JEE Main 2024 Exam: జేఈఈ మెయిన్ తొలి విడత పరీక్షలు దేశవ్యాప్తంగా జనవరి 24 నుంచి ప్రారంభంకానున్నాయి. జేఈఈ మెయిన్ పరీక్షలకు ఈ ఏడాది 12 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి 2.4 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. తెలంగాణలో 11 కేంద్రాల్లో పరీక్షలు నిర్వ హించనున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబ్‌నగర్, నల్లగొండ, నిజామాబాద్, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్‌లో పరీక్షలు జరుగనున్నాయి. ఇక ఏపీలోని ప్రధాన నగరాల్లో 30 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. తెలుగు, ఇంగ్లిష్‌ సహా మొత్తం 10 భాషల్లో జేఈఈ మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు. రెండో దశ పరీక్షలు ఏప్రిల్‌‌లో నిర్వహించనున్నారు. 

ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జేఈఈ మెయిన్‌ పేపర్‌-1 ఆన్‌లైన్‌ పరీక్షలు జ‌న‌వ‌రి 27 నుంచి ప్రారంభం కానున్నాయి. ఎన్‌ఐటీల్లో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌, బ్యాచిలర్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ కోర్సుల్లో ప్రవేశానికి పేపర్‌-2 పరీక్ష జ‌న‌వ‌రి 24న ముగిసింది. బీటెక్‌ సీట్ల భర్తీకి  27, 29, 30, 31, ఫిబ్రవరి 1న ఐదు రోజులపాటు జేఈఈ మెయిన్‌ పేపర్‌-1 పరీక్ష నిర్వహించనున్నారు. జనవరి 27న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి షిఫ్టులో, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) నిర్వహించనున్నారు. పేపర్-1 పరీక్ష అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అందుబాటులో ఉంచింది.  ఆన్‌లైన్‌ పరీక్షలు కావడంతో చిన్న పట్టణాల్లో కూడా పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.


నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ...
జేఈఈ మెయిన్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు నిర్ణీత సమయానికి గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. పరీక్ష ప్రారంభమైన తర్వాత ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్షకు అనుమతించబోమని ఎన్‌టీఏ ప్రకటించింది. ఈసారి భద్రత వ్యవస్థను మరింత కట్టుదిట్టం చేస్తున్నారు. ఫేషియల్‌ రికగ్నిషన్‌ సిస్టమ్‌ను అమలు చేస్తున్నారు.  


పరీక్ష విధానం..


➥ పేపర్‌-1 (బీటెక్, బీఈ) ఇలా..
బీఈ/బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈ పేపర్‌ను మొత్తం 90 మార్కులకు నిర్వహిస్తారు. మూడు సబ్జెక్ట్‌లలో రెండు సెక్షన్లుగా నిర్వహిస్తారు. ఒక్కో సబ్జెక్టు నుంచి 30 ప్రశ్నలు అడుగుతారు. ఇందులో మ్యాథమెటిక్స్ నుంచి 30 ప్రశ్నలు (సెక్షన్-ఎ 20 ప్రశ్నలు, సెక్షన్-ఎ 10 ప్రశ్నలు), ఫిజిక్స్ నుంచి 30 ప్రశ్నలు (సెక్షన్-ఎ 20 ప్రశ్నలు, సెక్షన్-ఎ 10 ప్రశ్నలు), కెమిస్ట్రీ నుంచి 30 ప్రశ్నలు (సెక్షన్-ఎ 20 ప్రశ్నలు, సెక్షన్-ఎ 10 ప్రశ్నలు) ఉంటాయి. సెక్షన్‌-ఎ పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలో బహుళైచ్ఛిక ప్రశ్నలతో(ఎంసీక్యూలతో) ఉంటుంది. సెక్షన్‌-బిలో న్యూమరికల్‌ వాల్యూ ఆధారిత ప్రశ్నలుంటాయి.సెక్షన్‌-బిలో 10 ప్రశ్నల్లో అయిదు ప్రశ్నలకు సమాధానం ఇస్తే సరిపోతుంది. 0.25 శాతం నెగెటివ్‌ మార్కింగ్‌ నిబంధన ఉంది.


విద్యార్థులకు ముఖ్య సూచనలు..


⫸ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఏమాత్రం ఆందోళనకు గురికాకుంగా ఇచ్చిన ప్రశ్నలను క్షుణ్ణంగా పరిశీలించాలి. గుడ్డిగా అంచనా వేసి ఆన్సర్లు చేయకూడదు. తెలియని ప్రశ్నను పట్టుకుని, సమయం వృథా చేసుకోవద్దు.


⫸ జేఈఈ మెయిన్స్‌లో నెగెటివ్‌ మార్కుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. సమాధానం కచ్చితంగా రాస్తే 4 మార్కులు ఉంటాయి. తప్పుగా టిక్‌ పెడితే మైనస్‌–1 అవుతుంది. కాబట్టి తెలియని ప్రశ్నలకు ఊహించి రాసేకన్నా, వదిలేయడమే మంచిది. కన్ఫ్యూజ్‌ చేసే ప్రశ్నల కోసం ముందే సమయం వృథా చేయకూడదు. 


⫸ పట్టున్న అంశాలపైనే దృష్టిపెట్టడం మంచిది. లేకపోతే సమయమంతా వృథా అవుతుంది. పరీక్షకు సమయం లేనందున రివిజన్‌ మాత్రమే చేస్తే బెటర్‌.


⫸ ప్రతి సబ్జెక్టులో రెండో సెక్షన్‌లో ఇచ్చే న్యుమరికల్‌ ప్రశ్నలకు మాత్రమే చాయిస్‌ ఉంటుంది. మొదటి సెక్షన్‌లోని ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలకు చాయిస్‌ లేదు.


⫸ పరీక్షలో 40 శాతం ప్రశ్నలు నేరుగా ఫార్ములా బేస్డ్‌, మరో 40 శాతం పాత ప్రశ్నపత్రాల నుంచి, 10 శాతం ప్రశ్నలు పాత జేఈఈ అడ్వాన్స్‌డ్‌ నుంచి, మిగతా ప్రశ్నలు ఎక్కువ సమయం పట్టేవి ఇస్తున్నారు.


⫸ విద్యార్థుల్లో ఎక్కువ మంది స్టేట్‌మెంట్స్‌, అసెర్షన్‌, రీజన్స్‌ తరహా ప్రశ్నల్లో తప్పులు చేస్తున్నారు. ఈ తప్పు జరగకుండా ఫార్ములాలను గుర్తుంచుకోవటం మంచిది.


⫸ విద్యార్థులు పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌కార్డుతోపాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా ఒరిజినల్ ఐడీ కార్డును వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. 


⫸ అడ్మిట్‌ కార్డుతోపాటు అవసరమైన పత్రాలన్నీ (సెల్ఫ్‌ డిక్లరేషన్, అండర్‌ టేకింగ్‌ ఫాం) దగ్గర ఉంచుకోవాలని ఎన్‌టీఏ సూచించింది. 


⫸ వాటర్‌ బాటిల్స్, హ్యాండ్‌ శానిటైజర్లు, మాస్కులు, బాల్‌ పాయింట్‌ పెన్నులను అనుమతిస్తారు.


⫸ ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, స్మార్ట్‌ఫోన్లు, బ్లూటూట్ ఉపకరణాల వంటి వాటికి అనుమతి లేదు.


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...