పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ (పీజీ) లేకుండానే పీహెచ్‌డీ చేసే అవకాశం విద్యార్థులకు దక్కనుంది. ఈ మేరకు యూజీసీ (యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్) చైర్మన్ జగదీష్ కుమార్ కీలక ప్రకటన చేశారు. ఇకపై పీహెచ్‌డీ‌లో అడ్మిషన్ కోసం మాస్టర్ డిగ్రీ అవసరం లేదని తెలిపారు. నాలుగేళ్ల డిగ్రీ పూర్తి చేసినవారు కూడా పీహెచ్‌డీకి అర్హులని ఆయన ప్రకటించారు. నాలుగేళ్ల డిగ్రీ కోర్సు పూర్తిచేశాక పీజీ మొదటి సంవత్సరం విద్యార్థులు లేదా రెండో సంవత్సరం విద్యార్థులు కూడా పీహెచ్‌డీలో చేరేందుకు అర్హులవుతారని వెల్లడించారు. కాగా, ఇప్పటి వరకు పీహెచ్‌డీ‌లో అడ్మిషన్ పొందాలంటే పీజీ పూర్తి చేసిన వారే అర్హులు. తాజాగా యూజీసీ నిబంధనలు సవరించడంతో పీజీ పూర్తి చేయకున్న.. నాలుగేళ్ల డిగ్రీ కంప్లీట్ చేసిన వారు కూడా పీహెచ్‌డీ‌లో అడ్మిషన్ పొందేందుకు అర్హులు అవుతారు.


నిబంధనలు సవరించిన యూజీసీ..
విశ్వవిద్యాలయాలు, ఇతర ఉన్నత విద్యాసంస్థల్లో పరిశోధన (పీహెచ్‌డీ) కోర్సుల నిర్వహణ నిబంధనలను యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ మరింత కఠినతరం చేసింది. పరిశోధనల్లో సమగ్రత లేమి, నాణ్యతారహితంగా థీసెస్‌ల రూపకల్పన, ఏళ్ల తరబడి కొనసాగింపు వంటి  విమర్శలు కొన్నేళ్లుగా వెల్లువెత్తుతున్న నేపథ్యంలో యూజీసీ పీహెచ్‌డీ కోర్సుల నిబంధనలను సవరించింది. ఈ మేరకు ఇటీవల గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీచేసింది. దీని ప్రకారం..


➥ అభ్యర్థులు నాలుగేళ్ల బ్యాచిలర్‌ డిగ్రీ, ఒక ఏడాది మాస్టర్‌ డిగ్రీ, లేదా మూడేళ్ల డిగ్రీ, రెండేళ్ల పీజీచేసిన వారు 55 శాతం మార్కులు సాధించి ఉంటేనే పీహెచ్‌డీ కోర్సుల్లో చేరడానికి అర్హులు. విదేశీ విద్యార్థులకైనా దీనికి సమాన ప్రమాణాలు ఉండాలి.


➥ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ (నాన్‌–క్రీమీలేయర్‌), దివ్యాంగులు, ఈడబ్ల్యూఎస్‌ తదితర కేటగిరీల అభ్యర్థులకు 5 శాతం మార్కుల సడలింపు ఇవ్వవచ్చు. గతంలో ఎంఫిల్‌ పూర్తిచేసి ఇప్పుడు పీహెచ్‌డీ కోర్సుల్లో చేరాలనుకునేవారికి కూడా 55% మార్కులు ఉండాలి. గ్రేడింగ్‌ విధానం అమల్లో ఉన్న విద్యాసంస్థల అభ్యర్థులకు పాయింట్ల స్కేల్‌లో సమానమైన గ్రేడ్‌ ఉండాలి.


➥యూనివర్సిటీలు ప్రత్యేక ప్రవేశపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారానే పీహెచ్‌డీ ప్రవేశాలు చేపట్టాలి. యూజీసీ, ఇతర సంబంధిత అధీకృత ఉన్నతసంస్థల మార్గదర్శకాలకు అనుగుణంగా రిజర్వేషన్లు కల్పించాలి. 


➥ యూజీసీ–నెట్, యూజీసీ–సీఎస్‌ఐఆర్, నెట్, గేట్, సీఈఈడీ ఫెలోషిప్, స్కాలర్‌షిప్‌లకు అర్హతపొందిన వారికి ఇంటర్వ్యూ ఆధారంగా ప్రవేశాలు కల్పించాలి. లేదా ఆయా వర్సిటీలు, ఇతర ఉన్నత విద్యాసంస్థలు ప్రవేశపరీక్షలు నిర్వహించి చేర్చుకోవచ్చు.


