AP 10th Supply Students: టెన్త్ సప్లిమెంటరీ విద్యార్థులకు గుడ్ న్యూస్, వారికి ఛాన్స్ ఇవ్వాలని మంత్రి మేరుగు నాగార్జున నిర్ణయం

సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు కూడా ఎస్సీ గురుకులాల్లో ఇంటర్ అడ్మిషన్లు ఇవ్వాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున ఆదేశించారు

Continues below advertisement

AP Minister Merugu Nagarjuna decision to Join AP 10th Supply Passed Students to Gurukul Junior College DNN
టెన్త్ క్లాస్ సప్లిమెంటరీ పరీక్షలలో పాసైన విద్యార్థులకు జూనియర్ కాలేజీలలో ప్రవేశాలపై ఏపీ సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు కూడా ఎస్సీ గురుకులాల్లో ఇంటర్ అడ్మిషన్లు ఇవ్వాలని అధికారులను మంత్రి మేరుగు నాగార్జున ఆదేశించారు. ఇంటర్ లో ఎంఈసీ, సీఈసీ కోర్సులను ఎంపీసీ, బైపీసీలుగా మార్చే ప్రక్రియను వేగవంతం చేయాలని కూడా అధికారులను ఆదేశించారు. ఏపీ సచివాలయంలో జరిగిన జిల్లా గురుకులాల సమన్వయకర్త (డీసీఓ)ల సమావేశంలో గురుకుల కాలేజీలలో ప్రవేశాలతో సహా పలు అంశాలను మంత్రి మేరుగు నాగార్జున సమీక్షించారు. 

Continues below advertisement

నిబంధనలు సడలింపు చేసిన మంత్రి..
సాధారణంగా గురుకులాల్లో ఇంటర్ అడ్మిషన్లలో 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షల్లో పాస్ అయిన విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వకూడదనే నిబంధన ఉంది. కానీ ఈ ఏడాది మాత్రం ఆ నిబంధన సడలించి సప్లిమెంటరీ పరీక్షల్లో పాసైన వారికి కూడా అడ్మిషన్లు ఇవ్వాలని మంత్రి మేరుగు నాగార్జున నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని గురుకులాల్లో ఇంటర్ కాలేజీలలో ఒక్క సీటు కూడా మిగిలిపోకుండా చూడాలన్నది సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆలోచన అని చెప్పారు. స్కూళ్ల స్థాయిలో సీట్లు ఖాళీ లేని పక్షంలో జిల్లా స్థాయిలో ఖాళీలను చూసుకొని వాటిని భర్తీ చేయడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

ఎంఈసీ, సీఈసీ సీట్లను ఎంపీసీ, బైపీసీలుగా మార్చండి..
గురుకుల కాలేజీలలో ఎక్కువగా డిమాండ్ లేని ఎంఈసీ, సీఈసీ సీట్లను ఎంపీసీ, బైపీసీలుగా మార్చేందుకు చర్యలు వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను మంత్రి మేరుగు నాగార్జున ఆదేశించారు. ఇంటర్మీడియట్ లో అదనపు సీట్ల మంజూరు కోసం ప్రతిపాదనలు పంపాలని అధికారులకు సూచించారు. గురుకలాల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపర్చడానికి విద్యార్థులకు వీక్లీ టెస్టులను నిర్వహించాలని సూచించారు. ఆ పరీక్షలలో విద్యార్థులకు వచ్చిన మార్కులను బట్టి అవసరమైన విద్యార్థులకు స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చేందుకు ట్యూటర్లను నియమించాలని అధికారులను కోరారు. ఏ సబ్జెక్టులో విద్యార్థులు వెనకబడితే వారికి ఆ సబ్జెక్టును నేర్పించేలా సంబంధించిన టీచర్లు బాధ్యతను తీసుకోవాలన్నారు మంత్రి మేరుగు. 

గురుకుల హాస్టళ్లలో కేర్ టేకర్లు నివాసం ఉంటూ విద్యార్థుల అధ్యయనాన్ని పర్యవేక్షిస్తే ఫలితాలు మరింత మెరుగ్గా వస్తాయన్నారు. డీసీఓలు గురుకులాలను నిరంతరం పర్యవేక్షించి, మంచి ఫలితాల కోసం కృషి చేయాలని సూచించారు. గురుకులాల్లో నీటి కొరత సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని, అందుకు మార్గాలను సూచించాలని డీసీఓలను కోరారు. రిజర్వుడు కేటగిరీకి చెందిన విద్యార్థుల సంక్షేమం పట్ల సీఎం వైఎస్ జగన్ మోడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని.. త్వరలోనే లైబ్రేరియన్, ఎలక్ట్రీషియన్ ఖాళీలను భర్తీ చేపట్టాలని సూచించారు. గురుకులాలకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించడానికి సీఎం జగన్ సిద్ధంగా ఉన్నారని, నిధులను సైతం అందించేందుకు ప్రభుత్వం సిద్ధమని.. వాటిని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత అధికారులపైనే ఉందన్నారు మంత్రి మేరుగు నాగార్జున. 

Also Read: JVVD Scheme 2022: జగనన్న విదేశీ విద్యా దీవెనకు దరఖాస్తు చేసుకోండి, చివరితేది ఎప్పుడంటే?

Also Read: TS LAWCET Results: నేడు తెలంగాణ లాసెట్ ఫలితాలు, రిజల్ట్స్ వెల్లడి సమయమిదే!

Continues below advertisement