దేశవ్యాప్తంగా మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్‌(యూజీ) పరీక్ష ఫలితాల్లో మెరిట్‌ జాబితాలను నిర్ణయించే ప్రక్రియలో మార్పులు చేయాలని నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ నిర్ణయించింది. ఒకే స్కోరు వచ్చిన అభ్యర్థులకు ర్యాంక్‌లు కేటాయించడంలో ఇకపై ఫిజిక్స్‌ మార్కులకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం బయాలజీ మార్కులకు ప్రాధాన్యమిస్తుండగా ఇకపై ఆ నిబంధనను సవరించాలని నిర్ణయించింది.  ఈ మేరకు గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ రెగ్యులేషన్‌-2023ను జాతీయ వైద్య మండలి ఇటీవల విడుదల చేసింది. ఒకవేళ, సబ్జెక్టుల మార్కులు కూడా ఒకే విధంగా ఉంటే.. అప్పుడు కంప్యూటర్‌ ఆధారిత డ్రా ద్వారా మెరిట్‌ లిస్ట్‌ను తయారు చేయనున్నట్లు ఎన్‌ఎంసీ తెలిపింది. ఇందులో మానవ ప్రమేయం ఏమీ ఉండదని తెలిపింది. ఈ కొత్త రెగ్యులేషన్స్‌ను వచ్చే ఏడాది నుంచి అమల్లోకి తీసుకొచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. దీనిపై జాతీయ వైద్య మండలి, జాతీయ టెస్టింగ్‌ ఏజెన్సీ త్వరలోనే మరింత వివరణ ఇవ్వనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.


మెరిట్‌ జాబితాతో పాటు మరికొన్ని నిబంధనల్లోనూ మార్పులు చేశారు. కొత్త నిబంధనల ప్రకారం.. ఎంబీబీఎస్‌ కోర్సులో చేరిన విద్యార్థులు తమ ప్రవేశ తేదీ నుంచి 9 ఏళ్లలో కోర్సును పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇక, ప్రథమ సంవత్సరంలో ఉత్తీర్ణత సాధించేందుకు నాలుగు ప్రయత్నాలను మాత్రమే ఇచ్చింది. అంతేగాక, నీట్‌-యూజీ మెరిట్‌ లిస్ట్‌ ఆధారంగా దేశంలోని అన్ని మెడికల్‌ ఇనిస్టిట్యూట్‌లలో గ్రాడ్యుయేషన్‌ కోర్సుల ప్రవేశాల కోసం కామన్‌ కౌన్సెలింగ్‌ ఉంటుందని ఎన్‌ఎంసీ తెలిపింది.


'టై-బ్రేకర్‌' నిబంధన..
నీట్‌-యూజీ పరీక్షకు హాజరైన విద్యార్థులు ఒకే స్కోరు/మార్కులు సాధించినప్పుడు ‘టై’ అవుతుంది. నిబంధనల ప్రకారం.. అలాంటి సమయాల్లో ర్యాంకులను కేటాయించేందుకు టై-బ్రేకర్‌ రూల్‌ను పాటిస్తారు. ప్రస్తుతమున్న నిబంధనల ప్రకారం.. ఇలా టై అయినప్పుడు బయాలజీ మార్కులను చూస్తారు. అందులో ఎవరికి ఎక్కువ వస్తే వారికి ర్యాంక్‌ కేటాయిస్తారు. తక్కువ వచ్చిన వారికి ఆ తర్వాతి ర్యాంక్‌ ఇస్తారు. బయాలజీలోనూ ఒకే మార్కులు ఉంటే కెమిస్ట్రీ, ఆ తర్వాత ఫిజిక్స్‌ మార్కులు చూసి ర్యాంకులను కేటాయిస్తున్నారు. సబ్జెక్టుల్లోనూ టై ఉంటే.. అభ్యర్థి వయసు బట్టి.. పెద్దవారికి మొదట ర్యాంక్‌ కేటాయిస్తారు. అయితే, ఈ టై బ్రేకింగ్‌ రూల్స్‌ను మార్చాలని జాతీయ వైద్య మండలి తాజాగా నిర్ణయించింది. కొత్త నిబంధనల ప్రకారం.. విద్యార్థుల స్కోరు సమానమైనప్పుడు.. తొలుత ఫిజిక్స్‌లో వచ్చిన మార్పుల ఆధారంగా ర్యాంకులను కేటాయిస్తారు. అవి కూడా సమానంగా ఉంటే కెమిస్ట్రీ, ఆ తర్వాత బయాలజీ మార్కులను పరిగణిస్తారు. అప్పటికీ టై వీడకపోతే.. కంప్యూటర్‌తో డ్రా తీసి ర్యాంకును కేటాయించాలని నిర్ణయించింది. ఈ కంప్యూటర్‌ డ్రాలో మానవ జోక్యం ఉండదని ఎన్‌ఎంసీ అధికారులు చెబుతున్నారు.


Also Read:

'దోస్త్'లకు సీట్ల కేటాయింపు, తొలి విడతలో 73,220 మందికి ప్రవేశాలు!
తెలంగాణ రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల‌కు సంబంధించి విద్యార్థులకు 'దోస్త్' తొలిదశ సీట్లను కేటాయించారు. మొద‌టి విడత‌లో 73,220 మంది సీట్లు కేటాయించిన‌ట్లు ఉన్నత విద్యామండ‌లి జూన్ 16న ఒక ప్రకటనలో తెలిపింది. సీట్లు పొందిన విద్యార్థుల్లో 44,113 మంది అమ్మాయిలు, 29,107 మంది అబ్బాయిలు ఉన్నారు. దోస్త్‌ ద్వారా ప్రవేశాలకు అందుబాటులో 889 కళాశాలలు ఉండగా.. వాటిల్లో  మొత్తం సీట్లు 3,56,258 సీట్లు ఉన్నాయి. ఇక 63 కళాశాలల్లో ఎలాంటి ప్రవేశాలు జరుగలేదు. డిగ్రీ కామ‌ర్స్ కోర్సుల్లో చేరేందుకే విద్యార్థులు సుముఖ‌త చూపించడం విశేషం. మొత్తం 33,251 మంది విద్యార్థులు కామ‌ర్స్ కోర్సుల‌ను ఎంపిక చేసుకున్నారు. సీట్లు పొందిన విద్యార్థుల జూన్ 16 నుంచి 25 వరకు సంబంధిత కళాశాలల్లో ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
సీట్ల కేటాయింపు పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..