➥ యూనివర్సిటీలు నిర్వహించే ప్రవేశ పరీక్ష సిలబస్‌లో 50 శాతం రీసెర్చ్‌ మెథడాలజీ, 50 శాతం సబ్జెక్టు ఉండాలి. ప్రవేశపరీక్షలో 50 శాతం మార్కులు సాధించడం తప్పనిసరి. 


➥ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ (నాన్‌–క్రీమీలేయర్‌), విభిన్న ప్రతిభావంతులు, ఈడబ్ల్యూఎస్‌ తదితర కేటగిరీల అభ్యర్థులకు 5 శాతం మార్కుల సడలింపు ఇవ్వవచ్చు. వీరికి ఇంటర్వ్యూలు నిర్వహించి ప్రవేశాలు కల్పించాలి. 


➥ ప్రవేశపరీక్ష మార్కులకు 70 శాతం, ఇంటర్వ్యూలకు 30 శాతం వెయిటేజీ ఇచ్చి అర్హులను ఎంపికచేయాలి. 


➥ మౌలిక సదుపాయాలు, తగినంతమంది ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లు ఉంటే ప్రైవేటు పీజీ కాలేజీలు కూడా పీహెచ్‌డీ కోర్సులను అమలు చేయవచ్చు.


అడ్వయిజరీ కమిటీదే కీలక బాధ్యత..
ప్రతి వర్సిటీలో ఒక సీనియర్‌ ప్రొఫెసర్‌ కన్వీనర్‌గా యూనివర్సిటీ రీసెర్చ్ అడ్వయిజరీ కమిటీ ఏర్పాటుచేయాలి. ఈ కమిటీ రీసెర్చి ప్రతిపాదనలను పరిశీలించి టాపిక్‌ను నిర్ణయిస్తుంది. పరిశోధన పద్ధతి, మెథడాలజీలను పరిశీలిస్తుంది. పరిశోధన కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంది. అభ్యర్థి తన పరిశోధనపై ప్రతి సెమిస్టర్‌కు ఈ కమిటీకి సంక్షిప్త నివేదిక ఇవ్వాలి. ఈ కమిటీ.. వర్సిటీ లేదా సంస్థకు పరిశోధనపై పురోగతి నివేదిక ఇవ్వాలి. ఒకవేళ పరిశోధన సంతృప్తికరంగా లేకపోతే అభ్యర్థికి కమిటీ సూచనలివ్వాలి. ఆ సూచనల ప్రకారం పరిశోధన చేయలేకపోతే ఆ పీహెచ్‌డీ రిజిస్ట్రేషన్‌ను రద్దుచేసేలా కమిటీ సిఫార్సు చేస్తుంది. 


అభ్యర్థి థీసెస్‌ను సమర్పించేముందు దానిపై అడ్వయిజరీ కమిటీ, ఇతర ఫ్యాకల్టీ సభ్యులు, పీహెచ్‌డీ అభ్యర్థుల సమక్షంలో ప్రెజెంటేషన్‌ ఇవ్వాలి. థీసెస్‌ సంతృప్తికరంగా లేకపోతే తిరస్కరణ, పీహెచ్‌డీకి అనర్హులైనట్లే. ఆయా ఉన్నత విద్యాసంస్థలు థీసెస్‌ను ప్లాగరిజం (కాపీకొట్టడం) కనిపెట్టేందుకు నిర్దేశించిన సాఫ్ట్‌వేర్‌ ఉపయోగించి పరిశీలించాలి. కాపీకొట్టలేదని, ఇంకెక్కడా సమర్పించలేదని అభ్యర్థి అండర్‌టేకింగ్‌ తీసుకుని పర్యవేక్షకుల సంతకాలతో థీసెస్‌ను అనుమతించాలి. తరువాత పర్యవేక్షకుడితోపాటు ఆయా రంగాల్లో పబ్లికేషన్లలో నిష్ణాతులైన ఇద్దరు బయటి నిపుణులతో అభ్యర్థిని పరిశీలన చేయించాలి. వీలైతే అందులో ఒకరు విదేశీ నిపుణులై ఉండాలి.


