ఏపీలో ఇంటర్ విద్యార్థుల ప్రాక్టికల్ పరీక్షల షెడ్యూల్ మారింది. థియరీ పరీక్షలకన్నా ముందే ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఫిబ్రవరి 26 నుంచి మార్చి 7 వరకు ఇంటర్ రెగ్యులర్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనుండగా.. వొకేషనల్ కోర్సులకు ఫిబ్రవరి 20 నుంచి మార్చి 7 వరకు నిర్వహించనున్నారు. ప్రాక్టికల్ పరీక్షలను 10 రోజుల పాటు రెండు సెషన్స్‌లో నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్షలు ఉంటాయని ఇంటర్ బోర్డు వెల్లడించింది.
ప్రాక్టికల్ పరీక్షలతో పాటు ఇతర పరీక్షల తేదీలను కూడా ఇంటర్ బోర్డు మార్చింది. వీటిలో ఫిబ్రవరి 22న నిర్వహించాల్సిన ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్షను ఫిబ్రవరి 15న నిర్వహించనున్నట్లు తెలిపింది. అలాగే ఫిబ్రవరి 24న నిర్వహించాల్సిన ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షను ఫిబ్రవరి 17న నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది. థియరీ పరీక్షలు యథావిధిగా షెడ్యూలు ప్రకారమే కొనసాగుతాయని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది.
ముందు ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఏప్రిల్15 నుంచి మే10 వరకు రెండు విడతలుగా ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహించాల్సి ఉంది. అయితే మే వరకు ప్రాక్టికల్స్ ఉండటంతో ఎంసెట్ తదితర పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు తగిన సమయం సరిపోదని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రాక్టికల్స్ పరీక్షల షెడ్యూల్ మార్చాలని కళశాలల యాజమాన్యాల నుంచి ఇంటర్ బోర్డుకు విజ్ఞప్తులు అందాయి. దీంతో థియరీ ఎగ్జామ్స్‌కు ముందే ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహించాలని ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఫిబ్రవరిలో పరీక్షలు నిర్వహించేందుకు తాజా షెడ్యూలును ప్రకటించింది.
మార్చి 15 నుంచి వార్షిక పరీక్షలు..
కాగా ఏపీలో ఇంటర్ వార్షిక పరీక్షల షెడ్యూలును ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు డిసెంబరు 26న ప్రకటించిన సంగతి తెలిసందే. షెడ్యూలు ప్రకారం మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలను మార్చి 15 నుంచి ఏప్రిల్ 3 వరకు నిర్వహించనున్నారు. అదేవిధంగా మార్చి 16 నుంచి ఏప్రిల్ 4 వరకు ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు జరుగనున్నాయి.
ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్స్ షెడ్యూలు:
➥ మార్చి 15 - బుధవారం - సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1
➥ మార్చి 17 - శుక్రవారం - ఇంగ్లిష్ పేపర్-1
➥ మార్చి 20 - సోమవారం - మ్యాథ్స్ పేపర్-1ఎ, బోటనీ పేపర్-1, సివిక్స్-1.
➥ మార్చి 23 - గురువారం - మ్యాథ్స్-1బి, జువాలజీ పేపర్-1, హిస్టరీ పేపర్-1
➥ మార్చి 25 - శనివారం - ఫిజిక్స్ పేపర్-1, ఎకనావిుక్స్ పేపర్-1
➥ మార్చి 28 - మంగళవారం - కెవిుస్ట్రీ పేపర్-1, కామర్స్ పేపర్-1, సోషియాలజీ పేపర్-1, ఫైన్ ఆర్ట్స్& మ్యూజిక్ పేపర్-1
➥ మార్చి 31 - శుక్రవారం - పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-1, లాజిక్ పేపర్-1, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ పేపర్-1 (బైపీసీ విద్యార్థులకు).
➥ ఏప్రిల్ 3 - సోమవారం - మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-1, జియోగ్రఫీ పేపర్-1
ఇంటర్ సెకండియర్ ఎగ్జామ్స్ షెడ్యూలు:
➥ మార్చి 16 - గురువారం - సెకండ్ లాంగ్వేజ్ పేపర్-2
➥ మార్చి 18 - శనివారం - ఇంగ్లిష్ పేపర్-2
➥ మార్చి 21 - మంగళవారం - మ్యాథ్స్ పేపర్-2ఎ, బోటనీ, సివిక్స్-2.
➥ మార్చి 24 - శుక్రవారం - మ్యాథ్స్ పేపర్-2బి, జువాలజీ పేపర్-2, హిస్టరీ పేపర్-2.
➥ మార్చి 27 - సోమవారం - ఫిజిక్స్ పేపర్-2, ఎకనామిక్స్ పేపర్-2.
➥ మార్చి 29 - బుధవారం - కెవిుస్ట్రీ పేపర్-2, కామర్స్ పేపర్-2, సోషియాలజీ పేపర్-2, ఫైన్ ఆర్ట్స్& మ్యూజిక్ పేపర్-2
➥ ఏప్రిల్ 1 - శనివారం - పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-2, లాజిక్ పేపర్-2, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ పేపర్-2 (బైపీసీ విద్యార్థులకు).
➥ ఏప్రిల్ 4 - మంగళవారం - మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-2, జియోగ్రఫీ పేపర్-2
మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..