యూజీసీ నెట్ (నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్)- జూన్‌ 2023 సెషన్‌కు సంబంధించిన పరీక్షల షెడ్యూలు విడుదలైంది. సబ్జెక్టుల వారీగా పరీక్షల తేదీలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) వెల్లడించింది. ఈ మేరకు  జూన్ 8న అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూన్‌ 13 నుంచి 17 వరకు యూజీసీ నెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో రెండు షిఫ్టుల్లో పరీక్ష ఉంటుంది. మొదటి షిఫ్టులో ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, రెండో షిఫ్టులో మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు. హిందీ, ఇంగ్లిష్ మాధ్యమాల్లో ప్రశ్నలు అడుగుతారు.


యూజీసీ నెట్ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులను త్వరలో  విడుదల చేయనున్నారు. జూనియర్‌ రిసెర్చి ఫెలోషిప్‌, విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు పోటీపడేందుకు ఉపయోగపడే ఈ పరీక్షను నిర్వహిస్తారు. మొత్తం 83 సబ్జెక్టుల్లో కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష జరుగనుంది. ఏటా ఈ పరీక్షను రెండు సార్లు నిర్వహిస్తుంటారు.


పరీక్ష విధానం..


➥ ఆన్‌లైన్ (సీబీటీ) విధానంలో నిర్వహించే ఈ పరీక్షలో మొత్తం 2 పేపర్లు ఉంటాయి. రెండు పేపర్లకు కలిపి మూడు గంటల సమయం ఉంటుంది.


➥ పేపర్-1కు గంట, పేపర్-2 కు రెండు గంటల సమయం ఉంటుంది. పేపర్-1 లో 100 మార్కులకుగాను 50 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు. రీజనింగ్ ఎబిలిటీ, రీడింగ్ కాంప్రహెన్షన్, డైవర్‌జెంట్ థింకింగ్, జనరల్ అవేర్‌నెస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు.


➥ పేపర్-2లో 200 మార్కులకుగాను 100 ప్రశ్నలు అడుగుతారు. ఇందులో అభ్యర్థికి సంబంధించిన సబ్జెక్టు నుంచి ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు. అభ్యర్థుల ఆప్షనల్ సబ్జెక్టు నుంచి ప్రశ్నలు ఉంటాయి. హిందీ, ఇంగ్లిష్ మాధ్యమాల్లో ప్రశ్నలు అడుగుతారు.


తెలంగాణలో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, సికింద్రాబాద్, హయత్‌నగర్, జగిత్యాల, జనగాం, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మెదక్, మేడ్చల్, నల్గొండ, నిజామాబాద్, సంగారెడ్డి, సిద్ధిపేట, సూర్యాపేట, వరంగల్. 


ఏపీలో పరీక్ష కేంద్రాలు: అమరావతి, అనంతపురం, భీమవరం, చీరాల, చిత్తూరు-చిత్తూరు, తిరుపతి, ఏలూరు, గూడురు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, మచిలీపట్నం, మంగళగిరి, నంద్యాల, నర్సరావుపేట, నెల్లూరు, ఒంగోలు, ప్రొద్దుటూరు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తూర్పుగోదావి-సూరంపాలెం, పశ్చిమగోదావరి-తాడేపల్లిగూడెం, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.


యూజీసీ నెట్-జూన్ 2023 నోటిఫికేషన్, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..



Also Read:


'జోసా' కౌన్సెలింగ్ షెడ్యూలు వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే!
దేశవ్యాప్తంగా ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు, ఇతర కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే విద్యాసంస్థల్లో బీటెక్‌ సీట్ల భర్తీకి నిర్దేశించిన జోసా(జాయింట్‌ సీట్‌ అలొకేషన్‌ అథారిటీ) షెడ్యూలు జూన్ 7న విడుదలైంది. జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు జూన్ 18న వెలువడనున్నాయి. ఫలితాలు విడుదలైన మరుసటిరోజు నుంచే అంటే.. జూన్ 19 నుంచి జోసా కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభంకానుంది. జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన విద్యార్థులకు జూన్ 4న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. జోసా రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూన్ 19 నుంచి 29 వరకు కొనసాగనుంది.
జోసా కౌన్సెలింగ్ పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..


దేశంలోనే టాప్ విద్యాసంస్థగా ఐఐటీ మద్రాస్​, యూనివర్సిటీల్లో 10వ స్థానంలో హెచ్‌సీయూ!
దేశంలోని అత్యుత్తమ విద్యాసంస్థల్లో గతేడాది మొదటి స్థానంలో నిలిచిన ఐఐటీ-మద్రాస్ మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 2023 ర్యాంకుల్లో ఐఐటీ-మద్రాస్ తర్వాత రెండో స్థానంలో ఐఐఎస్సీ-బెంగళూరు నిలవగా, 3వ స్థానంలో ఐఐటీ-ఢిల్లీ నిలిచింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యాసంస్థల్లో ఐఐటీ-హైదరాబాద్ 14వ స్థానంలో నిలవగా, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 20వ స్థానంలో నిలిచింది. వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) 53వ స్థానంలో, ఉస్మానియా యూనివర్సిటీ 64వ స్థానంలో నిలిచింది. విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ 76వ స్థానంలో నిలిచింది. ఐఐటీ మద్రాసు అగ్రస్థానంలో నిలవడం ఇది ఐదోసారి కావడం విశేషం.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..