఉద్యోగాలు ఇచ్చేందుకు పలు సంస్థలు ముందుకొచ్చాయి. భవిష్యత్తులో జిల్లాల్లోనూ కళాశాలలు ఏర్పాటు చేసి శిక్షణ ఇచ్చే ఆలోచన చేస్తున్నామన్నారు. 


తొలి దశలో ఆరు రంగాల్లో శిక్షణ.. మంత్రి శ్రీధర్ బాబు
'యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ'లో అంతర్జాతీయ ప్రమాణాలకు తగినట్లుగా శిక్షణ ఇవ్వనున్నట్లు ఐటీ, పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాల శాఖల మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. మొత్తం 17 రంగాలను గుర్తించినప్పటికీ..  తొలిదశలో ఆరు రంగాలకు సంబంధించిన కోర్సుల్లో శిక్షణ ప్రారంభించనున్నారు. ఇందులో ఫార్మా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐటీ, ఆటోమేషన్, బ్యాంకింగ్ ఇన్స్యూరెన్స్, గేమింగ్, నిర్మాణ, ఈ-కామర్స్ విభాగాల్లో శిక్షణ ఇస్తామని మంత్రి తెలిపారు. ఈ ఏడాది రెండు వేల మందికి శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. వచ్చే సంవత్సరం ఈ సంఖ్యను పదివేలకు పెంచనున్నట్లు స్పష్టం చేశారు. స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి జిల్లా కేంద్రాల్లో వచ్చే ఏడాది శాటిలైట్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.


➥ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఆయా విభాగాల్లో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. ఈ విశ్వవిద్యాలయ కోర్సులతో వృత్తివిద్యను అనుసంధానం చేస్తామని శ్రీధర్ బాబు తెలిపారు. ట్రిపుల్ ఐటీ హైదరాబాద్‌ మాదిరిగా స్కిల్ యూనివర్సిటీని తీర్చిదిద్దనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో ఈ విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పుతున్నామన్నారు. ఈ ఏడాది ఆస్కి ప్రాంగణంలో 1,500 మందికి 5 రంగాల కోర్సులపై, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఇండియాలో 500 మందికి నిర్మాణ రంగానికి చెందిన కోర్సులపై శిక్షణ ఇవ్వనున్నట్లు మంత్రి వెల్లడించారు. కోర్సులో 50 శాతం ప్రాక్ట్రికల్స్ మాత్రమే ఉండనున్నాయి. జర్మనీ, చైనా, సింగపూర్, దక్షిణ కొరియా దేశాలు తమ దేశాల్లోని పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థుల్లో నైపుణ్యాల కల్పనకు కృషి చేస్తున్నాయని తెలిపారు.


➥ స్కిల్ యూనివర్సిటీలో భాగస్వాములయ్యేందుకు ఫార్మా రంగానికి సంబంధించి డాక్టర్ రెడ్డీ ల్యాబ్స్, ఈ-కామర్స్‌కు అదానీ గ్రూప్, బ్యాంకింగ్, బీమా రంగాలకు ఎస్ బీఐ, నిర్మాణ రంగానికి నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్, రిటైల్ రంగానికి రిటైల్ అసోసియేషన్, యానిమేషన్, గేమింగ్ రంగానికి తెలంగాణ యానిమేషన్ అసోసియేషన్ ముందుకొచ్చాయని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. 


➥ ప్రధాన క్యాంపస్ ముచ్చర్ల సమీపంలో నెలకొల్పుతున్నప్పటికీ రాష్ట్రంలోని ఆరు ప్రాంతాల్లో ప్రాంగణాలు ఏర్పాటు చేయనునున్నట్లు మంత్రి తెలిపారు. ఈ కోర్సులకు అయ్యే వ్యయాన్ని ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో భరిస్తామన్నారు. ఒక్కో కోర్సు నిర్వహణకు సుమారు రూ.1.25 లక్షలు ఖర్చవుతుందని అంచనా ఉందని.. తొలి మూడేళ్లకు రూ.380 కోట్లు కేటాయిస్తామని మంత్రి వెల్లడించారు. ఈ స్కిల్ యూనివర్సిటీకి గవర్నర్ లేదా ముఖ్యమంత్రిని ఛాన్సలర్‌గా నియమించాలని నిర్ణయించనున్నారు. నిర్వహణాధికారులుగా నిపుణులను నియమిస్తారు. పరిశ్రమల ప్రముఖులతో పాలకవర్గాన్ని నియమించాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు.


రిజర్వేషన్ల ప్రకారమే ప్రవేశాలు.. 
రాష్ట్ర యువతకు ఉపాధి పొందడానికి ఈ స్కిల్ యూనివర్సిటీ ఎంతగానో ఉపయోగపడుతుందని ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ యూనివర్సిటీల మాదిరిగానే.. ఇందులోనూ రిజర్వేషన్ల వ్యవస్థను పాటిస్తామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు బోధన రుసుములు ఇస్తామన్నారు. ఇతరులకు ఫీజు తగ్గించే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తుందన్నారు. గతంలో కొన్ని ప్రైవేటు వర్సిటీలు ఏర్పాటు చేసినా.. వాటిలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు రిజర్వేషన్లు కల్పించలేదు. కొద్దిమంది కోసం వర్సిటీలను ధారాదత్తం చేశారు. అన్ని వర్గాలకు ఉపయోగపడేలా అన్ని అంశాలను మా ప్రభుత్వం బిల్లులో పొందుపరిచింది. ఎస్సీ, ఎస్టీలతో పాటు ఓబీసీలు, మైనారిటీలకు పాలకమండలిలో సభ్యులుగా అవకాశం కల్పిస్తామని తెలిపారు.