తెలంగాణలో పదోతరగతి ప్రశ్నపత్రాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. పదోతరగతి వార్షిక ప్రశ్నపత్రాల్లో వ్యాసరూప, షార్ట్ క్వశ్చన్స్ చాయిస్, మార్కుల్లో స్వల్ప మార్పులు చేస్తూ బుధవారం (జనవరి 11) పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మార్పులన్నీ 9వ తరగతికి కూడా వర్తించనున్నాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇటీవలే పదోతరగతి పరీక్షల్లో 11 పేపర్లను ఆరుకు తగ్గించిన విషయం తెలిసిందే. అయితే, ప్రశ్నల సంఖ్య, మార్కులపై పలు అభ్యంతరాలు వ్యక్తం కావడంతో విద్యాశాఖ వాటిని సవరించింది.
డిసెంబరు 28న జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం వ్యాసరూప ప్రశ్నల సెక్షన్‌లో ఇంతకుముందు ఇంటర్నల్ ఛాయిస్ మాత్రమే ఉంది. ఇందులోభాగంగా, గతంలో వ్యాసరూప ప్రశ్నల విభాగంలో 12 ప్రశ్నలకు ఆరు ప్రశ్నలకు సమాధానం రాయాల్సి ఉండేది. కానీ, ఇప్పుడు ప్రశ్నల సంఖ్యను ఆరుకు తగ్గించారు. ఇందులో ఏవేనీ నాలుగు ప్రశ్నలకు సమాధానం రాస్తే సరిపోతుంది. ఇదివరకు వ్యాసరూప ప్రశ్నలకు ఒక్కో ప్రశ్నకు ఐదు మార్కులుండగా, ఇప్పుడు ఆరు మార్కులకు పెంచారు.
ప్రశ్నల విభాగంలో గతంలో మాదిరిగానే ఇచ్చిన ఆరు ప్రశ్నలకూ సమాధానం రాయాలి. ఈ విభాగంలో గతంలో ఒక్కో ప్రశ్నకు మూడు మార్కులుండగా ఇప్పుడు నాలుగు మార్కులకు పెంచారు. అతి స్వల్ప ప్రశ్నల విభాగంలో గతంలో మాదిరిగానే ఆరు ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు కలిపారు. ఆబ్జెక్టివ్ విభాగంలోనూ గతంలో మాదిరిగానే 20 ప్రశ్నలుంటాయి ఒక్కోదానికి ఒక మార్కు కేటాయించారు.
ఉపాధ్యాయ సంఘాల నుంచి ఒత్తిడి..
రెండేళ్లపాటు కరోనా కారణంగా ప్రత్యక్ష తరగతులకు దూరమై...అభ్యసన సామర్థ్యాలు తగ్గాయని.. పరీక్షల విధానంలో మార్పులు చేయాలని..ఛాయిస్ పెంచాలని ఉపాధ్యాయ సంఘాల నుంచి ఒత్తిడి రావడంతో తాజాగా ఇంటర్నల్ ఛాయిస్‌ను తొలగించింది. ఆరు ప్రశ్నల్లో నాలుగింటికి సమాధానాలు రాయాలని పేర్కొంది. దీనివల్ల మిగిలిన రెండు సెక్షన్లలో ఒక్కో ప్రశ్నకు మార్కుల కేటాయింపు మారింది. ఈ మార్పు తెలుగు, ఆంగ్లం, హిందీ సబ్జెక్టులకు ఉండదు. మిగిలిన భాషేతర సబ్జెక్టులైన మ్యాథ్స్, సైన్స్, సోషల్ సబ్జెక్టులకు.. అదీ వచ్చే ఏప్రిల్‌లో జరిగే వార్షిక పరీక్షలతో పాటు 2023-24 విద్యా సంవత్సరానికి మాత్రమే వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మార్పులన్నీ 9వ తరగతికి కూడా వర్తించనున్నాయి.
Also Read:
టీఎస్ పాలిసెట్-2023 నోటిఫికేషన్ విడుదల, పూర్తి వివరాలు ఇలా!
తెలంగాణలోని పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన పాలిసెట్-2023 నోటిఫికేషన్ జనవరి 11న వెలువడింది. వచ్చే విద్యాసంవత్సరానికి టీఎస్ పాలిసెట్ ప్రవేశ పరీక్ష మే 17న నిర్వహించనున్నారు. పదోతరగతి పూర్తయిన, చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. జనవరి 16 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. విద్యార్థులు ఏప్రిల్ 24 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రూ.100 ఆలస్యరుసుముతో ఏప్రిల్ 25 వకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.250 చెల్లిస్తే సరిపోతుంది.
పాలిసెట్ నోటిఫికేషన్, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..
ఫిబ్రవరిలోనే ఇంటర్ ప్రాక్టికల్స్! కొత్త షెడ్యూలు ఇదే!
ముందు ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఏప్రిల్15 నుంచి మే10 వరకు రెండు విడతలుగా ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహించాల్సి ఉంది. అయితే మే వరకు ప్రాక్టికల్స్ ఉండటంతో ఎంసెట్ తదితర పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు తగిన సమయం సరిపోదని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రాక్టికల్స్ పరీక్షల షెడ్యూల్ మార్చాలని కళశాలల యాజమాన్యాల నుంచి ఇంటర్ బోర్డుకు విజ్ఞప్తులు అందాయి. దీంతో థియరీ ఎగ్జామ్స్‌కు ముందే ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహించాలని ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఫిబ్రవరిలో పరీక్షలు నిర్వహించేందుకు తాజా షెడ్యూలును ప్రకటించింది.
ప్రాక్టికల్ పరీక్షల షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..