భారతదేశంలో ఇంజనీరింగ్ చదవాలనుకునే వారిలో మెజారిటీ విద్యార్థులకు దేశ ఐఐటీల్లో (Indian Institutes of Technology) చేరడం అనేది లక్ష్యంగా ఉంటుంది. ఐఐటీల్లో ప్రవేశాల కోసం ప్రత్యేక కోచింగ్ సైతం తీసుకుంటారు. ఇక ఇటీవల కాలంలో ఐఐటీలు కేవలం సాంప్రదాయక కోర్సులను మాత్రమే కాకుండా పలు కొత్త సబ్జెక్టుల్లో ప్రవేశాలను ఆహ్వానిస్తాయి. ఈ జాబితాలో ఆర్ట్స్, కామర్స్ వంటి బ్యాగ్రౌండ్ ఉన్న కోర్సులు కూడా చేరాయి. డిజైన్, మేనేజ్‌మెంట్, ఇతర సబ్జెక్టులలో ఆర్ట్స్, కామర్స్ నేపథ్యం ఉన్న విద్యార్థులకు ఐఐటీలు పలు కోర్సులను అందిస్తున్నాయి. 


1. బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ (B.Des)
బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ అనేది నాలుగేళ్ల కోర్సు. ఇందులో డిజైన్ సూత్రాలు, చిత్రాలు, ఫొటోగ్రఫీ గురించి బోధిస్తారు. అండర్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫర్ డిజైన్ (UCEED) ద్వారా ఈ కోర్సులో ప్రవేశాలు పొందవచ్చు. జాతీయ స్థాయిలో ఈ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారు. ఐఐటీ బాంబే ఈ పరీక్ష నిర్వహణ భాద్యతలను చూస్తోంది. విజువలైజేషన్ అండ్ స్పేషియల్ ఎబులిటీ, డిజైన్ థింకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, అబ్జర్వేషన్ అండ్ డిజైన్ సెన్సిటివీటీ, అనలటికల్ అండ్ లాజికల్ రీజనింగ్, లాంగ్వేజ్ అండ్ క్రియేటివిటీ, ఎన్విరాన్‌మెంటల్ అండ్ సోషల్ అవేర్‌నెస్ అనే సజ్జెక్టులు ఉంటాయి. 


ఐఐటీ హైదరాబాద్ (20 సీట్లు), ఐఐటీ బాంబే (37 సీట్లు), ఐఐటీ గౌహతి (56 సీట్లు) సహా మూడు ఐఐటీలు ఈ కోర్సును అందిస్తున్నాయి. ఐఐటీ ఢీల్లీ కూడా ఈ BDes కోర్సును ప్రవేశపెట్టింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి దీనిని అమలు చేయనుంది. జబల్‌పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ (66 సీట్లు) కూడా ఈ కోర్సును అందిస్తుంది. 


విద్యార్హత, వయోపరిమితి వివరాలు..
 ఈ కోర్సులో చేరాలనుకునే అభ్యర్థులు 12వ తరగతి పాస్ అయి ఉండాలి. అలాగే 24 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న వారు ఈ ప్రవేశ పరీక్ష రాసేందుకు అర్హులు. 


2. మాస్టర్ ఆఫ్ డిజైన్ (M.Des)
మాస్టర్ ఆఫ్ డిజైన్ అనేది రెండేళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సు. డిజైన్ కోర్సులలో స్పెషలైజేషన్ కోసం దీనిని ప్రత్యేకంగా రూపొందించారు. హ్యుమానిటీస్ (humanities), కామర్స్ (commerce) బ్యాగ్రౌండ్ ఉన్న విద్యార్థులు కూడా దీనిలో చేరవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫర్ డిజైన్ (Common Entrance Examination for Design- CEED) పరీక్ష రాయాలి. సీఈఈడీ ద్వారా ఐఐటీల్లో డిజైన్ కోర్సులలో ప్రవేశాలు పొందవచ్చు. ప్రస్తుతం ఆరు ఐఐటీలు ఈ కోర్సును అందిస్తున్నాయి. ఐఐటీ హైదరాబాద్, ఐఐటీ బాంబే, ఐఐటీ గువాహతి, ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ కాన్పూర్ కాలేజీల్లో ఈ కోర్సును భోదిస్తున్నాయి. వీటితో పాటు జబల్‌పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఈ కోర్సును అందిస్తుంది. 


