Telanaga Education News: తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత విద్యలో ప్రవేశాలు పొందే ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన విద్యార్థుల సంఖ్య రాష్ట్రంలో ప్రతి ఏడాది పెరుగుతూ వస్తోంది. మరీ ముఖ్యంగా అమ్మాయిలు, ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గాల ఎన్‌రోల్‌మెంట్ గణనీయంగా పెరిగింది. ఆలిండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ (AISHE) సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. రాష్ట్రంలో 2017-18 నుంచి 2021-22 మధ్యకాలంలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల నమోదు 6 శాతం పెరిగింది. గతంలో 34 శాతం ఉండగా.. 5 సంవత్సరాల్లో 40 శాతానికి చేరింది. ఇందులో పురుషుల నమోదు నాలుగు శాతం పెరిగి 34.7 శాతం నుంచి 38.5 శాతానికి, మహిళల నమోదు ఏకంగా 7 శాతం పెరిగి 34.1 శాతం నుంచి 41.56 శాతానికి చేరింది. ఎస్సీల మొత్తం నమోదు శాతం 30.4 శాతం నుంచి 39.2శాతానికి చేరగా, పురుషుల నమోదు 28.6శాతం నుంచి 35.6శాతానికి, మహిళల నమోదు 32.4శాతం నుంచి 42.9శాతానికి అంటే ఏకంగా 10 శాతం పెరిగింది.
ఎస్టీల నమోదు శాతాన్ని పరిశీలిస్తే మొత్తం నమోదు 28.4 శాతం నుంచి 38 శాతానికి చేరగా, పురుషుల నమోదు 30.2 శాతం నుంచి 39.1 శాతానికి, మహిళల నమోదు 26.6 శాతం నుంచి 36.9 శాతానికి చేరింది. జాతీయ సగటు జీఈఆర్ 28.4 శాతం, పురుషుల జీఈఆర్ 28.3, మహిళల జీఈఆర్ 28.5 శాతం మాత్రమే ఉంది. ఎస్సీ, ఎస్టీసహా మహిళల ఏ క్యాటగిరీలో తీసుకున్నా తెలంగాణ జాతీయ సగటు కన్నా ఉత్తమంగా ఉండటం విశేషం. రాష్ట్రంలో విద్యార్థుల సంఖ్యాపరంగా ఉన్నత విద్యలో మొత్తం నమోదు 2017-18లో 14.19 లక్షలు ఉండగా, 2021- 22కు వచ్చేసరికి 15.96 లక్షలకు చేరింది. అంటే 1.77 లక్షల నమోదు పెరిగింది. పురుషుల నమోదు 7.35 లక్షల నుంచి 7.93 లక్షలకు పెరిగితే మహిళల నమోదు 6.83 లక్షల నుంచి 8.03 లక్షలకు చేరింది.
ఎస్సీ విద్యార్థుల నమోదు 2017-18లో మొత్తం నమోదు 2.03 లక్షలుంటే 2021 -22లో 2.53 లక్షలకు చేరింది. పురుషుల నమోదు 98 వేల నుంచి 1.19 లక్షలకు చేరితే మహిళల నమోదు 1.05 లక్షల నుంచి 1.34 లక్షలకు చేరింది. ఎస్టీల నమోదు 2017-18 నుంచి 2021 – 22 మధ్యకాలంలో 1.06 లక్షల నుంచి 1.37 లక్షలకు, పురుషుల నమోదు 57 వేల నుంచి 72 వేలకు, మహిళల ఎన్‌రోల్‌మెంట్ 48వేల నుంచి 65వేలకు పెరిగింది. ఓబీసీల నమోదు 2017-18 నుంచి 2021-22 మధ్యకాలంలో 5.96 లక్షల నుంచి 7.39 లక్షలకు చేరగా, పురుషుల నమోదు 3.03 లక్షల నుంచి 3.70 లక్షలకు, మహిళల నమోదు 2.92లక్షల నుంచి 3.68 లక్షలకు పెరిగింది.
సర్వేలో వెల్లడైన అంశాలు ఇలా..
➥ కళాశాలల సాంద్రత (కాలేజ్ డెన్సిటీ) పరంగా 18-23 ఏండ్ల మధ్య వయస్సుగల లక్ష జనాభాకు అత్యధిక కాలేజీలున్న రాష్ర్టాల్లో 66 కాలేజీలతో కర్ణాటక మొదటిస్థానంలో ఉన్నది. ఆ తర్వాత 52 కాలేజీలతో తెలంగాణ రెండోస్థానం, 49 కాలేజీలతో ఏపీ మూడోస్థానంలో ఉన్నది. ఈ విషయంలో జాతీయ సగటు కాలేజీల సంఖ్య 30 మాత్రమే.
