Tasty Millet Ravva Dosa Recipe : మిల్లెట్స్ ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తాయి. ముఖ్యంగా సమ్మర్​లో రాగిపిండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. శరీరంలోని వేడిని తగ్గించడం మొదలుకొని.. బరువు తగ్గడంలో బాగా హెల్ప్ చేస్తుంది. అందుకే  దీనిని సమ్మర్​లో ఏదోరకంగా డైట్​లో తీసుకోవాలంటున్నారు నిపుణులు. మరి ఇంకెందుకు ఆలస్యం రాగిపిండితో టేస్టీ, క్రిస్పీ రవ్వదోశను చేసుకోవచ్చు. ఇది రవ్వ దోశ కంటే మంచి రుచిని ఇస్తుంది. అంతేకాకుండా ఆరోగ్యానికి కూడా ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది. మరి ఈ హెల్తీ రెసిపీని ఏ విధంగా తయారు చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏంటి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 


కావాల్సిన పదార్థాలు 


రాగిపిండి - 1 కప్పు


బొంబాయి రవ్వ - 1 కప్పు


గోధుమ పిండి - అరకప్పు


ఉప్పు - తగినంత 


ఇంగువ - చిటికెడు


కరివేపాకు - 2 రెబ్బలు (సన్నగా తురుముకోవాలి)


మిరియాల పొడి - అర టీస్పూన్


జీలకర్ర - 1 స్పూన్


పచ్చిమిర్చి - 2 టీస్పూన్లు 


పలుచని మజ్జిగ - 1 లీటరు


నీరు - తగినంత


నూనె - దోశలు రోస్ట్ చేయడానికి


ఉల్లిపాయ ముక్కలు - పెనం మీద వేసుకోవడానికి 


తయారీ విధానం


ముందుగా కరివేపాకు, పచ్చిమిర్చిని సన్నగా తురుముకోవాలి. ఇప్పుడు ఓ మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలో రాగిపిండి తీసుకోవాలి. అదే పిండిలో బొంబాయి రవ్వ, గోధుమ పిండి వేసి బాగా కలుపుకోవాలి. గోధుమ పిండి ప్లేస్​లో మీరు బియ్యం పిండిని వేసుకోవచ్చు. ఇది పిండికి కాస్త జిగురునిస్తుంది. ఇప్పుడు దానిలో సాల్ట్, ఇంగువ, జీలకర్ర, మిరియాల పొడి, పచ్చిమిర్చి తురుము, కరివేపాకు తురుము వేసి కలుపుకోవాలి. అప్పుడు దానిలో మజ్జిగ వేస్తూ పిండిని కలుపుకోవాలి. మజ్జిగను ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా వేస్తూ పిండిని కలపాలి. ఇలా కలిపిన పిండి ఓ పది నిమిషాలు పక్కన పెట్టేయాలి. పది నిమిషాల తర్వాత మజ్జిక పిండిలోకి వెళ్లి కాస్త గట్టిపడుతుంది. దోశ  వేసుకోవడానికి పిండి కాస్త పలుచగా ఉండాలి. అందుకే దానిలో ఓ అరలీటర్ నీరు వేసి రవ్వ దోశకు కలిపినట్లు పిండిని కలుపుకోవాలి. అప్పుడే పిండి దోశ వేయాడనికి సిద్ధమవుతుంది. 


ఇప్పుడు స్టౌవ్ వెలిగించి దానిపై దోశ తవా పెట్టాలి. అయితే మీరు క్రంచీ రవ్వ దోశ చేసుకోవాలనుకున్నప్పుడు నాన్​స్టిక్​ దోశ పాన్​ కన్నా.. ఐరన్ దోశ తవాను ఎంచుకుంటే దోశలు బాగా వస్తాయి. స్టౌవ్ మీద వెలిగించిన దోశ తవా అన్ని వైపులా వేడిగా అయ్యేలా చూసుకోండి. మధ్యలో వేడిగా ఉండి.. చివర్లలో కాకుండా దోశలు మంచిగా రావు. కాబట్టి తవాను అన్ని వైపులా వేడి చేయండి. ఇప్పుడు దానిపై ఓ రెండు టీస్పూన్ల నూనెను వేసి స్ప్రెడ్ చేయండి. దానిలో ఉల్లిపాయలు చల్లి ఇప్పుడు దోశ పిండిని తీసుకుని.. పెనంపై చిలకరించినట్లు.. పూర్తిగా దోశ పాన్​ అంతా వచ్చేలా వేయండి. గ్యాప్స్​లో కూడా పిండిని వేసుకుంటూ.. ఓ పలుచని దోశ వేసుకోవచ్చు. పిండిని అన్నివైపులా సమానంగా ఉంటేనే బాగుంటుంది.


దోశ అంచులకు నూనె వేయాలి. మధ్యలో కూడా నూనె వేసి.. దోశను చివర్లు కూడా రోస్ట్ అయ్యేలా జరుపుతూ.. దానిని కాల్చాలి. ఇలా చేస్తే దోశ అన్నివైపులా క్రిస్పీగా వస్తుంది. లేదంటే మధ్యలోనే ఎక్కువ కాలిపోతుంది. అంతే దోశ రెడీ. ఇలా ఓ రెండు మూడు దోశలు వేసుకునే లోపు పిండి గట్టిపడుతుంది. కాబట్టి మరికొంత నీటిని దానిలో వేసి మళ్లీ కలుపుకుని పిండిని పలుచగా చేసుకోవాలి. సమయం గడిచే కొద్ది నీటిని కలుపుకోవాలని గుర్తించుకోండి. ఈ టేస్టీ, క్రిస్పీ మిల్లెట్ రవ్వ దోశలను కొబ్బరి చట్నీ లేదా అల్లం చట్నీతో వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. పైగా ఇవి ఆరోగ్యానికి కూడా ఎన్నో ప్రయోజనాలు అందిస్తాయి. 


Also Read : సమ్మర్​ స్పెషల్ టేస్టీ ఫ్రూట్ కస్టర్డ్.. ఈ టిప్స్​తో సింపుల్​గా రెడీ చేసేయండి