GATE 2025 Exam Dates: దేశంలోని ఐఐటీలతోపాటు ఇతర ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఎంటెక్, పీహెచ్‌డీ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు ఏటా నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (GATE-2025) పరీక్షల తేదీలను ఐఐటీ రూర్కీ వెల్లడించింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1, 2, 15, 16 తేదీల్లో గేట్-2025 పరీక్ష నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు చివరివారం నుంచి ప్రారంభంకానుంది. ఈసారి గేట్ నిర్వహణ బాధ్యతను రూర్కీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీఆర్) చేపట్టింది. మొత్తం 30 సబ్జెక్టులకు 'గేట్‌' పరీక్ష నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 200 నగరాలు, పట్టణాల్లో గేట్-2025 పరీక్ష నిర్వహించనున్నారు. గేట్‌లో సాధించిన స్కోరును బట్టి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు అభ్యర్థులకు ముఖాముఖి నిర్వహించి, ఉద్యోగాలకు ఎంపిక చేస్తాయి. 


గేట్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 7 ఐఐటీలు (బొంబయి, ఢిల్లీ, గువాహటి, కాన్పూర్, ఖరగ్‌పూర్, మద్రాస్, రూర్కీ)తోపాటు బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్ ఆఫ్ సైన్స్, ఇతర ప్రభుత్వరంగ విద్యాసంస్థల్లో డిగ్రీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఇతర ప్రైవేట్ యూనివర్సిటీలు, విద్యాసంస్థలు కూడా గేట్ స్కోరునే ప్రవేశాలకు ప్రామాణికంగా తీసుకుంటాయి. కొన్ని ప్రభుత్వ సంస్థలు గేట్ స్కోరు ద్వారా ఉద్యోగావకాశాలు కూడా కల్పిస్తున్నాయి.


అర్హతలు..
➥ బ్యాచిలర్స్ డిగ్రీ (ఇంజినీరింగ్/టెక్నాలజీ).
➥ బ్యాచిలర్స్ డిగ్రీ (ఆర్కిటెక్చర్).
➥బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ విభాగంలో నాలుగేళ్ల డిగ్రీ.
➥ మాస్టర్ డిగ్రీ (సైన్స్/మ్యాథ్స్/స్టాటిస్టిక్స్/కంప్యూటర్ అప్లికేషన్స్).
➥ నాలుగేళ్ల ఇంటిగ్రేడెట్ మాస్టర్ డిగ్రీ (ఇంజినీరింగ్/టెక్నాలజీ).
➥ ఐదేళ్ల ఇంటిగ్రేడెట్ మాస్టర్ డిగ్రీ లేదా డ్యూయల్ డిగ్రీ (ఇంజినీరింగ్/టెక్నాలజీ).
➥ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.


దరఖాస్తు ఎలా?
➥ గేట్ పరీక్షకు దరఖాస్తు చేయగోరువారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సంబంధిత వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
➥ రిజిస్ట్రేషన్ తర్వాత అభ్యర్థికి యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ వస్తాయి. వీటి ద్వారా గేట్‌కు సంబంధించిన భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడుతుంది.
➥ దరఖాస్తు సమయంలో విద్యార్హతకు సంబంధించిన సర్టిఫికేట్ స్కాన్ కాపీలు, ప్రొవిజనల్ సర్టిఫికేట్లు అందుబాటులో ఉంచుకోవాలి.
➥ ఐడీ ప్రూఫ్ తప్పనిసరిగా అవసరమవుతుంది. ఐడీ ప్రూఫ్‌గా పాస్‌పోర్ట్, పాన్ కార్డు, ఓటరు కార్డు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, కాలేజీ ఐడీ, ఎంప్లాయ్ ఐడీకార్డుల్లో ఏదైనా ఒకటి తప్పనిసరిగా ఉండాలి.


పరీక్ష ఎలా ఉంటుంది?
➥ మొత్తం 30 సబ్జెక్టుల్లో గేట్ పరీక్ష నిర్వహిస్తారు. దేశంలోని అన్ని ప్రధాన నగరాలతోపాటు.. ఇతర దేశాలలోని నగరాల్లో కూడా గేట్ పరీక్ష నిర్వహిస్తారు.
➥ ప్రకటించిన తేదీల్లో మొత్తం రెండు సెషన్లలో (9:30 am - 12:30 pm,  2:30 pm - 5:30 pm.) గేట్ పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్ష సమయం 3 గంటలు.
➥ ఆన్‌లైన్ విధానంలో నిర్వహించే గేట్ పరీక్షలో 100 మార్కులకు 65 ప్రశ్నలు అడుగుతారు. వీటిలో జనరల్ ఆప్టిట్యూడ్ నుంచి 10 ప్రశ్నలకుగాను 15 మార్కులు; టెక్నికల్, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ విభాగాల నుంచి 55 ప్రశ్నలకుగాను 85 మార్కులు ఉంటాయి.
➥ నెగెటివ్ మార్కులు కూడా ఉన్నాయి. 1 మార్కు ప్రశ్నలకు ప్రతి తప్పు సమాధానానాకి 1/3 చొప్పున, 2 మార్కుల ప్రశ్నలకు ప్రతి తప్పు సమాధానానాకి 2/3 చొప్పున కోత విధిస్తారు.


సబ్జెక్టులు: ఏరోస్పేస్ ఇంజినీరింగ్, అగ్రికల్చరల్ ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్, బయోమెడికల్ ఇంజినీరింగ్, బయోటెక్నాలజీ, సివిల్ ఇంజినీరింగ్, కెమికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ, కెమిస్ట్రీ, డేటా సైన్స్ & ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ & ఇంజినీరింగ్, ఎకాలజీ అండ్ ఎవల్యూషన్, జియోమెటిక్స్ ఇంజినీరింగ్, జియోలజీ & జియోఫిజిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్, మెకానికల్ ఇంజినీరింగ్,  మైనింగ్ ఇంజినీరింగ్, మెటలర్జికల్ ఇంజినీరింగ్, నేవల్ ఆర్కిటెక్చర్ & మెరైన్ ఇంజినీరింగ్, పెట్రోలియం ఇంజినీరింగ్, ఫిజిక్స్, ప్రొడక్షన్ & ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్, స్టాటిస్టిక్స్,  టెక్స్‌టైట్ ఇంజినీరింగ్ & ఫైబర్ సైన్స్, ఇంజినీరింగ్ సైన్సెస్, హ్యూమానిటీస్ & సోషల్ సైన్సెస్, లైఫ్ సైన్సెస్.


గేట్- 2024 పరీక్ష తేదీలు: 2024, ఫిబ్రవరి 3, 4, 10, 11 తేదీల్లో.


Website