Summer Special Fruit Custard Recipe : ఫ్రూట్ కస్టర్డ్ అంటే పిల్లలు ఇష్టంగా తింటారు. పెద్దలు కూడా సమ్మర్లో బయట వీటిని తీసుకుంటూ ఉంటారు. కానీ కొందరికి దీనిని ఎలా తయారు చేయాలో తెలియదు. కానీ చాలా సింపుల్‌గా దీనిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. హెల్తీ, టేస్టీగా ఈ ఫ్రూట్ కస్టర్డ్ రావాలంటే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి? కావాల్సిన పదార్థాలు ఏమిటి? దీనిని ఎలా తయారు చేయాలి? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
పాలు - 1 లీటర్
కస్టర్డ్ పౌడర్ - 4 టేబుల్ స్పూన్లు
పంచదార - అరకప్పు
మిక్స్డ్ ఫ్రూట్ ఎసెన్స్ - పావు టీస్పూన్
అరటి పండు - 1
ఆపిల్ - 1 ఆపిల్
సపోటా - 1
కివి - 1
డేట్స్ - 7
జీడిపప్పు - 50 గ్రాములు
నల్ల ద్రాక్ష - 50 గ్రాములు
ద్రాక్ష - 50 గ్రాములు
దానిమ్మ గింజలు - అర కప్పు
తయారీ విధానం
ముందుగా పావు లీటర్ పాలు తీసుకోండి. దానిలో కస్టర్డ్ పౌడర్ వేసి ఉండలు లేకుండా కలపండి. అనంతరం దానిలోనే వెనిలా ఎసెన్స్ వేసి మరోసారి బాగా తిప్పాలి. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి.. దానిపై మందపాటి కడాయి పెట్టండి. దానిలో పాలు వేసి.. మీడియం మంట మీద మరిగించండి. ఇక్కడ పాలు క్రీమ్ మిల్క్ తీసుకుంటే మంచిది. అవి మరిగిన తర్వాత దానిలో అరకప్పు పంచదార వేసి కలపాలి. అనంతరం ముందుగా పాలల్లో మిక్స్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ వేసి బాగా కలపాలి. ముద్దలు లేకుండా దానికి కలుపుతూ చిక్కగా ఉడకనివ్వాలి. అది ఉడికి చిక్కబడిన తర్వాత స్టౌవ్ ఆపేయండి. రూమ్ టెంపరేచర్‌కి వచ్చిన తర్వాత దానిని ఫ్రిడ్జ్‌లో పెట్టి రెండు గంటలు ఉంచండి.
ఆలోపు ఫ్రూట్స్‌ని కట్ చేసుకోవాలి. అయితే మీరు ఫ్రూట్స్‌ని కూడా ఫ్రిడ్జ్‌లో పెడితే రుచి మరింత పెరుగుతుంది. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని ఫ్రూట్స్‌కి పైన తొక్క తీసేయాలి. పుల్లని ఫ్రూట్స్ నారింజ వంటివి వేయకుండా ఉంటేనే మంచిది. సపోటాకి పైన తొక్కతీసి గుజ్జును ముక్కలుగా కోయాలి. అలా చేసినప్పుడు సీడ్స్కూడా తీసేయొచ్చు. దానిమ్మ గింజలు పక్కన పెట్టుకోవాలి. ద్రాక్షలను మధ్యలోకి కోస్తే రుచి బాగుంటుంది. అరటి పండు, యాపిల్ తప్పా అన్ని ఫ్రూట్స్‌ని మీరు కట్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవచ్చు. ఇవి ఎందుకు వద్దంటే.. వాటిని కట్ చేసి ఫ్రిడ్జ్‌లో పెడితే రంగు మారిపోతాయి.
సర్వింగ్ చేసుకోవాలనుకున్నప్పుడు అరటి, యాపిల్‌ను ముక్కలు చేసుకోవాలి. యాపిల్‌పై తొక్క పీల్ చేస్తే తినడానికి సౌకర్యంగా ఉంటుంది. రెండు గంటల తర్వాత కస్టర్డ్ మిశ్రమం పెరుగులా మారుతుంది. దీనిని నేరుగానే ఫ్రూట్స్‌తో మిక్స్ చేసుకోవచ్చు. కానీ అది మరింత క్రీమ్‌గా రావాలంటే.. దానిని మిక్సీలో వేసి.. క్రీమ్‌గా వచ్చేవరకు బ్లెండ్ చేయాలి. ఇప్పుడు సర్వింగ్ చేసుకుని లాగించేయాలి. అయితే సర్వింగ్ చేసేప్పుడు ముందుగా గ్లాస్లో ఓ కస్టర్డ్ మిక్స్ వేయాలి. అనంతరం దానిపై లేయర్‌గా ఫ్రూట్స్ వేయాలి. మరికొంచెం కస్టర్డ్ వేసి.. డ్రైఫ్రూట్స్ వేసుకోవాలి. మళ్లీ కస్టర్డ్, ఫ్రూట్స్ ఇలా లేయర్స్‌గా వేసుకుంటే తినడానికి చాలా బాగుంటుంది.
రుచిని మరింత రెట్టుపు చేసుకోవాలంటే.. ఇలా రెడీ చేసుకున్న గ్లాస్‌ను మరో గంట ఫ్రిడ్జ్‌లో ఉంచి తింటే.. దాని రుచి మిమ్మల్ని కట్టిపడేస్తుంది. సమ్మర్లో టేస్టీగా, కూల్‌గా తినాలనుకుంటే ఇది మంచి ఆప్షన్ అవుతుంది. హెల్తీగా, ఇంటిల్లీపాది చక్కగా కూర్చోని దీనిని ఆస్వాదించవచ్చు. మధ్యాహ్నం తినాలనుకుంటే మార్నింగ్ దీనిని ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు కూడా దీనిని చాలా ఇష్టంగా తింటారు. పెద్దలు కూడా వేడి నుంచి ఉపశమనం కోసం ఈ టేస్టీ కస్టర్డ్‌ను తినవచ్చు. మరి ఈ సమ్మర్‌కి మీరు కూడా ఈ టేస్టీ ఫ్రూట్ కస్టర్డ్‌ను చేసేసుకోండి.
Also Read : బరువు తగ్గాలనుకుంటే రాత్రి ఏడు గంటలకు ముందే డిన్నర్ ఫినిష్ చేసేయాలట.. నిపుణులు ఏమంటున్నారంటే