జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష దరఖాస్తు ప్రక్రియ ఈరోజు (సెప్టెంబర్ 11) ఉదయం ప్రారంభం కావడం లేదని ఐఐటీ ఖరగ్‌పూర్ వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష దరఖాస్తు ప్రక్రియ వాయిదా వేసినట్లు ప్రకటించింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ షెడ్యూలులో పలు మార్పులు చేసినట్లు వర్సిటీ ప్రకటన విడుదల చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం.. జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 13వ తేదీ మధ్యాహ్నం నుంచి ప్రారంభం కానుంది. దరఖాస్తు స్వీకరణ గడువు ఈ నెల 19న సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. ఫీజు చెల్లింపునకు ఈ నెల 20న సాయంత్రం 5 వరకు అవకాశం ఉంటుందని వర్సిటీ పేర్కొంది. ఇక జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష.. అక్టోబర్ 3న యథాతథంగా జరగనుందని స్పష్టం చేసింది. జేఈఈ మెయిన్ ర్యాంకుల వెల్లడి ఆలస్యం అవడంతో జేఈఈ అడ్వాన్స్‌డ్ ప్రక్రియను వాయిదా వేసినట్లు తెలుస్తోంది.
రేపు లేదా ఎల్లుండి జేఈఈ మెయిన్ ఫలితాలు!
జేఈఈ మెయిన్ ఫలితాలు రేపు సాయంత్రం (సెప్టెంబర్ 12) లేదా ఎల్లుండి ఉదయం విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఫలితాలు నిన్న (సెప్టెంబర్ 10) రిలీజ్ అవుతాయన్న వార్తల నేపథ్యంలో అభ్యర్థులు వేచి చూశారు. అయితే నిన్న ఫలితాల గురించి ఎన్‌టీఏ ఎలాంటి ప్రకటనా రాకపోవడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇక ఇటీవల హరియాణాలో జేఈఈ మెయిన్ పరీక్షల నిర్వహణలో అక్రమాలు జరిగినట్లు సీబీఐ తేల్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫలితాల విడుదలపై జాప్యం నెలకొంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న అభ్యర్థులు కాకుండా.. మిగతా వారి ఫలితాలు ఇవ్వాలని అధికారులు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.
అక్టోబర్ 3న జేఈఈ మెయిన్స్..
జేఈఈ మెయిన్స్ పరీక్షలో క్వాలిఫై అయిన వారు మాత్రమే జేఈఈ అడ్వన్స్‌డ్ పరీక్ష రాయడానికి అర్హులు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) వెల్లడించిన వివరాల ప్రకారం.. జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష అక్టోబర్ 3న రెండు షిఫ్ట్‌లలో జరగనుంది. మొదటి షిఫ్ట్ లో ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్ I పరీక్ష ఉంటుంది. రెండవ షిఫ్ట్‌లో మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకు పేపర్ 2 పరీక్షను నిర్వహిస్తారు.