Osmania University Free Civils Coaching: హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ (Civil Services Prelims) పరీక్షకు సంబంధించి ఉచిత శిక్షణ (Free Training) కోసం ప్రకటన విడుదల చేసింది. దీనిద్వారా ఓయూలోని 'సివిల్ సర్వీస్ అకాడమీ' (Civil Service Academy) ఆధ్వర్యంలో అర్హులైన అభ్యర్థులకు శిక్షణ ఇస్తారు. ఉస్మానియా వర్సిటీ పరిధిలో పీజీ, పీహెచ్‌డీ చదువుతున్న విద్యార్థులు ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు డిసెంబర్ 2 వరకు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించవచ్చు. ఓయూ వెబ్‌సైట్‌లో సూచించిన దరఖాస్తును పూర్తిచేసి, ధ్రువపత్రాల నకళ్లను ఓయూ సివిల్ సర్వీసెస్ అకాడమీ కార్యాలయంలో అందజేయాలి. పూర్తి వివరాలకు 8331041332 ఫోన్ నెంబరులో సంప్రదించవచ్చు.
ఓయూ పీహెచ్‌డీ విద్యార్థులు, క్యాంపస్ కాలేజీలతో పాటు సికింద్రాబాద్, సైఫాబాద్ పీజీ కళాశాలలు, నిజాం కళాశాలకు చెందిన పీజీ విద్యార్థులు అర్హులు. డిగ్రీ మార్కులు, పీజీ ఎంట్రన్స్‌లో సాధించిన ర్యాంకు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితరాలను అనుసరించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైనవారికి నాలుగున్నర నెలలపాటు శిక్షణ ఇవ్వనున్నారు.
స్క్రీనింగ్ పరీక్షలో ఉత్తీర్ణులైతే చాలు..
విద్యార్థులు ఓయూ సివిల్స్ అకాడమీలో ఉచితంగా శిక్షణ పొందాలంటే ముందుగా ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహించనున్న అర్హత పరీక్షలో ఉత్తీర్ణులవ్వాలి. ఈ పరీక్షలో పాసైన వారికి ఉచితంగా శిక్షణ పొందేందుకు అవకాశం లభిస్తుంది. ఓయూలో పీజీ చదువుకుంటున్న విద్యార్థుల సంఖ్య ఆధారంగా స్క్రీనింగ్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యే 100 మంది అభ్యర్థులను శిక్షణకు ఎంపికచేస్తారు. వీరికి అవసరమైన శిక్షణ ఇచ్చేందుకు విశ్వవిద్యాలయంలోని అనుభవజ్ఞులైన ఆచార్యుల వృత్తి నిపుణుల సహకారం తీసుకోనున్నారు.
ఓయూ పరిధిలో చదువుకుంటున్న విద్యార్థులను సివిల్స్ విజేతలుగా తీర్చిదిద్దేందుకు ఉచిత శిక్షణకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. సివిల్ సర్వీసెస్ అకాడమీలో ప్రత్యేక ఫౌండేషన్ కోర్సులను ప్రారంభించారు. ఐపీఎస్, ఐఏఎస్‌లుగా మారేందుకు కేంద్ర ప్రభుత్వం ఏటా యూపీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తుండగా.. ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకునే ఓయూ విద్యార్థులకు విషయ పరిజ్ఞానం పెరిగేలా, పరీక్షల్లో విజయం సాధించేలా అధికారులు శిక్షణ ఇవ్వనున్నారు.
ప్రైవేటు కోచింగ్ కేంద్రాలకు దీటుగా..
సివిల్స్ శిక్షణ ఇస్తున్న ప్రైవేటు కేంద్రాలకు దీటుగా.. విశ్వవిద్యాలయంలో సివిల్స్ అకాడమీని రూపొందించారు. ఏకకాలంలో 500ల మంది విద్యార్థులు చదువుకునేలా విశాలమైన గదులు, అత్యాధునిక సమాచార పరిజ్ఞానంతో కూడిన శిక్షణ తరగతులు, డిజిటల్ లైబ్రరీతో పాటు కేంద్ర గ్రంథాలయం తరహాలో.. గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. ప్రత్యేకమైన పుస్తకాలను అందుబాటులో ఉంచనున్నారు.
ALSO READ:
ఓయూ ఇంజినీరింగ్ కాలేజీలో ఇంజినీరింగ్ 'లేటరల్ ఎంట్రీ' ప్రవేశాలు..
డిప్లొమా అర్హత ఉండి, ఉద్యోగాలు చేస్తూ.. ఇంజినీరింగ్ చదవాలనుకునే వారికోసం 'బీటెక్ వర్కింగ్ ప్రొఫెషనల్స్' పేరుతో బీటెక్ రెండో సంవత్సరంలో ప్రవేశాలకు తెలంగాణలోని 12 ఇంజినీరింగ్ కాలేజీలకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ఇటీవలే అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. ఉస్మానియా సహా పలు కాలేజీల్లో వర్కింగ్ ప్రొఫెషనల్స్‌కు ప్రవేశాలు కల్పించేందుకు (ఏఐసీటీఈ)అనుమతిని మంజూరు చేసింది. ఈ విద్యాసంవత్సరంలో వర్కింగ్ ప్రొఫెషనల్స్ ప్రవేశాలు పొందేందుకు నవంబరు 30 వరకు అవకాశం ఇచ్చింది.
ప్రవేశానికి సంబంధించిన పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..