➥ ఒక రాష్ట్రంలో అత్యధిక కాలేజీలున్న వాటిలో మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, తమిళనాడు, మధ్యప్రదేశ్ టాప్ 5లో నిలువగా, ఆ తర్వాత ఏపీ, గుజరాత్ తర్వాత తెలంగాణ 2,395 కాలేజీలతో 8వ స్థానంలో ఉన్నది.
➥ ఉన్నత విద్య నమోదులో తెలంగాణసహా పలు రాష్ర్టాల్లో పురుషులను వెనక్కినెట్టి మహిళలు దూసుకుపోతున్నారు. కేరళ, తెలంగాణ, హర్యానా, అసోం, హిమాచల్‌ప్రదేశ్, జమ్ముకశ్మీర్, మేఘాలయ, చత్తీస్‌గఢ్‌లలో పురుషుల కన్నా.. మహిళల నమోదు అధికంగా ఉన్నది.
➥ కేంద్రపాలిత ప్రాంతాలను మినహాయిస్తే అత్యధికంగా నమోదుశాతం గల రాష్ర్టాల్లో తెలంగాణ నాలుగోస్థానంలో ఉన్నది. తమిళనాడు (47), హిమాచల్‌ప్రదేశ్ (43.1), ఉత్తరాఖండ్ (41.8), కేరళ (41.3), తెలంగాణ (40) రాష్ర్టాలు వరుసగా టాప్ 5 రాష్ట్రాల్లో నిలిచాయి.
➥ ఒక కాలేజీలో సగటు ఎన్‌రోల్‌మెంట్ తెలంగాణలో ఏటా పెరుగుతున్నది. 2017-18లో 558 మంది విద్యార్థులుండగా, 2018-19లో 554, 2019-20లో 545, 2020-21లో 556, 2021-22లో 611 మంది విద్యార్థులకు చేరింది.
➥ రాష్ట్రంలోని మొత్తం కాలేజీల సంఖ్య సైతం పెరుగుతున్నది. 2017-18లో రాష్ట్రంలో మొత్తం కాలేజీల సంఖ్య 2,045 కాగా, 2018-19లో 1,988, 2019-20లో 2,071, 2020-21లో 2,062, 2021, 22లో 2,083 కాలేజీలకు చేరింది.
2021-22 విద్యాసంవత్సరంలో రాష్ట్రంలో ఉన్నతవిద్య ప్రవేశాలు ఇలా..
➥ యూనివర్సిటీలు, అనుబంధ కాలేజీల్లో నమోదైన ప్రవేశాలు - మొత్తం 2,49,489 ఎన్‌రోల్‌మెంట్లు నమోదుకాగా ఇందులో పురుషులు - 1,32,095, స్త్రీలు - 1,17,404 ఉన్నారు.
➥ ఇతర కాలేజీల్లో నమోదైన ప్రవేశాలు - మొత్తం 12,64,204 ఎన్‌రోల్‌మెంట్లు నమోదుకాగా ఇందులో పురుషులు - 6,17,374, స్త్రీలు - 6,46,830 ఉన్నారు.
➥ స్టాండ్ అలోన్ కాలేజీల్లో మొత్తం 82,987 ఎన్‌రోల్‌మెంట్లు నమోదుకాగా ఇందులో పురుషులు - 43,894, స్త్రీలు - 39,093 ఉన్నారు.
➥ మొత్తంగా పరిశీలిస్తే.. 2021-22 విద్యాసంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 15,96,680 ఎన్‌రోల్‌మెంట్లు నమోదుకాగా.. ఇందులో పురుషులు - 7,93,353, స్త్రీలు - 8,03,327 ఉన్నారు.
సామాజిక వర్గాలవారీగా చూస్తే..
కేటగిరీ | పురుషులు | స్త్రీలు | మొత్తం |
ఎస్సీ | 1,19,137 | 1,34,691 | 2,53,828 |
ఎస్టీ | 72,201 | 65,372 | 1,37,573 |
బీసీ | 3,70,857 | 3,68,610 | 7,39,467 |
దివ్యాంగులు | 2,371 | 1,618 | 3,989 |
ముస్లింలు | 64,775 | 56,543 | 1,21,318 |
ఇతర మైనార్టీలు | 4,036 | 5,531 | 9,567 |
ఈడబ్యూఎస్ | 10,800 | 10,724 | 21,524 |