2023-24 విద్యాసంవత్సరానికి దేశంలో 50 కొత్త వైద్య కళాశాలలకు అనుమతి ఇచ్చినట్లు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) వెల్లడించింది. వీటిలో 30 ప్రభుత్వ కళాశాలలు కాగా, 20 ప్రైవేటు కళాశాలలు ఉన్నాయి. ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మొత్తం 18 కళాశాలలు ఉన్నాయి. వీటిలో  తెలంగాణలో 13, ఏపీలో 5 వైద్య కళాశాలలు ఉన్నాయి. 


దేశంలో మొత్తం 8,195 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానుండగా.. తెలంగాణలో 1500, ఆంధ్రప్రదేశ్‌లో 750 సీట్లు పెరగనున్నాయని ఎన్ఎంసీ తెలిపింది. తెలంగాణలో ప్రారంభం కానున్న వైద్య కళాశాలల్లో 9 ప్రభుత్వ వైద్య కళాశాలలు కాగా 4 ప్రైవేటు కళాశాలలు ఉన్నాయి.
తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఈ ఏడాది కరీంనగర్, ఖమ్మం, కామారెడ్డి ఆసిఫాబాద్, వికారాబాద్, భూపాలపల్లి, జనగామ, సిరిసిల్ల, నిర్మల్ ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రారంభం కానున్నాయి. ఈ వైద్య కళాశాలల్లో ఒక్కో దాంట్లో 100 ఎంబీబీఎస్ సీట్ల చొప్పున మొత్తం 900 సీట్లు కొత్తగా అందుబాటులోకి వచ్చాయి. 


అదేవిధంగా సీఎంఆర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, అరుంధతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఫాదర్ కొలంబో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, నీలిమ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వైద్య కళాశాలకు అనుమతి రాగా ఒక్కో కాలేజీలో 150 ఎంబీబీఎస్ సీట్ల చొప్పున 600 సీట్లు మంజూరయ్యాయి. ఇక ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల, రాజమహేంద్రవరం, విజయనగరంలలో ప్రభుత్వ కాలేజీలకు అనుమతించింది. ఇందులో ఒక్కో కాలేజీకి 150 సీట్లు కేటాయించింది.


నేషనల్ మెడికల్ కమిషన్ నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా కళాశాలల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు, ఆధార్ సంబంధిత బయోమెట్రిక్ హాజరు, ఫ్యాకల్టీ నియామకాలు తదితర అంశాల్లో చర్యలు చేపట్టకపోవడం కారణంగా ఆయా కళాశాలలు గుర్తింపును కోల్పోయినట్లు అధికార వర్గాలు వివరించాయి. 2014 నుంచి దేశవ్యాప్తంగా వైద్య కళాశాల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.


Also Read:


హెచ్‌ఈసీ, సీఈసీ విద్యార్థులకూ ఇంజినీరింగ్‌, ట్రిపుల్‌ఐటీ హైదరాబాద్‌‌లో ప్రవేశాలు!
తెలంగాణలో హెచ్‌ఈసీ, సీఈసీ చదివిన విద్యార్థులు కూడా ఇంజినీరింగ్‌ కోర్సు చదివే అవకాశం రాబోతుంది. ట్రిపుల్‌ ఐటీ హైదరాబాద్‌ ఇందుకు అవకాశం కల్పిస్తోంది. డ్యూయల్‌ డిగ్రీ పేరుతో ఇంజినీరింగ్‌తోపాటు కంప్యూటింగ్‌ అండ్‌ హ్యూమన్‌ సైన్స్‌ (సీహెచ్‌డీ) కోర్సులు అందిస్తోంది. డ్యూయల్‌ డిగ్రీ అంటే ఇంజినీరింగ్‌తోపాటు మరో ఏడాది మాస్టర్‌ థీసిస్‌ను పూర్తిచేయాల్సి ఉంటుంది. ప్రవేశాలు కోరువారు ట్రిపుల్‌ఐటీ వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఇంటర్‌‌లో మ్యాథమెటిక్స్ పూర్తిచేసిన వారు 90 శాతం మార్కులు, హెచ్‌ఈసీ, సీఈసీ విద్యార్థులు 85 శాతం మార్కులు కలిగి ఉండాలి. వచ్చిన దరఖాస్తుల్లో ఎక్కువ వచ్చిన వారికి ప్రవేశాల్లో ప్రాధాన్యమిస్తారు. వీరు నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..  


'జోసా' కౌన్సెలింగ్ షెడ్యూలు వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే!
దేశవ్యాప్తంగా ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు, ఇతర కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే విద్యాసంస్థల్లో బీటెక్‌ సీట్ల భర్తీకి నిర్దేశించిన జోసా(జాయింట్‌ సీట్‌ అలొకేషన్‌ అథారిటీ) షెడ్యూలు జూన్ 7న విడుదలైంది. జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు జూన్ 18న వెలువడనున్నాయి. ఫలితాలు విడుదలైన మరుసటిరోజు నుంచే అంటే.. జూన్ 19 నుంచి జోసా కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభంకానుంది. జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన విద్యార్థులకు జూన్ 4న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. జోసా రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూన్ 19 నుంచి 29 వరకు కొనసాగనుంది.
జోసా కౌన్సెలింగ్ పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి.. 


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..