Guidelines for Coaching Centers: దేశంలోని శిక్షణ సంస్థల నియంత్రణకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఉద్యోగాలకు, పోటీపరీక్షకు సన్నద్దమయ్యే అభ్యర్థులను మోసపూరిత ప్రకటనలతో ప్రభావితం చేసే శిక్షణ సంస్థలకు కేంద్ర విద్యాశాఖ జనవరి 18న నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో నియమించిన కమిటీ ఈ మార్గదర్శకాలను రూపొందించింది.


వినియోగదారుల రక్షణ చట్టం-2019లోని నిబంధనలకు విరుద్ధంగా వస్తువులు, సేవలకు సంబంధించి తప్పుదారి పట్టించే ప్రకటనలను ఎవరూ జారీ చేయకూడదని స్పష్టం చేసింది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ కోచింగ్ సంస్థలన్నింటికీ మార్గదర్శకాలు, వినియోగదారుల చట్టం వర్తిస్తుందని పేర్కొంది. విద్యార్థుల ఆత్మహత్యలు నివారించడంతో పాటు వారికి సరైన సౌకర్యాలు కల్పించడం, బోధనా విధానాలు మెరుగుపరచడం, అధిక రుసుములు వసూలు చేయకుండా కట్టడి చేసేందుకు వీటిని రూపొందించినట్లు వెల్లడించింది. ఇందులో భాగంగా శిక్షణ కేంద్రాలకు పలు సూచనలు చేసింది. 


కేంద్రం మార్గదర్శకాలు ఇలా..


➥ శిక్షణ సంస్థలు ఇచ్చే ప్రకటనల్లో విజేత ఫొటోతో ర్యాంకు, కోర్సు, వ్యవధి, ఫీజు వసూలు చేశారా? ఉచితంగా శిక్షణ ఇచ్చారా?.. అన్న సమాచారాన్ని తప్పనిసరిగా పేర్కొనాల్సి ఉంటుంది. 100 శాతం ఎంపిక లేదా 100 శాతం ఉద్యోగ హామీ అని ప్రకటించకూడదు. 


➥ కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా విద్యార్థులకు చాలినంత స్థలం కేటాయించి కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రాణనష్టం నివారించేందుకు భద్రతా ప్రమాణాలు పాటించాలి. 


➥ శిక్షణ కేంద్రాల్లో అర్హులైన సిబ్బందిని నియమించుకోవాలి. వారు తప్పనిసరిగా డిగ్రీ పూర్తి చేసుండాలి. విద్యార్థుల తల్లిదండ్రులను తప్పుదోవ పట్టించేలా.. ర్యాంకులు, మార్కుల గురించి ఎలాంటి హామీలు ఇవ్వకూడదు. 


➥ శిక్షణ సంస్థలు తమ ప్రకటనల్లో చిన్న ఫాంట్‌లో స్పష్టంగా కనిపించనివిధంగా కొంత సమాచారం ఇస్తుంటారు. ఇకముందు దాన్ని కూడా పెద్ద ఫాంట్‌లోనే ఇవ్వాల్సి ఉంటుంది.


➥ సెంకడరీ పాఠశాల విద్య పూర్తి చేసిన వారిని మాత్రమే కోచింగ్‌ కోసం పేరు నమోదు చేసుకునేందుకు అనుమతించాలని, 16 సంవత్సరాలలోపు వారిని చేర్చుకోకూడదని మార్గదర్శకాల్లో పేర్కొంది.


➥ సిబ్బంది అర్హత, కోచింగ్‌ సెంటర్‌ వివరాలు, శిక్షణ అందించే కోర్సులు, వసతి సౌకర్యాలు, ఫీజు రిఫండ్‌ గురించిన సమాచారం వెబ్‌సైట్‌లో పొందుపరచాలి. 


➥ కోచింగ్‌ సెంటర్‌లో ఇచ్చే శిక్షణకు సంబంధించి, అక్కడ శిక్షణ పొందిన విద్యార్థులు సాధించిన ఫలితాల గురించి మోసపూరిత ప్రకటనలు చేయకూడదు. 


తెలుగు రాష్ట్రాల్లో ఇలా..
తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏపీ, తెలంగాణల్లోని కొన్ని సంస్థలు సివిల్ సర్వీసెస్ పరీక్ష ఫలితాలకు సంబంధించి నమూనా ఇంటర్వ్యూకు హాజరైనా తమ వద్దే శిక్షణ తీసుకున్నారంటూ ప్రకటనలు ఇస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేయడంతో.. ఇలాంటి మోసాలకు అడ్డుకట్ట పడే అవకాశం ఉంటుంది.


ALSO READ:


ప్రధాని మోదీతో ‘పరీక్షా పే చర్చ’కు తేదీ ఖరారు, ఎప్పుడంటే?
విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని పోగొట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఏటా నిర్వహించే పరీక్షా పే చర్చ కార్యక్రమానికి తేదీ ఖరారైంది. జనవరి 29న విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ప్రధాని ముఖాముఖి చర్చిస్తారని కేంద్ర విద్యాశాఖ జనవరి 13న ఒక ప్రకటనలో వెల్లడించింది. పరీక్షల సమయం దగ్గరపడుతున్న ప్రస్తుత సమయంలో.. విద్యార్థులు ప్రిపరేషన్‌పై పూర్తిగా దృష్టిసారించలేక ఒత్తిడి, భయానికి లోనవుతారు. ఈ సందర్భంగా విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని పోగొట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఏటా నిర్వహించే 'పరీక్షా పే చర్చ'(Pariksha Pe Charcha) కార్యక్రమాన్ని రూపొందించిన సంగతి తెలిసిందే.


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...