Telangana Tenth SSC Results: తెలంగాణలో పదో తరగతి పరీక్షా ఫలితాలను ఈ నెల 30న (మంగళవారం) విడుదల చేయనున్నారు. ఆ రోజు ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యా శాఖ కమిషనర్ కార్యాలయంలో ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేస్తారు. ఈ మేరకు ఎస్ఎస్ సీ బోర్డు అధికారికంగా ప్రకటించింది. తెలంగాణలో పదో తరగతి పరీక్షలు మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకూ జరగ్గా.. రాష్ట్రవ్యాప్తంగా 5,08,385 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో 2,57,952 మంది బాలురు కాగా.. 2,50,433 మంది బాలికలు. ఏప్రిల్ 3 నుంచి జవాబు పత్రాల స్పాట్ వాల్యూయేషన్ ప్రక్రియ మొదలైంది. ఏప్రిల్ 20తో మూల్యాంకనం పూర్తైంది. రాష్ట్రంలో 11 జిల్లాల్లోని 19 కేంద్రాల్లో ఈ వ్యాల్యూయేషన్ ప్రక్రియ చేపట్టారు. అయితే.. గతేడాదితో పోలిస్తే.. ఈ ఏడాది 10వ తరగతి పరీక్షలు తొందరగా ప్రారంభమైన విషయం తెలిసిందే. అలాగే.. ఫలితాలు కూడా కొంత ముందుగానే విడుదల చేస్తున్నారు.
24న ఇంటర్ ఫలితాలు
అటు, తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఈ నెల 24న ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. ఇంటర్ విద్యా మండలి కార్యాలయంలో విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేయనున్నట్లు ఇంటర్ విద్యా మండలి కార్యదర్శి శ్రుతి ఓజా తెలిపారు. ఇంటర్ ఫస్టియర్, సెకండ్ ఇయర్ పరీక్షల ఫలితాలను ఒకేసారి విడుదల చేయనున్నారు. విద్యార్థులు ఫలితాల కోసం https://tsbie.cgg.gov.in తో పాటు https://telugu.abplive.com//amp వెబ్‌సైట్‌లోనూ చెక్ చేసుకోవచ్చు.
రాష్ట్రంలో ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు దాదాపు 9,80,978 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో.. 4,78,527 మంది ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు కాగా.. 4,43,993 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఉన్నారు. ఇక ఒకేషనల్ కోర్సులకు సంబంధించి మొదటి సంవత్సరం 48,277 మంది విద్యార్థులు, ద్వితీయ సంవత్సరం 46,542 మంది విద్యార్థులు ఉన్నారు.
Also Read: TSRTC సిబ్బందిపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు- డ్రైవర్ రాములుపై దాడిని ఖండించిన సజ్జనార్