Telugu Celebrities Congratulation to Chiranjeevi: కేంద్ర ప్రభుత్వం నిన్న పద్మ అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. దేశంలోని సినీ, కళారంగం, విద్య, వ్యాపారం, సాంకేతిక రంగాల్లో విశేష సేవలు అందించిన ప్రముఖులకు ఈ ప్రతిష్టాత్మక అవార్డులను అందిస్తుంది. ప్రతి ఏటా రిపబ్లిక్‌డే సందర్భంగా ప్రకటించే ఈ అవార్డులకు మన తెలుగు తేజాలు ఉండటం విశేషం. ఇందులో మెగాస్టార్ చిరంజీవి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి పద్మవిభూషణ్ వరించాయి, తెలంగాణకు చెంది పలువురు కళాకారులకు పద్మ అవార్డులకు ఎన్నికయ్యారు.
ఇక కళారంగంలో అందించిన విశేష సేవలకు గానూ చిరంజీవికి పద్మవిభూషణ్ వరించింది. ఈ సందర్భంగా ఆయనకు సినీ రాజకీయ ప్రముఖుల నుంచి ఆయనకు అభినందనలు వెల్లువెత్తున్నాయి. ఆయన తమ్ముడు, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా విషెస్ తెలిపారు. ఈ మేరకు ఆయన పత్రిక ప్రకటన విడుదల చేశారు. అలాగే తనయుడు రామ్ చరణ్, మెగా కోడలు ఉపాసన కొణిదెల, మెగా హీరోలు వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, దర్శక ధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్ బాబు వంటి స్టార్స్ ఆయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు.
'స్వయంకృషి'తో ఎదిగిన అన్నయ్యకు..
"భారత చలన చిత్రసీమలో తనదైన ప్రత్యేక స్థానాన్ని స్వయంకృషితో సాధించుకున్న అన్నయ్య శ్రీ చిరంజీవి గారిని 'పద్మవిభూషణ్' పురస్కారం వరించడం ఎనలేని సంతోషాన్ని కలిగించింది. నటనలోకి ఎంతో తపనతో అడుగుపెట్టిన అన్నయ్య తనకు వచ్చిన ప్రతి పాత్రను, చిత్రాన్నీ మనసుపెట్టి చేశారు. కాబట్టే ప్రేక్షక హృదయాలను గెలుచుకున్నారు. అగ్రశ్రేణి కథానాయకుడిగా సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. సామాజిక సేవా రంగంలో అన్నయ్య చిరంజీవి గారు చేస్తున్న సేవలు ఎందరికో ఆదర్శం. పద్మవిభూషణ్ పురస్కారానికి ఎంపికైన శుభ సందర్భంగా శ్రీ చిరంజీవి గారికి హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తున్నాను" అని పవన్ కల్యాణ్ తన ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు.
భారత ప్రభుత్వానికి ఎనలేని కృతజ్ఞతలు: రామ్ చరణ్
తండ్రికి ప్రతిష్టాత్మక అవార్డు దక్కడంపై గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఉప్పోంగిపోయాడు. చిరు విషెస్ చెబుతూ ఎమోషన్ పోస్ట్ షేర్ చేశాడు. "ప్రతిష్టాత్మకమైన 'పద్మవిభూషణ్' అవార్డుకు ఎన్నికైన @KChiruTweets అభినందనలు. భారతీయ సినిమా, సమాజానికి మీరు అందించిన సహకారం నాలో స్ఫూర్తి నింపాయి. అలాగే అసంఖ్యాక అభిమానులను ప్రేరేపించడంలోనూ కీలక పాత్ర పోషించింది. మీరు ఈ దేశానికి నిష్కళంకమైన పౌరులు.." అంటూ రాసుకొచ్చారు. అనంతరం భారత ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్రమోదీకి చరణ్ కృతజ్ఞతలు తెలిపాడు.
ఎక్కడి నుంచో వచ్చి..
రాజమౌళి ట్వీట్ చేస్తూ.. "ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమలో అడుగుపెట్టి, భారతదేశంలోనే రెండవ అత్యున్నత పౌర పురస్కారం గ్రహీతగా పునాధిరాళ్లు కోసం మొదటి రాయి వేసిన ఒక కుర్రాడు... మీ ప్రయాణం తరతరాలకు స్ఫూర్తినిస్తుంది చిరంజీవి గారూ.. పద్మవిభూషణ్ అందుకున్న మీకు అభినందనలు" విషెస్ తెలిపారు.
'రాబోయే తరాలకు స్ఫూర్తి..'
పద్మవిభూషణ్ అవార్డుకు ఎన్నికైన చిరంజీవి, వెంకయ్య నాయుడికి జూనియర్ ఎన్టీఆర్ శుభకాంక్షలు తెలిపారు. ఈ మేరకు తన ఎక్స్‌లో పోస్ట్ షేర్ చేశారు. "చిరంజీవి, భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఇద్దరినీ అభినందిస్తూ.. “పద్మ విభూషణ్ అందుకున్నందుకు @MVenkaiahNaidu గారు మరియు @KChiruTweets గారికి అభినందనలు! అలాగే పద్మ అవార్డులు అందుకున్న వారందరికీ అభినందనలు. మీ అద్భుతమైన విజయం రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తుంది…” అని పేర్కొన్నారు.