ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 14 యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పీజీ సెట్ 2021 (పోస్టు గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (APSCHE) తరఫున కడప యోగి వేమన యూనివర్సిటీ ఏపీ పీజీ సెట్ పరీక్షను నిర్వహిస్తోంది. దరఖాస్తు స్వీకరణ నిన్నటి నుంచి (సెప్టెంబర్ 15) ప్రారంభం కాగా.. గడువు సెప్టెంబర్ 30తో ముగియనుంది. అపరాధ రుసుముతో కూడా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు. రూ.200 రుసుముతో అక్టోబర్ 4 వరకు.. రూ.500తో అక్టోబర్ 8 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు కడప యోగి వేమన యూనివర్సిటీ వైస్‌ చాన్సెలర్‌ ప్రొఫెసర్ సూర్యకళావతి తెలిపారు. ఏపీ పీజీ సెట్ పరీక్షను అక్టోబర్ 22న నిర్వహిస్తామని చెప్పారు. పూర్తి వివరాల కోసం అభ్యర్థులు https://sche.ap.gov.in/ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు. 


దరఖాస్తు ఫీజు, విద్యార్హత.. 
దరఖాస్తు ఫీజు కింద ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ (పీహెచ్) అభ్యర్థులు రూ.650 ఫీజు చెల్లించాలి. బీసీ అభ్యర్థులు రూ.750, ఓసీ వారు రూ.850 చెల్లించాలి. ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ, ఎంసీజే, మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్, ఎంఈడీ, ఎంపీఈడీ, ఎంఎస్సీ (టెక్) కోర్సుల్లో ప్రవేశాలను పొందవచ్చు. డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు ఈ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అధికారిక నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 


ప్రవేశ పరీక్ష విధానం..
ఏపీ పీజీ సెట్ పరీక్షలో 100 ప్రశ్నలు ఆబ్జెక్టివ్ విధానంలో (మల్టిపుల్ చాయిస్) ఉంటాయి. ప్రశ్నకు ఒకటి చొప్పున 100 మార్కులు కేటాయించారు. నెగిటివ్ మార్కింగ్ లేదు. అక్టోబర్ 22న మూడు సెషన్లలో పరీక్ష జరగనుంది. మొదటి సెషన్ ఉదయం 9.30 నుంచి 11 వరకు.. రెండో సెషన్ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2.30 వరకు.. మూడో సెషన్ సాయంత్రం 4.30 నుంచి 6 గంటల వరకు ఉంటుంది.  


ఏయే వర్సిటీల్లో ప్రవేశాలు పొందవచ్చు?
ఆంధ్రా యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, శ్రీ పద్మావతి మహిళా విశ్వ విద్యాలయం, యోగి వేమన యూనివర్సిటీ, రాయలసీమ యూనివర్సిటీ, విక్రమ సింహపురి యూనివర్సిటీ, ద్రవిడియన్  యూనివర్సిటీ, కృష్ణ యూనివర్సిటీ, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ, డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ, క్లస్టర్ యూనివర్సిటీ (కర్నూలు). 


Also Read: JEE Advanced 2021: నేటి నుంచే జేఈఈ అడ్వాన్స్‌డ్ రిజిస్ట్రేషన్.. ముఖ్యమైన తేదీలివే


Also Read: IIT Admissions: ఆర్ట్స్, కామర్స్ వాళ్లు కూడా ఐఐటీల్లో చేరవచ్చు.. ఎలా అంటే?