Telangana Universities: తెలంగాణలోని విశ్వవిద్యాలయాలకు త్వరలోనే కొత్త వైస్ ఛాన్స్లర్ల(వీసీ)ను నియమించనున్నారు. ఇందు కోసం ఇప్పటికే ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ నెలాఖరులోగా వీసీల నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ పరిధిలో మొత్తం12 యూనివర్సిటీలున్నాయి. వీటిలో 4 యూనివర్సిటీలకు వీసీలు లేరు. ఇందులో కొత్తగా వచ్చిన తెలంగాణ మహిళా యూనివర్సిటీతో పాటు రాజీవ్‌గాంధీ వైజ్ఞానికి సాంకేతిక విశ్వవిద్యాలయం(RGUKT)కు వీసీల నియామకం జరగలేదు.
తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సెలర్ ప్రొఫెసర్ రవీందర్ గుప్తా గతేడాది జూన్‌లో లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన సంగతి తెలిసిందే. ఈ కారణంగా ఆయనను పదవి నుంచి తప్పించారు. దీంతో ఆ స్థానం ఖాళీగా ఉంది. మిగిలిన వీసీల మూడేళ్ల కాలపరిమితి ఈ ఏడాది మే నెలతో ముగియనుంది. అయితే, ఈసారి యూనివర్సిటీల బలోపేతంపై దృష్టిపెట్టిన ప్రభుత్వం.. నిబంధనల ప్రకారం కాలపరిమితి ముగిసేలోపే కొత్తవారిని ఎంపిక చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా వీసీల భర్తీకి రాష్ట్ర ఉన్నత విద్యామండలి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనుంది. దీనిద్వారా అర్హులైన సీనియర్ ప్రొఫెసర్ల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. దరఖాస్తుల పరిశీలన అనంతరం, ప్రభుత్వానికి అధికారులు నివేదిక సమర్పిస్తారు. ఈ క్రమంలోనే ఒక్కో వర్సిటీకి ముగ్గురు సభ్యులతో కూడిన సెర్చ్ కమిటీని నియమించనుంది. దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారిని ఆ సెర్చ్ కమిటీలు ఒక్కో వర్సిటీకి ముగ్గురి పేర్లను గవర్నర్‌కు ప్రతిపాదిస్తారు. వీరిలో ఒకరిని గవర్నర్, వీసీగా నియమిస్తారు.
ఖాళీల భర్తీకీ కసరత్తు..
తెలంగాణలోని యూనివర్సిటీల్లో టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీని సాధ్యమైనంత త్వరలగా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డుకు (CRB) సంబంధించిన బిల్లును గత ప్రభుత్వం గవర్నర్‌కు పంపడం...గవర్నర్ దాన్ని రాష్ట్రపతికి పంపిన నేపథ్యంలో గవర్నర్ తమిళిసైతో మాట్లాడి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దీంతో విద్యాశాఖ ఈ అంశంపై దృష్టి సారించింది. కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఆమోదంపై తాజా పరిస్థితిని తెలుసుకొని...ఒకవేళ దాని ఆమోదం ఆలస్యమైతే పాత విధానంలోనే వర్సిటీల వారీగా నియామకాలు జరపాలని ప్రభుత్వం యోచిస్తోంది.
ఉమ్మడి బోర్డు ద్వారా ఆచార్యుల నియామకాలు చేపట్టాలని 2022 సెప్టెంబరులో అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టి గవర్నర్ ఆమోదానికి పంపారు. ఆ తర్వాత దాన్ని రాష్ట్రపతి పరిశీలనకు గవర్నర్ పంపారు. గతేడాది మరోసారి అసెంబ్లీలో బిల్లును ఆమోదించి గవర్నర్‌కు పంపినా ఆమోదం లభించలేదు. రాష్ట్రంలో ఉన్నత విద్యాశాఖ పరిధిలో 11 విశ్వవిద్యాలయాలుండగా 2,825 మంజూరు బోధనా సిబ్బంది పోస్టులకుగాను కేవలం 850 మందే పనిచేస్తున్నారు.
పాతపద్ధతిలోనే ఫ్యాకల్టీల భర్తీ..
రాష్ట్రంలోని 15 విశ్వవిద్యాలయాల్లో బోధన, బోధనేతర సిబ్బంది పోస్టుల భర్తీకి తలపెట్టిన ‘ది తెలంగాణ యూనివర్సిటీస్ కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు బిల్లు’ను కాంగ్రెస్ ప్రభుత్వం ఉపసంహరించుకోనుంది. పాత పద్ధతిలోనే వర్సిటీ రిక్రూట్‌మెంట్లు నిర్వహించాలని నిర్ణయించింది. ఏ యూనివర్సిటీ పరిధిలోని పోస్టులను ఆయా వర్సిటీలే నోటిఫికేషన్లు జారీచేసి, భర్తీచేస్తాయి. ఆయా పోస్టుల భర్తీకి ఎలాంటి స్క్రీనింగ్ టెస్ట్ ఉండదు. సర్టిఫికెట్ల పరిశీలన, ఇంటర్వ్యూ విధానంలో నియామకాలను పూర్తిచేస్తారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లు ఉపసంహరణకు ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవలే విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని ఆదేశించారు. దీంతో ఈ బిల్లు ఉపసంహరణకు రాజ్‌భవన్‌తో సీఎంవో, విద్యాశాఖ వర్గాలు సంప్రదింపులు జరుపుతున్నాయి.