ఉత్తర కర్ణాటకలోని బాగల్‌కోట్ జిల్లా ముధోల్ తాలూకాలోని మారుమూల గ్రామం మంజులది. దేవదాసీ వ్యవస్థలో మహిళల పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి. వాళ్ల జీవితాలను చూస్తూ పెరిగిన యువతి. 


మంజుల చిన్నతనంలో తమ ఇంటి చుట్టూ చాలా సందడి వాతావరణం చూస్తూ పెరిగింది. ఎప్పుడూ ఎవరో ఒకరు తమ ఇంటికి వస్తు వెళ్తుండేవాళ్లు. కాస్త బుద్ది వచ్చిన తర్వాత అసలు సంగతి తెలుసుకుంది మంజుల. ఆ దేవదాసి బతుకులు ఎంత దుర్బరమైనవే తెలుసుకుంది. అందుకే చదువపై ఫోకస్ చేసింది. 


పదోతరగతి చదువుతున్న రోజుల్లో మంజులపై ఆ ఊరి పెద్దల కళ్లు పడ్డాయి. అంతే ఆమెను కూడా దేవదాసిగా చేయాలని ఒత్తిడి తీసుకొచ్చారు. ఇంట్లో పెద్దవాళ్లు, ఊరివాళ్ల ప్రతిపాదనను మంజుల తిరస్కరించింది. ఎంత ఒత్తిడి చేసినా దేవదాసిగా మారేందుకు అంగీకరించలేదు. తాను చదువుకొని తీరుతానంటూ పట్టుబట్టింది. ఎక్కువ ఒత్తిడి చేస్తే అందరి పేర్లు చీటిలో రాసి చచ్చిపోతానంటూ బెదిరించింది కూడా. చిన్న సైజ్ తిరుగుబాటునే చేసిందామె. 


చదువు కోసం మంజుల ట్యూషన్‌కు వెళ్లేది. అక్కడే తాను ఏం చేయాలో నేర్చుకుంది. అక్కడ క్లాస్‌ పుస్తకాల కంటే అంబేద్కర్, స్వామి వివేకానంద, భారత రాజ్యాంగం, ప్రాథమిక హక్కుల గురించి ఎక్కువ మాట్లాడుకునే వాళ్లు. చదువుకుంటే దేవదాసి వ్యవస్థ నుంచి బయటపడగలమని చెప్పేవాళ్లు. అదే మనసుల పెట్టుకొని పదోతరగతిలోనే తిరుగుబాటు చేసింది. 


మంజులను చదివించడానికి అమ్మమ్మ ఒప్పుకుంది. మంచిగా చదివి ఫ్యామిలీని చూసుకోవాలని కోరింది. దీనికి మంజుల ఓకే అన్న తర్వాత చదువుకు ఫ్యామిలీ సపోర్ట్ దొరికింది. అప్పటి నుంచి మంజుల ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో పార్ట్‌టైమ్ పని చేస్తూనే చదువు కొనసాగించింది. అక్కడ అన్ని పనులూ చేసింది మంజుల. రిసెప్షనిస్ట్‌గా, వైద్యులు, నర్సులకు సహాయకురాలిగా ఉండేది. వాళ్లు మంజులకు నెలకు రూ.500 చెల్లించేవారు. ఆడబ్బులతోనే చదువు కొనసాగించింది.  






ముధోల్‌లో BA పూర్తి చేసి పిల్లలకు ట్యూషన్లు చెప్పడం ప్రారంభించింది మంజుల. తర్వాత ఓ ఎన్జీవో సహకారంతో ఉడిపిలో సోషల్ వర్క్‌లో మాస్టర్స్ చదివింది. ప్రస్తుతం ఆమె పీహెచ్‌డీ చేస్తోంది.



హైస్కూల్‌లో మంజుల ఎప్పుడూ క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేది కాదు. దీనికీ ఓ చరిత్ర ఉంది. ఓసారి స్పోర్ట్స్‌ ఈవెంట్‌లో పాల్గొంటే... ఫిల్‌ చేసి ఇమ్మని ఓ ఫామ్ ఇచ్చారు. అందులో  నాన్న పేరు రాయమని చెప్పారు. దేవదాసి పిల్లలకు తండ్రులు ఎవరో తెలిస్తే సమస్య ఉండదని మంజుల అభిప్రాయం. ఆ కాలమ్‌ ఫిల్‌ చేయలేక అప్పటి నుంచి క్రీడలకు దూరమైంది. జర్మనీకి వీసా కోసం అప్లై చేసినప్పుడు కూడా ఇలాంటి చేదు అనుభవాన్ని ఎదురు చూసింది మంజుల. 


ఆరవై ఫ్యామిలీలు ఉన్న ఆ గ్రామంలో చాలా మంది పరిస్థితి ఇదే. దేవదాసీ బిడ్డలకు చాలా మందికి తండ్రులు ఎవరో తెలియదు. ఈ కారణంతోనే చాలా మంది ఉన్నతచదువులకు, ఉద్యోగాలకు దూరమైపోయారు. ఇలాంటి చాలా సంఘటనలు చూసిన మంజుల వాటిన్నింటినీ చాకచక్యంగా ఎదుర్కొంది. ఇప్పుడు దేవదాసీ వ్యవస్థలో సమాజంలో కొందరు ఎదుర్కొంటున్న సమస్యలపై  పీహెచ్‌డీ చేస్తూ అందరికీ సమాధానం చెప్తోంది మంజులో. 


దేవదాసీలు, మాజీ దేవదాసీలు, వారి పిల్లల సాధికారత పేరుతో రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలుచేస్తున్నా కిందిస్థాయిలో వాళ్లకు అవి అందడం లేదంటోంది మంజుల. నెలనెల ప్రభుత్వ ఇచ్చే పింఛన్‌ దేవదాసీలకు మూడు నుంచి ఆరు నెలలకోసారి అందుతుందని చెప్తోంది. ప్రభుత్వం అందించే స్కీమ్‌ల కోసం ప్రభుత్వ కార్యాలయాలకు దేవదాసీలు వెళ్తే వాళ్లు చాలా హీనంగా చూస్తారని వాపోతోంది.  


కింది స్థాయిలో ఇన్ని అవమానాలు ఎదుర్కొంటున్నా దేవదాసీ వ్యవస్థే లేదంటూ ప్రభుత్వం చెబుతోందని ఆవేదన చెందుతోది మంజుల. దేవదాసీ ఇంకా వేరే రూపాల్లోకి మారిపోయిందని చెప్తోంది. దేవదాసీలుగా మార్చేసి అమ్మాయిలను ముంబై, పూణేలోని వ్యభిచార గృహాలకు పంపుతున్నారని అన్నారు. అలాంటి వాళ్లు కొన్నేళ్ల తర్వాత  తమ చేతుల్లో బిడ్డ లేదా ఏదైనా వ్యాధితో తిరిగి వస్తున్నారని దీనస్థితిలోకి వెళ్లిపోతున్నారని వాపోతోంది మంజుల. 


ఎన్జీవోలో పని చేసిన తన సహోద్యోగిని వివాహం చేసుకుంది మంజుల. దేవదాసీల పిల్లలను చదివిస్తే  రాబోయే పదేళ్లపాటు వ్యవస్థ అంతమవుతుందని అంటోంది మంజుల.