తెలంగాణలో పదో తరగతి పరీక్షా ఫీజును ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు పదోతరగతి వార్షిక పరీక్ష ఫీజు చెల్లించే తేదీలను విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. నవంబరు 15 వరకు ఎలాంటి అపరాధరుసుము లేకుండా పరీక్ష ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. ఆయా పాఠశాలల హెడ్‌ మాస్టర్లకు ఫీజును చెల్లించాలని విద్యార్థులకు సూచించారు. ఇక రూ.50 ఆలస్యరుసుముతో నవంబర్‌ 30 వరకు, రూ.200 అపరాధ రుసుముతో డిసెంబర్‌ 15 వరకు, రూ.500 అపరాధ రుసుముతో డిసెంబర్‌ 29 వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. రెగ్యులర్‌ విద్యార్థులకు పరీక్ష ఫీజును రూ.125గా నిర్ణయించారు. ఫీజు చెల్లింపు తేదీల్లో ఏమైనా సెలవులు వస్తే.. మరుసటిరోజు ఫీజు చెల్లించవచ్చు.


ఫీజు నుంచి వీరికి మినహాయింపు..


కుటుంబ వార్షిక ఆదాయం పట్టణాల్లో రూ.24,000 కు మించకూడదు, అలాగే గ్రామాల్లో ఆదాయం రూ.20,000 మించకూడదు లేదా 2.5 ఎకరాల వెట్ ల్యాండ్/ 5 ఎకరాల డ్రై ల్యాండ్ ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఫీజు నుంచి మినహాయింపు వర్తిస్తుంది.



పదోతరగతి వార్షిక పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలు..

➥ ఆలస్యరుసుము లేకు ఫీజు చెల్లించడానికి చివరితేది: 15.11.2022.

➥ రూ.50 ఆలస్యరుసుముతో ఫీజు చెల్లించడానికి చివరితేది: 30.11.2022.

➥ రూ.200 ఆలస్యరుసుముతో ఫీజు చెల్లించడానికి చివరితేది: 15.12.2022.

➥ రూ.500 ఆలస్యరుసుముతో ఫీజు చెల్లించడానికి చివరితేది: 29.12.2022.

పరీక్ష ఫీజు వివరాలు..

➥ రెగ్యులర్ విద్యార్థులకు పరీక్ష ఫీజు: రూ.125.

➥ మూడు లేదా అంతకంటే తక్కువ సబ్జెక్టులు రాసేవారికి ఫీజు: రూ.110.

➥ మూడు సబ్జెక్టుల కన్నా ఎక్కువ సబ్జెక్టులు రాసేవారికి ఫీజు: రూ.125.

➥ ఒకేషనల్ విద్యార్థులు పరీక్ష ఫీజు: రూ.60 

Website



:: Also Read ::



టెన్త్‌ విద్యార్థులకు 11 పేపర్లతోనే 'ఎస్‌ఏ-1' పరీక్షలు! మరి ఫైనల్ ఎగ్జామ్స్‌లో?


తెలంగాణలో ఇక నుంచి పదోతరగతి పరీక్షలను 6 పేపర్లతోనే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ఇప్పటి వరకు 11 పేపర్లతో పదోతరగతి పరీక్షలు నిర్వహిస్తూ వస్తున్నారు. హిందీ మినహా మిగతా సబ్జెక్టులకు రెండు పేపర్లు చొప్పున పరీక్షలు ఉంటున్నాయి. అయితే గత రెండేళ్లుగా కొవిడ్ కారణంగా ఆరు పేపర్ల విధానాన్ని అమలు చేశారు. కరోనా కారణంగా రెండేళ్ళ పాటు విద్యార్ధులకు పరీక్షల నిర్వహణలో రకరకాల సమస్యలు తలెత్తాయి. విద్యార్ధులు ఎలాంటి పరీక్షలు లేకుండానే 8,9 తరగతుల నుంచి ఉత్తీర్ణులై పదిలోకి వచ్చేశారు.


పదోతరగతి పరీక్ష విధానంపై సమీక్ష జరిపిన NCERT విద్యార్థులకు 11 రోజుల పాటు పరీక్షలు నిర్వహించడం వల్ల వారిపై ఒత్తిడి పెరుగుతోందని, వాటిని ఆరు పేపర్లకు కుదించాలని ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. 6 పేపర్ల విధానానికే మొగ్గు చూపింది. నవంబర్‌ 1 నుంచి జరుగనున్న సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌ (ఎస్‌ఏ-1) పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను అక్టోబరు 12న పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం 9, 10వ తరగతి విద్యార్థులకు ఆరు పేపర్లు ఉంటాయని అందులో పేర్కొన్నారు. అయితే అప్పటికే కొన్ని జిల్లాల్లో ఆ జిల్లా విద్యాధికారుల ఆదేశాల మేరకు 11 పేపర్లకుగాను ప్రశ్నపత్రాలను ప్రింటింగ్‌ చేశారు. అయితే ఆరు పేపర్లే ఉంటాయని అధికారులు ఉత్తర్వుల్లో పేర్కొనడంతో కొత్తగా మళ్లీ ప్రశ్నపత్రాలను రూపొందించాల్సి ఉంటుంది.


దీంతో వెనక్కి తగ్గిన అధికారులు నవంబర్‌ 1 నుంచి జరిగే ఎస్‌ఏ-1కు మాత్రం 11 పేపర్లకు పరీక్షను నిర్వహించేలా, ఎస్‌ఏ-2, ఎస్‌ఎస్‌సీ వార్షిక పరీక్షలకు మాత్రం 6 పేపర్లకే పరీక్షలు నిర్వహించేలా అక్టోబరు 19న మరోసారి తాజా ఉత్తర్వులు జారీ చేశారు. అధికారుల తీరు, అనాలోచిత నిర్ణయాల వల్ల విద్యార్థుల్లో, ఉపాధ్యాయుల్లో గందరగోళం ఏర్పడింది. మారిన షెడ్యూల్‌ ప్రకారం నవంబర్‌ 1 నుంచి 7వ తేదీ వరకు ఎస్‌ఏ-1 పరీక్షలను ఒకటి నుంచి పదోతరగతి విద్యార్థులు రాయనున్నారు. ఉదయం ఒక పేపర్‌, మధ్యాహ్నం మరో పేపర్‌కు పరీక్షలు నిర్వహించేలా అధికారులు షెడ్యూల్‌ను రూపొందించారు.


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..