ఎంపీ రఘురామకృష్ణరాజు, ఓ టీవీ ఛానల్ ఛైర్మన్ మధ్య లావాదేవీలు జరిగాయని... వాటిపై విచారణ చేపట్టాలని ప్రధానికి వైసీపీ ఎంపీలు విజ్ఞప్తి చేశారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వ చట్టాలను ఉల్లంఘించారని... ఆ వివరాలు లేఖతో జత చేసినట్టు వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి తెలిపారు.
ఎంపీ రఘురామకృష్ణరాజు... ఆ టీవీ ఛానల్ అధినేత... మధ్య జరిగిన ఛాటింగ్‌లో చాలా అంశాలు బయటకు వచ్చాయని ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు విజయసాయి రెడ్డి. పార్టీ లోక్‌సభాపక్ష నేత పీవీ మిథున్‌రెడ్డి సహా 15 మంది ఎంపీల సంతకాలతో కూడిన ఫిర్యాదు లేఖను వైసీపీ ఎంపీల టీం సోమవారం సాయంత్రం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు అందజేసింది.
ఎంపీ రఘురామకృష్ణరాజు, టీవీ ఛానల్ అధినేత మధ్య చట్టాలను ఉల్లంఘిస్తూ జరిగిన అక్రమ లావాదేవీ, మనీ లాండరింగ్‌పై ఆంధ్రప్రదేశ్ పోలీసులు కీలక సాక్ష్యాధారాలు సేకరించిందని... మనీలాండరింగ్, ఫారిన్ ఎక్సే్ఛంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ 1999లోని పలు నిబంధనల ఉల్లంఘనలను ప్రాథమికంగా రుజువు చేసే సాక్ష్యాధారాలు దొరికాయన్నారు ఎంపీలు. దర్యాప్తులో భాగంగా ఏపీ సీఐడీ పోలీసులు కేసులో ప్రధాన నిందితుడి ఫోన్‌ను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లో శాస్త్రీయంగా విశ్లేషించినప్పుడు పది లక్షల యూరోల అక్రమ హవాలా వ్యవహారానికి సంబంధించిన ఆధారాలు బయటపడ్డాయని పేర్కొన్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఇచ్చిన నివేదికను కూడా ఈ ఫిర్యాదుతో జతపర్చారు.
నిందితులైన కె.రఘురామకృష్ణరాజు, టీవీ ఛానల్ అధినేతపై పీఎంఎల్‌ఏ, ఫెమా చట్టాల కింద కేసు నమోదు చేసి సీబీఐ విచారణకు ఆదేశించాలని ప్రధానిని విజయసాయిరెడ్డి కోరారు. నిందితులు విదేశాలకు పారిపోకుండా తగిన చర్యలు తీసుకోవాలని, కస్టడీలోకి తీసుకుని అనుమానాస్పద లావాదేవీలను వెలికి తీసేలా ఆదేశించాలన్నారు.
ఈ వ్యవహారంలో మనీ లాండరింగ్‌కు సంబంధించి అనుమానాస్పద లావాదేవీలను వివరిస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు సీఐడీ రాసిన లేఖను, సంభాషణలను ప్రధానికి పంపిన ఫిర్యాదులో విజయసాయిరెడ్డి జోడించారు. ప్రధాన నిందితుడు ఎంపీ రఘురామకృష్ణరాజుకి సంబంధించి సీజైన మొబైల్ ఫోన్‌ను ఏపీఎఫ్‌ఎస్‌ఎల్‌కు ఫోరెన్సిక్ విశ్లేషణ కోసం పంపామని, దాని నివేదిక అందిందని సీఐడీ తన లేఖలో పేర్కొంది.
ఇటీవల కాలంలో రఘురామకృష్ణరాజు నిర్వహిస్తున్న విద్యుత్ ఉత్పత్తి కంపెనీలపై కూడా ఎంపీలు కేంద్రానికి లేఖలు రాశారు. ఆయా కంపెనీల్లో అక్రమాలు జరుగుతున్నాయని... వాటిని నిలువరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇప్పుడు ఆయన సంభాషణలు, లావాదేవీలపై గురి పెట్టారు. మరోవైపు ఆయన్ని అనర్హుడిగా ప్రకటించాలని పార్లమెంట్‌లో కూడా పట్టుబడుతున్నారు.