ఆహార రంగంలో కెరీర్‌ను ఎంచుకోవాలనుకునేవారికి గుడ్ న్యూస్. ఫుడ్ టెక్నాలజీలో బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు నిఫ్టెమ్ (నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ అండ్ టెక్నాలజీ ఎంట్రప్రెన్యూర్‌షిప్) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా 2021–22 విద్యాసంవత్సరంలో ప్రవేశాలు చేపట్టనుంది. దరఖాస్తులను ఆన్‌లైన్ విధానంలో స్వీకరిస్తోంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆగస్టు 8వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. మరిన్ని వివరాలకు www.niftem.ac.in వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.
కోర్సులు, అర్హతల వివరాలు..
- బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ (బీటెక్)
బీటెక్ కోర్సు కాలవ్యవధి నాలుగేళ్ల పాటు ఉంటుంది. మొత్తం 189 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇంటర్ లేదా తత్సమాన విద్యలో ఉత్తీర్ణత సాధించిన వారు మాత్రమే బీటెక్ పుడ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ కోర్సులో ప్రవేశం పొందేందుకు అర్హులు. దీంతో పాటుగా జేఈఈ మెయిన్–2021లో తప్పనిసరిగా అర్హత సాధించి ఉండాలి. సెంట్రల్ సీట్ అలొకేషన్ బోర్డ్ (సీఎస్‌ఏబీ- CSAB) నిర్వహించే సెంట్రల్ కౌన్సెలింగ్ ద్వారా ప్రవేశాలు పొందవచ్చు. - మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ (ఎంటెక్)
ఎంటెక్ కోర్సు కాలవ్యవధి రెండేళ్లు ఉంటుంది. ఫుడ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్, ఫుడ్ సేఫ్టీ అండ్ క్వాలిటీ మేనేజ్‌మెంట్, ఫుడ్ ప్రాసెస్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్‌మెంట్, ఫుడ్ సప్లయ్ చైన్ మేనేజ్‌మెంట్, ఫుడ్ ప్లాంట్ ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్ విభాగాల్లో ఈ కోర్సు అందిస్తారు. ఒక్కో విభాగంలో 18 సీట్లు ఉంటాయి. సంబంధిత విభాగంలో నాలుగేళ్ల బ్యాచిలర్ డిగ్రీ లేదా మాస్టర్స్ డిగ్రీ కనీసం 60 శాతం మార్కులతో పాస్ అయి ఉండాలి. ఎస్టీ అభ్యర్థులు అయితే 55 శాతం మార్కులు సరిపోతాయి. గేట్ స్కోర్ ఆధారంగా అర్హులను ఎంపిక చేస్తారు. గేట్ స్కోర్ లేని వారు నిఫ్టెమ్ జరిపే ప్రవేశ పరీక్ష రాసి.. అందులో అర్హత సాధించాల్సి ఉంటుంది. - ఎంబీఏ..
ఇందులో డ్యూయల్ స్పెషలైజేషన్ ఉంది. ఫుడ్ అండ్ అగ్రి బిజినెస్ మేనేజ్‌మెంట్, మార్కెటింగ్/ఫైనాన్స్/ ఇంటర్నేషనల్ బిజినెస్ విభాగాల్లో ఎంబీఏ చేసే సదుపాయం ఉంది. మొత్తం 32 సీట్లు ఉంటాయి. బ్యాచిలర్ డిగ్రీ/తత్సమాన విద్య కనీసం 50 శాతం మార్కులతో పాస్ అయి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 45 శాతం మార్కులు సరిపోతాయి. గత రెండేళ్ల క్యాట్ లేదా మ్యాట్ స్కోర్ ఆధారంగా అర్హుల ఎంపిక ఉంటుంది. వీటిలో స్కోర్ లేని వారికి ఇంటర్నల్ టెస్ట్ ఉంటుంది. ఈ టెస్ట్‌లో ప్రతిభ చూపిన వారికి గ్రూప్ డిస్కషన్/పర్సనల్ ఇంటర్వూ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. - పీహెచ్‌డీ..
ఇందులో అగ్రికల్చర్ అండ్ ఎన్విరాన్‌మెంట్ సైన్సెస్, ఫుడ్ ఇంజనీరింగ్, ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫుడ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ అండ్ ఎంట్రప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్, బేసిక్ అండ్ అప్లయిడ్ సైన్సెస్ విభాగాల్లో పీహెచ్‌డీలో చేరవచ్చు. మొత్తం 33 సీట్లు ఉన్నాయి. సంబంధిత విభాగంలో కనీసం 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు. నెట్ జేఆర్‌ఎఫ్‌లో క్వాలిఫై లేదా నిఫ్టెమ్ జరిపే రీసెర్చ్ ఎంట్రన్స్ టెస్ట్ అర్హత సాధించిన వారికి ఇంటర్వ్యూల ద్వారా ప్రవేశం కల్పిస్తారు. సీఎస్‌ఐఆర్ యూజీసీ జేఆర్‌ఎఫ్ లేదా ఇతర జేఆర్‌ఎఫ్ అర్హత సాధించిన వారు ప్రవేశ పరీక్ష రాయాల్సిన అవసరం లేదు. వీరు ఇంటర్వూకు హాజరు కావడం తప్పనిసరి.
రూ.5 లక్షల వరకూ వార్షిక వేతనం..
నిఫ్టెమ్ అందించే కోర్సులకు ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) గుర్తింపు ఉంది. దేశంలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ రంగంలో కోర్సులు పూర్తి చేసి, నైపుణ్యాలు ఉన్న వారికి భారీ ప్యాకేజీలతో కొలువులు దక్కుతున్నాయి. గ్రాడ్యుయేషన్ స్థాయి కోర్సులతో ఆహార రంగంలో ఉద్యోగం పొందిన వారికి వార్షిక ప్రారంభ వేతనం రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఉంటుంది. అనుభవం, పనితీరు ఆధారంగా వేతనాల్లో పెరుగుదల ఉంటుంది.