ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు విధుల్లో చేరి రెండేళ్లు పూర్తి కావస్తోన్న నేపథ్యంలో ప్రభుత్వం వీరికి అసెస్‌మెంట్ పరీక్షను నిర్వహించనుంది. దీనికి సంబంధించి గత కొద్ది రోజులుగా వస్తోన్న ఊహాగానాలపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టత ఇచ్చారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు పర్మినెంట్ కావాలంటే డిపార్ట్‌మెంట్ పరీక్ష తప్పనిసరిగా పాస్ కావాల్సిందేనని వెల్లడించారు.
నిబంధనల ప్రకారమే పరీక్ష..
ప్రొబేషన్ పూర్తి అయ్యాక పర్మినెంట్ చేసేందుకు నిబంధనల ప్రకారమే ఈ పరీక్ష ఉంటుందని.. ఐఏఎస్ సహా అన్ని విభాగాల్లోని ఉద్యోగులకు ఇదే విధానం అమలవుతోందని పేర్కొన్నారు. ఈ పరీక్షలో ఎవరైనా అభ్యర్థులు పాస్ కాకపోతే ప్రొబేషన్ పీరియడ్ పొడిగిస్తారని.. పాస్ అయితే వెంటనే ఉద్యోగాలు పర్మినెంట్ చేస్తారని వివరించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తోన్న ఏ ఒక్కరి ఉద్యోగం పోదని సజ్జల భరోసా ఇచ్చారు. సచివాలయ ఉద్యోగులకు డిపార్ట్‌మెంట్ టెస్టు తప్ప మరే ఇతర పరీక్ష ఉండదని క్లారిటీ ఇచ్చారు.
రెండేళ్ల సర్వీసు పూర్తవుతుండటంతో..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా రెండేళ్ల క్రితం రికార్డు స్థాయిలో పలు ఉద్యోగాలను భర్తీ చేసిన విషయం తెలిసిందే. అప్పుడు కొలువులు పొందిన వారంతా.. 2019 అక్టోబర్ 2న విధుల్లో చేరారు. వీరందరికీ ప్రభుత్వం రెండేళ్ల పాటు ప్రొబేషన్ పీరియడ్ విధించింది. ఈ ఏడాది అక్టోబర్ 2వ తేదీకి సచివాలయ ఉద్యోగులకు రెండేళ్ల సర్వీసు పూర్తవుతుండటంతో వారికి నిబంధనల ప్రకారం ప్రొబేషన్ డిక్లేర్ చేసి పే స్కేలు అమలు చేయనుంది. అయితే దీని కంటే ముందుగా ఉద్యోగులందరికీ అసెస్‌మెంట్ పరీక్షను నిర్వహించాలని నిర్ణయించింది.
సెప్టెంబర్ 11 – 17 తేదీల మధ్య..
దీనికి సంబంధించి అధికారులు ఇప్పటికే ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ అసెస్‌మెంట్ పరీక్షను సెప్టెంబర్ 11 – 17 తేదీల మధ్య నిర్వహించాలని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. ఈ పరీక్ష మొత్తం 100 మార్కులకు ఉండనుంది. పరీక్షకు 90 నిమిషాల సమయం కేటాయించాలనే యోచిస్తోంది.
ప్రస్తుతం 1.21 లక్షల మంది 9 ప్రభుత్వ శాఖలకు అనుబంధంగా సచివాలయాల్లో విధులను నిర్వర్తిస్తున్నారు. ఈ పరీక్షకు శాఖల వారీగా సిలబస్ రూపొందించాలని గ్రామ, వార్డు సచివాలయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ఆయా శాఖలకు ఇప్పటికే లేఖలు రాశారు. ఏమైనా శాఖలు 65 ప్రశ్నల కేటగిరీలో రాతపరీక్షకు బదులుగా ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించాలని అనుకుంటే వాటికి తగిన ఏర్పాట్లను చేసుకోవచ్చని సూచనలు ఇచ్చారు. ఈ అసెస్‌మెంట్ పరీక్షకు సంబంధించిన బాధ్యతలను ఏపీపీఎస్సీకి (APPSC) అప్పగించినట్లు అజయ్ జైన్ వెల్లడించారు. ప్రశ్న పత్రాల తయారీ, మార్కుల వెల్లడి వంటివన్నీ ఏపీపీఎస్సీ నిర్వహించనుంది.
ఫెయిల్ అయినా తొలగించరు..
గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు నిర్వహించనున్న అసెస్‌మెంట్ పరీక్షలో ఫెయిల్ అయినా కూడా వారిని సర్వీసుల నుంచి తొలగించరని ఏపీఎన్‌జీఓ సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు వెల్లడించారు. ఉద్యోగుల నైపుణ్యాలను తెలుసుకునేందుకే ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారని.. ఫెయిల్ అయిన వారిని తొలగించే అవకాశం లేదని వివరణ ఇచ్చారు.