తెలంగాణ విద్యార్థులకు శుభవార్త. రాష్ట్రంలో ఇంజనీరింగ్ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS ECET) - 2021 దరఖాస్తు గడువును పొడిగించారు. రూ.500 ఆలస్య రుసుముతో జూలై 26 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని టీఎస్ ఈసెట్ కన్వీనర్ సీహెచ్ వెంకటరమణారెడ్డి ప్రకటన విడుదల చేశారు. రూ.5,000 ఆలస్య రుసుముతో జూలై 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఈసెట్ పరీక్ష ఆగస్టు 3న జరగనున్న నేపథ్యంలో మరోసారి దరఖాస్తు చేసుకోవడానికి వెసులుబాటు కల్పించారు. మరిన్ని వివరాలకు https://ecet.tsche.ac.in/ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.
ఆగస్టు 3న ఈ పరీక్ష రెండు సెషన్లలో జరగనుంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈసీఈ, ఈఐఈ, సీఎస్‌ఈ, ఈఈఈ విభాగాలకు.. మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు సీఐవీ, సీహెచ్‌ఈఎం, ఎంఈసీ, ఎంఐఎన్, ఎంఈటీ, పీహెచ్‌ఎం, బీఎస్‌ఎం విభాగాలకు పరీక్ష జరగనుంది.
తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (TSCHE) టీఎస్ ఈసెట్-2021 నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా బీటెక్/బీఈ/ బీఫార్మసీ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ ప్రవేశాలు పొందవచ్చు. డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్/టెక్నాలజీ/బీఎస్సీ (మ్యాథ్స్) ఉత్తీర్ణులు ఈసెట్ ర్యాంకుతో నేరుగా ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంలో అడ్మిషన్ పొందొచ్చు. డిప్లొమా ఇన్ ఫార్మసీ చదివిన విద్యార్థులకు బీఫార్మసీ సెకండ్ ఇయర్‌లో ప్రవేశాలు లభిస్తాయి. ఈ పరీక్షను హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (JNTU) నిర్వహిస్తోంది.
ముఖ్యమైన వివరాలు:
- దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
- దరఖాస్తు ఫీజు : ఎస్సీ ఎస్టీలకు రూ.400, ఇతరులకు రూ.800 చెల్లించాల్సి ఉంటుంది.
- పరీక్ష విధానం : కంప్యూటర్ బేస్డ్ పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
- నోటిఫికేషన్ తేది : మార్చి 17, 2021
- ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం : మార్చి 22, 2021
- రూ. 500 ఆలస్య రుసుముతో చివరి తేదీ : జూలై 26, 2021
- రూ. 5000 ఆలస్య రుసుముతో చివరి తేదీ : జూలై 30, 2021
- పరీక్ష తేదీ : ఆగస్టు 3, 2021 ( పరీక్ష ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో జరుగుతుంది.)
- వెబ్‌సైట్ వివరాలు : https://ecet.tsche.ac.in/
పరీక్ష విధానం..
ఈసెట్ పరీక్ష 200 ప్రశ్నలకు (200 మార్కులు) ఆబ్జెక్టివ్ విధానంలో జరుగుతుంది. పరీక్ష 3 గంటలపాటు ఉంటుంది. ఇంజనీరింగ్ డిప్లొమా చేసిన వారు ఇంజనీరింగ్ విభాగానికి చెందిన పరీక్షకు హాజరవ్వాల్సి ఉంటుంది. ఇందులో మ్యాథమెటిక్స్ (50 మార్కులు), ఫిజిక్స్ (25 మార్కులు), కెమిస్ట్రీ (25 మార్కులు), ఇంజనీరింగ్ పేపర్ (100 మార్కులు) సబ్జెక్టులు ఉంటాయి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అందరికీ ఒకేలా (కామన్‌గా) ఉంటాయి. ఇంజనీరింగ్ పేపర్ మాత్రం అభ్యర్థి బ్రాంచ్ మీద ఆధారపడి ఉంటుంది.
బీఎస్సీ మ్యాథ్స్ ఉత్తీర్ణులకు మ్యాథ్స్ (100 మార్కులు), అనలిటకల్ ఎబిలిటీ (50 మార్కులు), కమ్యూనికేటివ్ ఇంగ్లిష్ (50 మార్కులు) సబ్జెక్టులు ఉంటాయి. ఇక ఫార్మసీ విభాగం వారికి ఫార్మాస్యూటిక్స్ (50 మార్కులు), ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ (50 మార్కులు), ఫార్మకోగ్నసీ (50 మార్కులు), ఫార్మకాలజీ & టాక్సికాలజీ (50 మార్కులు) సబ్జెక్టులు ఉంటాయి.