Anti Smog Gun: ఢిల్లో కాలుష్యం స్థాయి రోజురోజుకు మరింత ఆందోళనకరంగా మారుతోంది. చలికాలం రాక ముందే పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. గాలి విషపూరితంగా మారింది. గాలి నాణ్యత సూచిక 150 దాటింది. రాబోయే రోజుల్లో ఈ పరిస్థితి మరింత దిగజారుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. 


రోజురోజుకు పడిపోతున్న గాలి నాణ్యత పెంచేందుకు... వాయుకాలుష్యం నియంత్రించేందుకు ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. దీపావళిలో బాణసంచా వినియోగాన్ని పూర్తిగా నిషేధించింది. సుప్రీం కోర్టుకు కూడా దీన్ని సమర్థించింది. కాలం చెల్లిన వాహనాలపై చర్యలు తీసుకుంటోంది.


ఒకవైపు కాలుష్య నియంత్రణకు ఇలాంటి చర్యలు తీసుకుంటూనే... మరోవైపు గాలి నాణ్యత పెంచేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. అలాంటి ప్రయత్నాల్లో ఒకటి యాంటీ స్మోగ్‌ గన్‌ వినియోగం. ఇంతకీ ఈ స్మోగ్‌ గన్ అంటే ఏంటి... కాలుష్య నియంత్రమకు ఇది ఎలా పని చేస్తుంది. 


యాంటీ స్మోగ్ గన్ అంటే ఏమిటి?


2012లో దేశంలో మొదటిసారిగా యాంటీ-స్మోగ్ గన్‌లను ఉపయోగించారు. దీని తరువాత, కాలుష్యాన్ని నివారించడానికి అనేక ప్రధాన ప్రదేశాలలో దీనిని ఉపయోగించారు. యాంటీ-స్మోగ్ గన్స్ ను స్ప్రే గన్స్, మిస్ట్ గన్స్ లేదా వాటర్ ఫిరంగులు అని కూడా అంటారు. యాంటీ-స్మోగ్ గన్ అనేది నెబ్యులైజ్డ్ రూపంలో నీటి సన్నని బిందువులగా మారుస్తుంది. దాన్ని గాల్లోకి పిచికారీ చేస్తుంది. గాల్లోకి వచ్చిన నీటి బింధువులు ధూళి, కాలుష్య పదార్థాలను బంధిస్తాయి. 


లోడింగ్ వేహికల్ వెనక భాగంలో దీన్ని ఇన్‌స్టాల్ చేసి ఉంచుతారు. వాటర్ ట్యాంక్‌కు జతచేస్తారు. యాంటీ-స్మోగ్ గన్ అధిక పీడన ప్రొపెల్లర్ ద్వారా 50 నుంచి 100 మైక్రాన్ల చిన్న బిందువులతో నీటిని పదునైన షవర్‌గా మార్చేస్తుంది. 


యాంటీ స్మోగ్ గన్స్ ఎలా పనిచేస్తాయి?


యాంటీ-స్మోగ్ గన్ ధూళి, కాలుష్యం కణాలను నీటితో బంధిస్తుంది. వాటిని గాల్లోంచి నేలపైన పడేస్తుంది. ఫలితంగా వాయు కాలుష్య స్థాయిని తగ్గిస్తుంది. కాలుష్యాన్ని నివారించడంలో యాంటీ స్మాగ్ గన్స్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. అంటే వర్షం పడినట్టు అన్నమాట. దీని వల్ల కాలుష్య కణాలు కింద పడిపోతాయి. ఫలితంగా గాలి కాస్త స్వచ్చంగా మారుతుంది. యాంటీ స్మాగ్ గన్ సుమారు 150 అడుగుల ఎత్తు వరకు నీటిని పిచికారీ చేయగలదు. ఒక నిమిషంలో 30 నుంచి 100 లీటర్ల నీటిని పిచికారీ చేస్తుంది. 


యాంటీ స్మోగ్ గన్ వర్క్


పెద్ద నగరాల్లో పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని తగ్గించడమే కాకుండా, యాంటీ-స్మాగ్ గన్ లను కొన్ని ఇతర అవసరాలకు కూడా ఉపయోగిస్తున్నారు. మైనింగ్, గ్రైండింగ్, కోల్, స్టోన్ గ్రైండింగ్ సమయంలో ధూళిని అందుపు చేయడానికి యాంటీ స్మోగ్ గన్ లను ఉపయోగిస్తారు. ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నోయిడాలోని అక్రమ ట్విన్ టవర్లను కూల్చివేసినపుడు కూడా  యాంటీ స్మోగ్ గన్స్ ను ఉపయోగించారు. యాంటీ-స్మోగ్ గన్ లు విభిన్న నాజిల్స్ , ప్రొపెల్లర్ లతో డిజైన్ చేసి ఉంటాయి. వీటిని పరిస్థితి బట్టి అంటే మనం ఉపయోగించే విధానం బట్టి మార్చవచ్చు.