OU PhD Admissions Through UGC NET: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ విభాగాల్లో పీహెచ్‌డీ ప్రవేశాలను ఇకపై యూజీసీ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (UGC NET) స్కోరు ఆధారంగానే కల్పించనున్నారు. ఈ మేరకు పీహెచ్‌డీ ప్రవేశాలకు సంబంధించి ఉస్మానియా విశ్వవిద్యాలయం(ఓయూ) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విద్యాసంవత్సరం (2024-25) నుంచి నెట్ అర్హత ఉన్నవారితోనే పీహెచ్‌డీ సీట్లను భర్తీచేయనున్నారు. దేశవ్యాప్తంగా నేషనల్ టెస్టింగ్ (NTA) నిర్వహించే ఈ నెట్ పరీక్షలో అభ్యర్థులు చూపిన ప్రతిభ ఆధారంగా జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్(JRF)కు ఎంపికైన వారితో సగం పీహెచ్‌డీ సీట్లు, నెట్ ఉత్తీర్ణులైన వారితో మిగిలిన సగాన్ని భర్తీ చేస్తామని ఓయూ రిజిస్ట్రార్ ఆచార్య లక్ష్మీనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ విద్యాసంవత్సరం నుంచి వర్సిటీల ప్రవేశ పరీక్షలకు బదులుగా 'నెట్' స్కోర్‌తో పీహెచ్‌డీ ప్రవేశాలు చేసుకోవచ్చని.. ఈ ఏడాది మార్చిలో యూజీసీ సూచించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచే ఈ విధానాన్ని అమలుచేయనున్నట్లు ఓయూ రిజిస్ట్రార్ తెలిపారు. ఓయూ పరిధిలో పీహెచ్‌డీ ప్రవేశాలకు సంబంధించి.. సగం సీట్లను నెట్, జేఆర్‌ఎఫ్ ద్వారా భర్తీ చేస్తుండగా.. మిగిలిన సీట్లను ఓయూ నిర్వహించే ప్రవేశ పరీక్ష ద్వారా భర్తీ చేసేవారు.
ఇక 'సెట్' పరీక్ష ఉండదా?
తెలంగాణలో పీహెచ్‌డీ ప్రవేశాల కోసం రాష్ట్రస్థాయిలో 'టీజీసెట్' పరీక్ష నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీంతోపాటు కేటగిరీ-1 కింద పీహెచ్‌డీ ప్రవేశాలకు ఉస్మానియా యూనివర్సిటీ ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేసి ప్రవేశాలు కల్పిస్తోంది. అయితే సెట్ పరీక్ష పాసైనా పీహెచ్‌డీ సీటు ఇవ్వరా? అన్న అంశంపై వివరణ ఇస్తూ.. దాన్ని డిగ్రీ కళాశాలలు, వర్సిటీల్లో సహాయ ఆచార్యులుగా చేరేందుకే పరిగణనలోకి తీసుకుంటారన్నారు. దీనిపై తుదినిర్ణయం ఇంకా తీసుకోలేదని, రాష్ట్ర ఉన్నత విద్యామండలితో సంప్రదించి 50 శాతం సీట్లను ఎలా భర్తీ చేయాలో చర్చించాల్సి ఉందని ఓయూ రిజిస్ట్రార్ చెబుతున్నారు. నెట్‌లో కొన్ని సబ్జెక్టులకు పరీక్షలు లేవని, వాటికి ఏం చేయాలి అన్న అంశాన్ని చర్చిస్తున్నామని ఆయన తెలిపారు.
కేటగిరీ-1 ప్రవేశాలకు కొనసాగుతున్న ఇంటర్వ్యూలు..
ఉస్మానియా యూనివర్సిటీలో ఈవిద్యాసంవత్సరానికి 240 పీహెచ్‌డీ సీట్లు భర్తీ కావాల్సి ఉంది. అందులో సగం సీట్లను కేటగిరీ-1గా పిలిచే జేఆర్‌ఎఫ్‌కు ఎంపికైన వారికి కేటాయిస్తారు. వాటి ప్రవేశాలకు ఇటీవల నోటిఫికేషన్ విడుదలైంది. ప్రస్తుతం ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. ఈనెలాఖరు నాటికి ప్రవేశాల ప్రక్రియ పూర్తవుతుందని రిజిస్ట్రార్ తెలిపారు. కేటగిరీ-1 కింద సైన్స్, సోషల్ సైన్సెస్, కామర్స్, ఇంజినీరింగ్, ఆర్ట్స్, లా విభాగాల్లో పీహెచ్‌డీ ప్రవేశాలు కల్పించనున్నారు.
పీహెచ్‌డీ కాలపరిమితి ఆరేళ్లు..
ఇకమీదట పీహెచ్‌డీ కాలపరిమితి కనీసం మూడేళ్లు, గరిష్ఠంగా ఆరేళ్లు ఉంటుంది. రీ-రిజిస్ట్రేషన్ ప్రక్రియ ద్వారా గరిష్ఠంగా 2 ఏళ్ల అదనపు సమయం ఇస్తారు. ఎట్టిపరిస్థితుల్లోనూ పీహెచ్‌డీ పూర్తికి 8 ఏళ్ల పరిమితి మించకూడదు. మహిళలు, దివ్యాంగుల (40శాతానికి మించి వైకల్యం ఉన్నవారు)కు మరో 2 ఏళ్ల పరిమితి ఇవ్వడానికి అవకాశం కల్పించారు. ఇలాంటివారు పీహెచ్‌డీలో చేరిన నాటి నుంచి పదేళ్లలో దాన్ని పూర్తిచేయడానికి వీలుంటుంది. మహిళా అభ్యర్థులు పీహెచ్‌డీ చేస్తున్న సమయంలో 240 రోజులపాటు ప్రసూతి, శిశుపాలన సెలవులు తీసుకోవచ్చు.