Courses After 10th Class: పదో తరగతి వరకు చదువు పునాది అయితే, భవిష్యత్తు నిర్మాణానికి బాటలు వేసే చదువు ఆ తర్వాతే మొదలవుతుంది. ఏ కెరీర్ ఎంచుకోవాలనే నిర్ణయం ఇక్కడే జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది. సైన్స్, ఆర్ట్స్ గ్రూపులు చదివాలా? లేదా టెక్నికల్ గ్రూపుల్లోకి వెళ్ళాలా? ఇంకా ఏదైనా డిప్లొమా కోర్సులు చేయాలా? అనే కన్‌ఫ్యూజన్ పదో తరగతి తర్వాత విద్యార్థులందరికీ మామూలే. ఆసక్తిని బట్టి గ్రూపును ఎంచుకొనే అవకాశాలు ఇప్పుడెన్నో ఉన్నాయి. వాటి గురించి తెలుసుకొని సరైన కోర్సును ఎంచుకోండి. పదో తరగతి తర్వాత ఏమేం చదవచ్చో ఆ కోర్సుల వివరాలు తెలుసుకుందాం.
ఇంటర్మీడియెట్
సబ్జెక్టుల మీద ఆసక్తిని బట్టి పదో తరగతి కంటే ముందు నుంచే తమకు ఇంటర్ లో ఏ గ్రూపు సూట్ అవుతుందో చాలా మంది నిర్ణయించుకొనే ఉంటారు. డాక్టర్, ఇంజినీర్, టీచర్ వంటి వృత్తులు ఎప్పటికీ వన్నె తగ్గని వృత్తులు. అందుకని విద్యార్థులు ఇంటర్ లో బైపీసీ, ఎంపీసీ, సీఈసీ గ్రూపులను ఎంచుకుంటారు. ఫ్యూచర్లో ఈ వృత్తులను ఎంచుకోవటానికి ఐఐటీ-జేఈఈ, నీట్, క్లాట్ వంటి జాతీయ ఎంట్రన్స్ పరీక్షలు, ఎంసెట్, డైట్ సెట్, లా సెట్ వంటి రాష్ట్రస్థాయి ఎంట్రన్స్ టెస్టులు రాయటానికి ఇంటర్ చదవటం తప్పనిసరి..
ఏ గ్రూపు ఎంచుకోవాలో నిర్ణయించేదెలా?
పదో తరగతి అయిపోగానే ఏం చదవాలి? ఫ్యూచర్ ఏమిటి? అనే ఒత్తిడి సహజం. దానికి తోడు కొందరు పేరెంట్స్ కూడా వారి ఎక్స్పెక్టేషన్స్ తో ఏది చదవాలో వారే నిర్ణయించి ఇంకా ఒత్తిడి పెంచేస్తుంటారు. మీరు కెరియర్ గైడెన్స్ ఇవ్వటం తప్పు కాదు. కానీ, మీ పిల్లలకు ఏ గ్రూపుల మీద ఆసక్తి ఉందో గమనించి ఎంకరేజ్ చేయటం చాలా ముఖ్యం.
ఇంజినీరింగ్ చేయాలని ఆసక్తి ఉన్న విద్యార్థులు ఇంటర్ లో ఎంపీసీ ఎంచుకోవాల్సి ఉంటుంది. డాక్టర్ వృత్తి చేపట్టాలనుకునే వారు ఇంటర్ లో బైపీసీ తీసుకుంటారు. లాయర్, టీచర్ వృత్తుల పట్ల ఆసక్తి ఉన్నవారు ఇంటర్ లో తమకు నచ్చిన ఏ గ్రూపయినా తీసుకోవచ్చు. ఇవి ప్రాముఖ్యం ఉన్న గ్రూపులు. ఇవి కాకుండా సైకాలజీ, సోషియాలజీ, మ్యూజిక్ వంటి దాదాపు 80 రకాల కోర్సులు చాలా వరకు ఇప్పుడు అందుబాటులో ఉంటున్నాయి. వీటిని ఇంటర్ నుంచి ఎంచుకునే విద్యార్థులు మాత్రం తక్కువగానే ఉన్నారు.
పాలిటెక్నిక్
పదో తరగతి తరవాత టెక్నికల్ ఎడ్యుకేషన్ వైపు వెళ్లాలనుకునే వారికి పాలిటెక్నిక్ మంచి ఆప్షన్. ఇది ఇంజినీరింగ్ కి దగ్గరి మార్గం కూడా. పాలిటెక్నిక్ తర్వాత డైరెక్ట్ బీటెక్ రెండో సంవత్సరంలో చేరిపోవచ్చు. పాలిటెక్నిక్ వ్యవధి మూడేళ్లు. ఇందులో కూడా కంప్యూటర్స్, సివిల్స్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ వంటి బ్రాంచులు ఉంటాయి. ఇష్టమైన రంగాన్ని బట్టి బ్రాంచ్ ఎంచుకోవచ్చు. ఇంజినీరింగ్ చేసేంత ఆర్థిక స్థోమత లేని విద్యార్థులకు కూడా పాలిటెక్నిక్ డిప్లొమా తర్వాత మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి.
అగ్రికల్చర్ పాలిటెక్నిక్
వ్యవసాయ రంగం మీద ఆసక్తితో గ్రామాల్లో స్థిరపడుతున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. అయితే అగ్రికల్చర్ డిప్లొమా కోర్సులు పదో తరగతి అవగానే అందుబాటులో ఉన్నాయి. ఈ ఉన్నత విద్యలు ఉపాధి కూడా కల్పించటంతో పాటు, పిల్లలకు వ్యవసాయాన్ని పాషన్ గా మారుస్తున్నాయి.
డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ లో ఆర్గానిక్ ఫార్మింగ్, సీడ్ టెక్నాలజీ వంటి వివిధ కోర్సులు ఉన్నాయి. వీటితో పాటు, ఉద్యానవన, డెయిరీ, ఫిషరీ వంటి డిప్లొమాలు కూడా ఉంటాయి. కోర్సును బట్టి, రెండేళ్లు లేదా మూడేళ్ల వ్యవధి ఉంటుంది.
వీటితో పాటూ, ఐటీఐ, ఒకేషనల్ కోర్సులు, ఇతర డిప్లొమా కోర్సులు కూడా ఉంటాయి. ఆసక్తిని బట్టి ఎంచుకోవాలే గాని పదో తరగతి తర్వాతే స్పీడ్ గా వృత్తి విద్యను అభ్యసించే మార్గాలు ఇవి.