జేఈఈ మెయిన్‌ నాలుగో విడత ఫలితాలు ఎట్టకేలకు విడుదలయ్యాయి. గత ఐదు రోజులుగా ఫలితాల కోసం వేచిచూస్తున్న లక్షలాది మంది విద్యార్థుల నిరీక్షణకు తెరపడింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) మంగళవారం అర్ధరాత్రి దాటాక ఫలితాలను విడుదల చేసింది. జేఈఈ మెయిన్‌ ఫలితాల్లో 18 మంది విద్యార్థులకు ఫస్ట్ ర్యాంకు వచ్చింది. మొత్తం 44 మంది 100 పర్సంటైల్ సాధించారు. ఇక ఈ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు తమ సత్తా చాటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నలుగురు, తెలంగాణకు చెందిన ఇద్దరు విద్యార్థులు ఫస్ట్ ర్యాంకు కైవసం చేసుకున్నారు. ఏపీకి చెందిన దుగ్గినేని వెంకట పణీష్‌, కర్నం లోకేశ్‌, పసల వీరశివ, కంచనపల్లి రాహుల్‌ నాయుడు.. తెలంగాణకు చెందిన జోస్యుల వెంకటాదిత్య, కొమ్మ శరణ్యలకు మొదటి ర్యాంకు వచ్చింది. పరీక్ష ఫలితాలపై కేంద్ర విద్యా శాఖ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. పరీక్ష ఫలితాలను jeemain.nta.nic.inలో తెలుసుకోవచ్చు. 


అర్ధరాత్రి దాటాక ఫలితాలు.. 
మంగళవారం రాత్రి జేఈఈ మెయిన్ నాలుగో విడత ఫలితాలు విడుదల చేస్తారని వార్తలు రావడంతో విద్యార్థులు అర్ధరాత్రి వరకు వేచిచూశారు. అర్ధరాత్రి దాటాక ఫలితాలు రిలీజ్ అయ్యాయి. జేఈఈ మెయిన్‌ సెషన్‌ నాలుగో సెషన్ పరీక్షను ఆగస్టు 26, 27, 31, సెప్టెంబర్‌ 1వ తేదీన నిర్వహించారు. పరీక్ష పేపర్ కీని సెప్టెంబర్‌ 6న రిలీజ్ చేశారు. కాగా.. గతంలో విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ సెప్టెంబర్‌ 11వ తేదీన స్టార్ట్ కావాల్సి ఉంది. అయితే ఫలితాల విడుదలలో జాప్యం నెలకొన్న కారణంగా వాయిదా వేశారు. ఇక అక్టోబర్ 3న జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష యథాతథంగా జరుగుతుందని ఎన్‌టీఏ స్పష్టం చేసింది. 


ఇదే అత్యధికం.. 
జేఈఈ మెయిన్ పరీక్షలో అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు హాజరవ్వడం ఇదే తొలిసారి కావడం విశేషం. మొత్తం 7.32 లక్షల మంది నాలుగో సెషన్ పరీక్ష రాశారు. జేఈఈ మెయిన్స్‌ పరీక్షను ఏడాదికి 4 సార్లు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. మొదటి సెషన్‌లో 6.61 లక్షల మంది, రెండో సెషన్‌లో 6.19 లక్షల మంది, మూడో సెషన్‌లో 7.09 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. జేఈఈ మెయిన్ పరీక్షను తెలుగు, ఉర్దూ భాషలతో పాటు ఇంగ్లిష్, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, గుజరాతీ, అస్సామీ, బెంగాలీ, మరాఠీ, ఒరియా, పంజాబీ సహా 13 భాషలలో నిర్వహిస్తారు.






Also Read: AP Degree Colleges Reopen: వచ్చే నెల 1 నుంచి డిగ్రీ తరగతులు.. అకడమిక్ క్యాలెండర్ విడుదల


Also Read: JEE Advanced 2021: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష దరఖాస్తుల ప్రక్రియ వాయిదా.. ఎప్పటినుంచి స్టార్ట్ అవుతాయంటే?