తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు 'ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టం' త్వరలోనే అమల్లోకి రానుంది. విద్యార్థుల హాజరునమోదుకు ఈ విధానాన్ని అందుబాటులోకి తేనున్నారు. ఇందుకోసం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో పనిచేసే ప్రత్యేక యాప్‌ను ప్రభుత్వం రూపొందించింది. డీఎస్‌సీఎఫ్‌ఆర్‌సీ పేరిట ఈ యాప్‌ను వినియోగంలోకి తేనున్నారు. ఈ యాప్‌లో ఒకసారి విద్యార్థుల కన్ను, కనురెప్ప, ముక్కు వంటి 70 ఫేషియల్ పాయింట్లను నమోదు చేస్తారు.
ప్రధానోపాధ్యాయుడు లేదా ఉపాధ్యాయుడు తమ స్మార్ట్‌ఫోన్‌లో యాప్ ఓపెన్ చేసి విద్యార్థుల ముఖం వైపు చూపితే చాలు హాజరు నమోదవుతుంది. ఒకేసారి తరగతి గదిలోని 15-20 మంది హాజరు కూడా తీసుకోవచ్చు. ఒకటో తరగతిలో విద్యార్థి ఫేషియల్ పాయింట్లు తీసుకుంటే డిగ్రీ చదివే వరకు పనిచేస్తుంది. ఈ కొత్త విధానాన్ని పాఠశాలలతోపాటు కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు, గురుకులాల్లోనూ అమలు చేయనున్నారు. ఈ విధానాన్ని ఉపాధ్యాయులకు అమలు చేయడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
కృత్రిమ మేధ సాంకేతికతతో పనిచేసే ఈ యాప్ ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు విధానాన్ని మరింత ఆధునికీకరించనుంది. ప్రస్తుతం ఉపాధ్యాయుల హాజరు కోసం 18 జిల్లాల్లో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తున్నారు. విద్యార్థులకూ బయోమెట్రిక్ హాజరు తీసుకోవాలనుకున్నా నెరవేరలేదు. ఈ క్రమంలోనే తక్కువ ఖర్చుతో, పరికరాలను ముట్టుకోకుండానే ముఖ గుర్తింపు హాజరును అమలు చేయాలని నిర్ణయించిన విద్యాశాఖ ఏప్రిల్‌లోనే టెండర్లు పిలిచింది. వారం పది రోజుల్లో మూడేళ్ల కాంట్రాక్టుకుగాను సర్వీస్ ప్రొవైడర్‌ను ఎంపిక చేసే అవకాశం ఉంది.
రాష్ట్రవ్యాప్తంగా అమలు..
ఇప్పటికే మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో ప్రయోగాత్మకంగా కొన్ని పాఠశాలల్లో అమలు చేశారు. పరిశీలించిన అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 26 వేల ప్రభుత్వ పాఠశాలల్లోని 22 లక్షల మంది విద్యార్థులు, 1.10 లక్షల మంది ఉపాధ్యాయుల హాజరు కోసం రెండు నెలల్లో ఈ విధానాన్ని అమలు చేయాలని విద్యాశాఖ భావిస్తోంది. తాజాగా 20 వేల ట్యాబ్‌లు కూడా ఇచ్చినందున అందులో యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని హాజరు నమోదు చేయవచ్చని చెబుతోంది.
ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేస్తుంది..
కృత్రిమ మేధ అల్గారిథమ్‌తో పనిచేసే ఈ యాప్‌తో ఒకసారి విద్యార్థుల ముఖంలోని కన్ను, కనురెప్ప, ముక్కు ఇలా 70 వరకు ఫేసియల్ పాయింట్లను గుర్తిస్తుంది. హెచ్‌ఎం లేదా ఉపాధ్యాయుడి వద్ద ఉన్న స్మార్ట్‌ఫోన్‌లో యాప్ ఓపెన్ చేసి విద్యార్థుల ముఖం వైపు చూపితే చాలు హాజరు నమోదవుతుంది. ఒకేసారి 15 - 20 మంది హాజరు తీసుకోవచ్చు. విద్యార్థులు ఆ ఫోన్ ముందు నుంచి వెళ్తుండగానే హాజరు తీసుకుంటుంది. ఒకటో తరగతిలో ఒకసారి ఫేసియల్ పాయింట్లు తీసుకుంటే డిగ్రీ వరకు పనిచేస్తుంది. పిల్లలు పెద్ద వారయినా, ముఖ కవళికలు మారినా, ఆ యాప్ ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకుంటూ వెళ్తుందని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులకూ ఈ విధానాలే వర్తిస్తాయి. ‘యాప్‌లో విద్యార్థుల ముఖాన్ని ఫొటో తీయడం, నిల్వ చేయడం ఉండదు. వ్యక్తిగత గోప్యతకు భంగం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. డేటా కూడా కేవలం ప్రభుత్వ సర్వర్లలోనే స్టోర్ అవుతుంది’ అని విద్యాశాఖ వర్గాలు చెప్పాయి. ఈ యాప్ కేవలం పాఠశాలల్లో మాత్రమే పనిచేస్తుంది. వారం వారీగా హాజరు శాతం నివేదికలు పొందొచ్చు. మధ్యాహ్న భోజన హాజరుకు కూడా దీన్ని వినియోగించుకోవచ్చు.