బయటి నిపుణుల్లో ఏ ఒక్కరైనా థీసెస్‌ను రిజెక్టు చేస్తే ప్రత్యామ్నాయంగా మరో బయటి నిపుణుడి పరిశీలనకు పంపించాలి. అతను సంతృప్తి చెందితే.. ఫ్యాకల్టీ, పీహెచ్‌డీ స్కాలర్ల సమక్షంలో వైవా నిర్వహించాలి. ప్రత్యామ్నాయ పరిశీలకుడు థీసెస్‌ను ఆమోదించకపోతే దాన్ని ఆ ఉన్నత విద్యాసంస్థ తిరస్కరిస్తుంది. ఆ అభ్యర్థిని పీహెచ్‌డీ అవార్డుకు అనర్హుడిగా ప్రకటిస్తుంది.  పీహెచ్‌డీ అవార్డు ప్రక్రియను ఆయా సంస్థలు ఆరునెలల్లో పూర్తిచేయాలి. థీసెస్‌ సంతృప్తికరంగా ఉండి పీహెచ్‌డీ అవార్డుకు అర్హత సాధించినవారికి దాన్ని జారీచేసేముందు ఆయా విద్యాసంస్థలు ఆ థీసెస్‌ సాఫ్ట్‌కాపీ (ఎలక్ట్రానిక్‌ కాపీ) ఇతర సంస్థలకు అందుబాటులోకి వచ్చేలా యూజీసీ ఆధ్వర్యంలోని ఇన్ఫర్మేషన్‌ అండ్‌ లైబ్రరీ నెట్‌వర్క్‌‌కు సమర్పించాలి. పీహెచ్‌డీ ప్రవేశం పొందిన రోజునుంచి కనీసం మూడేళ్లలో.. గరిష్టంగా ఆరేళ్లలో పూర్తిచేయాలి. ఆయా సంస్థల నిబంధనలను అనుసరించి గడువును అదనంగా రెండేళ్ల వరకు పొడిగించవచ్చు. 40 శాతం కన్నా ఎక్కువ అంగవైకల్యమున్న వారికి మరో రెండేళ్లు గడువు ఇవ్వవచ్చు. గరిష్టంగా పదేళ్లకు మించి గడువు ఇవ్వరాదు. మహిళలకు 240 రోజులు ప్రసూతి, శిశుసంరక్షణ సెలవులు ఉంటాయి.


పర్యవేక్షణకు అదనపు అర్హతలు తప్పనిసరి..
పీహెచ్‌డీ విద్యార్థులకు గైడ్‌ లేదా సూపర్‌వైజర్, సహ సూపర్‌వైజర్లుగా నియమితులయ్యేవారికి నిర్దేశిత అర్హతలు ఉండాలి. వర్సిటీలు, ఉన్నత విద్యాసంస్థల్లోని రెగ్యులర్‌ ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లకు ఐదు, అసిస్టెంటు ప్రొఫెసర్లకు మూడు రీసెర్చి పబ్లికేషన్లు ప్రఖ్యాత జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్‌లో ప్రచురితమై ఉంటేనే గైడ్‌లుగా నియమించాలి. ఇతర సంస్థల్లో గైడ్‌గా వ్యవహరించేవారికి బాధ్యత ఇవ్వరాదు. అలాంటి వారిని కో సూపర్‌వైజర్‌గా నియమించవచ్చు.  ఇతర సంస్థల నిపుణుల పర్యవేక్షణలోని పరిశోధనలకు పీహెచ్‌డీలను ప్రదానం చేయడం నిబంధనలకు విరుద్ధం. ప్రొఫెసర్‌ ఎనిమిదిమందికి, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ ఆరుగురికి, అసిస్టెంటు ప్రొఫెసర్‌ నలుగురికి పర్యవేక్షకులుగా ఉండవచ్చు. మహిళలు పెళ్లి, ఇతర కారణాలవల్ల అదే పరిశోధనను ఇతర విద్యాసంస్థల్లోకి మార్చుకోవచ్చు. అభ్యర్థులు తమ పరిశోధనతోపాటు ఆ అంశంపై విద్యాబోధన, రచన అంశాలపైనా శిక్షణ పొందాలి. ట్యుటోరియల్, లేబొరేటరీ వర్కు, మూల్యాంకనాలతోసహా వారానికి నాలుగు నుంచి ఆరుగంటలు బోధన, పరిశోధన అసిస్టెంట్‌షిప్‌లలో పాల్గొనాలి. థీసెస్‌ సమర్పించాలంటే యూజీసీ నిర్దేశించిన 10 పాయింట్ల ప్రామాణికాల్లో 55 శాతం పాయింట్లు సాధించాలి.