ఏపీలోని అన్ని పాఠశాలల్లో ఇకపై క్రీడలు తప్పనిసరి కానున్నాయి. విద్యార్థుల మానసిక, శారీరక ఆరోగ్య రక్షణకు, వారిని క్రీడల్లో ప్రావీణ్యులను చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. రాష్ట్రంలోని ప్రతి పాఠశాలలో విద్యార్థులకు కనీసం రెండు క్రీడల్లో శిక్షణ ఇవ్వాలని.. జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేలా వారిని తీర్చిదిద్దాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఈ మేరకు అధికారులను ఆదేశించారు. సమగ్ర శిక్ష కార్యాలయంలో జరిగిన అండర్-14, 17, 19 పాఠశాల క్రీడల కార్యదర్శుల కార్యనిర్వాహక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.


విద్యార్థులకు సామర్థ్యాల పరీక్ష నిర్వహించి ఖేలో ఇండియా ఫిట్‌నెస్ యాప్‌లో వివరాలు నమోదు చేయాలని కమిషనర్ తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులను తరగతులు పూర్తయిన తర్వాత రోజూ రెండు గంటలు ఆటలు ఆడించాలన్నారు. గ్రామీణ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రతి పాఠశాలలో క్రీడలు నిర్వహించేలా పీఈటీలు బాధ్యత వహించాలని, రాష్ట్ర స్థాయి పోటీలు డిసెంబరు నెలాఖరుకల్లా పూర్తి చేసి, జాతీయ పోటీలకు జట్లను సిద్ధం చేయాల్సిందిగా సురేష్ కుమార్ ఆదేశించారు. 


ప్రాథమిక పాఠశాల నుంచి జూనియర్ కళాశాల వరకు అవసరమైన క్రీడా పరికరాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని, ప్రతి జిల్లాలో ఒక పాఠశాలను 'స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్‌'గా ఎంపిక చేసి, విద్యార్థులకు క్రీడల్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని సురేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. 



Also Read:


ఏపీలో త్వరలో 176 స్కిల్ హబ్‌లు అందుబాటులోకి! 10 వేల మంది యువతకు లబ్ధి!


ఏపీలోని విద్యార్థులకు ప్రభుత్వ గుడ్ న్యూస్ తెలిపింది. ఉన్నత చదువులు అభ్యసించి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువకులకు మరిన్ని నైపుణ్యాలు అభివృద్ధి చేసుకునేందుకు వీలుగా స్కిల్ హబ్‌లను ఏర్పాటుచేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే రాష్ట్రంలో కొన్ని స్కిల్ హబ్‌లు ప్రారంభం కాగా.. మిగిలిన వాటిని కూడా ఈ సంక్రాంతి కల్లా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది.


ఈ మేరకు విజయవాడలోని రాష్ట్ర ఆర్థిక సంస్థ కార్యాలయంలో స్కిల్ హబ్‌లు, కాలేజీల పురోగతిపై ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, నైపుణ్య, శిక్షణ శాఖ మంత్రి రాజేంద్రనాథ్‌ రెడ్డి నవంబరు 17న సమీక్ష నిర్వహించారు. సంక్రాంతి కల్లా 176 స్కిల్ హబ్‌ల ఏర్పాటే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు మంత్రి తెలిపారు. 
రాష్ట్రంలో ఇప్పటికే ఏర్పాటు చేసిన 66 స్కిల్ హబ్‌ల ద్వారా ప్రస్తుతం 2,400 మందికి శిక్షణ ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రతి హబ్‌లో 2 కోర్సుల చొప్పున మొత్తం 222 కోర్సుల్లో 10 వేల మందికి పైగా యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తామన్నారు. నైపుణ్య కళాశాలలు ఎలా ఉండాలి, తరగతి గదులు, ల్యాబ్ శిక్షణ ఇవ్వాల్సిన అంశాలపై అధికారులతో మంత్రి చర్చించారు. మిగతా 111 స్కిల్ హబ్‌ల ఏర్పాటు దిశగా మంత్రి దిశానిర్దేశం చేశారు.


కాగా 176 స్కిల్ హబ్ లు అందుబాటులోకి తీసుకువచ్చి 10 వేల మందికిపైగా యువతకు నైపుణ్య, శిక్షణ అందించేలా అడుగులు వేయాలని మంత్రి కోరారు. శిక్షణ కేంద్రాలలో యువతకు ఆహారం, పరిశుభ్ర, ప్రశాంత వాతావరణం వంటి మౌలిక సదుపాయాలు తీర్చిదిద్దడంలో రాజీపడొద్దని ఆదేశించారు. స్కిల్ కాలేజీలు ఎలా ఉండాలి, క్లాస్ రూమ్ లు, ల్యాబ్, ట్రైనర్ వంటి అంశాలపై ఇవాళ ఆయన సమీక్షించారు. సాంకేతిక విద్య, ఉపాధి, శిక్షణ డైరెక్టర్ లతో ఆయా శాఖలకు నిర్దేశించిన లక్ష్యాలపైనా ఆరా తీశారు.


రాష్ట్రంలోని విద్యార్థులకు, నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణతోపాటు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎపిఎస్‌ఎస్‌డిసి) పనిచేస్తోంది. పాఠశాల స్థాయి నుంచి డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ వరకు అనేక నైపుణ్య శిక్షణా కార్యక్రమాలతోపాటు, మార్కెట్ లో డిమాండ్ ఉన్న కోర్సుల్లో శిక్షణ ఇస్తోంది. శిక్షణ పొందిన వారు ఉద్యోగాలు పొందడంలో అవసరమైన సహకారం అందిస్తోంది.


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..