ఎవరెవరు అర్హులంటే?
డిగ్రీ, డిప్లొమా లేదా పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులు ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు వారు ఎంచుకున్న కోర్సును బట్టి సంబంధిత సబ్జెక్టులో స్పెషలైజేషన్‌ పూర్తి చేసి ఉండాలి. వీరితో పాటు జీడీ (గ్రాడ్యుయేట్ డిప్లొమా) ఆర్ట్స్ డిప్లొమా ప్రోగ్రాంలో ఉత్తీర్ణులైన వారు సీఈఈడీ పరీక్ష రాసేందుకు అర్హులు. 


3. ఎంఏ స్పెషలైజేషన్.. 
మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ అనేది రెండేళ్ల పీజీ కోర్సు. ఇందులో సోషల్ వర్క్, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, జియోగ్రఫీ, ఫిలాసఫీ వంటి వాటిలో స్పెషలైజేషన్ చేయవచ్చు. అభ్యర్థులు ఎంచుకున్న స్పెషలైజేషన్ ఆధారంగా సబ్జెక్టులు ఉంటాయి. ప్రస్తుతం మూడు ఐఐటీలు ఈ కోర్సును అందిస్తున్నాయి. వీటిలో ఐఐటీ మద్రాస్, ఐఐటీ గాంధీనగర్, ఐఐటీ గువాహతి ఉన్నాయి. ఎంఏ కోర్సు ప్రవేశాల కోసం ఈ ఐఐటీలు వేటికవే ప్రత్యేక నోటిఫికేషన్ ఇస్తాయి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ప్రవేశాలు కల్పిస్తాయి. 


ఎవరెవరు అర్హులు? 
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన వారు ఎంఏ కోర్సులో చేరవచ్చు. అభ్యర్థులు వారు దరఖాస్తు చేసుకునే ఐఐటీలు పేర్కొన్న కనీస ఉత్తీర్ణతా శాతాన్ని సాధించి ఉండాలి.  


4. మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ)
దేశవ్యాప్తంగా పలు ఐఐటీలు అందించే మేనేజ్‌మెంట్ కోర్సుల ద్వారా ఎంబీఏలో ప్రవేశాలు పొందవచ్చు. దీని కోసం కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్ -CAT) పరీక్ష రాయాల్సి ఉంటుంది. క్యాట్ పరీక్ష మార్కులతో పాటు గ్రూప్ డిస్కషన్, వ్యక్తిగత ఇంటర్వ్యూల ఆధారంగా ఎంబీఏలో ప్రవేశాలు కల్పిస్తారు. ప్రస్తుతం 8 ఐఐటీలు ఎంబీఏ కోర్సును అందిస్తున్నాయి. ఐఐటీ బాంబే, ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ మద్రాస్, ఐఐటీ రూర్కీ, ఐఐటీ కాన్పూర్, ఐఐటీ ధన్‌బాద్, ఐఐటీ ఖరగ్‌పూర్, ఐఐటీ జోధ్‌పూర్‌ కాలేజీల్లో ఎంబీఏ కోర్సు ఉంటుంది.  


Also Read: Career Guidance: 2021లో డిమాండ్ ఉన్న 5 కోర్సులు ఇవే.. వీటిలో మీకేం కావాలో ఎంచుకోండి..


Also Read: Tips For Video Interviews: ఈజీగా ఇంటి నుంచి ఇంటర్వ్యూలు..