జాతీయ వైద్య కమిషన్ నిర్దేశించిన ప్రమాణాలు పాటించని కారణంగా గడచిన రెండు నెలల కాలంలో దేశవ్యాప్తంగా దాదాపు 40 వైద్య కళాశాలలు గుర్తింపును కోల్పోయినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, గుజరాత్, అస్సాం, పంజాబ్, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్‌లోని మరో 100కి పైగా వైద్య కళాశాలలు కూడా ఇదే తరహా పరిస్థితిని ఎదుర్కోనున్నట్లు వర్గాలు తెలిపాయి. దాదాపు 150 కిపైగా కళాశాలలు గుర్తింపుకు దూరమయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది.


నేషనల్ మెడికల్ కమిషన్ నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా కళాశాలల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు, ఆధార్ సంబంధిత బయోమెట్రిక్ హాజరు, ఫ్యాకల్టీ నియామకాలు తదితర అంశాల్లో చర్యలు చేపట్టకపోవడం కారణంగా ఆయా కళాశాలలు గుర్తింపును కోల్పోయినట్లు అధికార వర్గాలు వివరించాయి. 2014 నుంచి దేశవ్యాప్తంగా వైద్య కళాశాల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.


2014కు ముందు దేశవ్యాప్తంగా 387 వైద్య కళాశాలలు ఉండగా ప్రస్తుతం అవి 763కు చేరుకున్నాయి. వైద్య కళాశాలల సంఖ్యలో 69 శాతం పెరుగుదల ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ ఫిబ్రవరిలో రాజ్యసభలో తెలిపారు. 2014కు ముందు దేశవ్యాప్తంగా 51,348 ఎంబిబిఎస్ సీట్లు ఉండగా ఇప్పుడు అవి 99,763కి చరుకున్నాయి. ఇందులో దాదాపు 94 శాతం పెంపు ఉంది. అదేవిధంగా వైద్య విద్యలో పిజి సీట్ల సంఖ్య 2014లో 31,185 నుంచి ఇప్పుడు 64,459కి పెరిగింది. ఇందులో 107 శాతం పెరుగుదల ఉంది.


మెడిసిటీ మెడికల్ కాలేజీ అనుమతులు రద్దు..
హైదరాబాద్‌లోని మెడిసిటీ మెజికల్ కాలేజీ గుర్తింపును నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) రద్దు చేసింది. 2023-24 అడ్మిషన్లు నిలిపివేయాలని ఎన్ఎంసీ ఆదేశించింది. ఈ మెడికల్ కాలేజీ బీజేపీ ఎంపీ సుజనా చౌదరికి చెందినదిగా భావిస్తున్నారు.  మెడిసిటీ మెడికల్ కాలేజీ హైదరాబాద్ శివారులో కొంపల్లి, మేడ్చల్ ప్రాంతాల్లో మెడికల్ కాలేజీ నిర్వహిస్తోంది. నిబంధనల ప్రకారం ఆస్పత్రిని కూడా నిర్వహించాలి. ఇటీవలి కాలంలో నేషనల్ మెడికల్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం కాలేజీ నిర్వహించడం లేదన్న ఫిర్యాదులు పెద్ద ఎత్తున వెళ్లాయి. దీంతో నేషనల్ మెడికల్ కౌన్సిల్ తనిఖీలు నిర్వహించింది. ఈ సమయంలో లోపాలు  బయటపడటంతో.. ఈ విద్యా సంవత్సరానికి మెడికల్ సీట్లను భర్తీ చేయకుండా నిషేధం విధించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


Also Read:


హెచ్‌ఈసీ, సీఈసీ విద్యార్థులకూ ఇంజినీరింగ్‌, ట్రిపుల్‌ఐటీ హైదరాబాద్‌‌లో ప్రవేశాలు!
తెలంగాణలో హెచ్‌ఈసీ, సీఈసీ చదివిన విద్యార్థులు కూడా ఇంజినీరింగ్‌ కోర్సు చదివే అవకాశం రాబోతుంది. ట్రిపుల్‌ ఐటీ హైదరాబాద్‌ ఇందుకు అవకాశం కల్పిస్తోంది. డ్యూయల్‌ డిగ్రీ పేరుతో ఇంజినీరింగ్‌తోపాటు కంప్యూటింగ్‌ అండ్‌ హ్యూమన్‌ సైన్స్‌ (సీహెచ్‌డీ) కోర్సులు అందిస్తోంది. డ్యూయల్‌ డిగ్రీ అంటే ఇంజినీరింగ్‌తోపాటు మరో ఏడాది మాస్టర్‌ థీసిస్‌ను పూర్తిచేయాల్సి ఉంటుంది. ప్రవేశాలు కోరువారు ట్రిపుల్‌ఐటీ వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఇంటర్‌‌లో మ్యాథమెటిక్స్ పూర్తిచేసిన వారు 90 శాతం మార్కులు, హెచ్‌ఈసీ, సీఈసీ విద్యార్థులు 85 శాతం మార్కులు కలిగి ఉండాలి. వచ్చిన దరఖాస్తుల్లో ఎక్కువ వచ్చిన వారికి ప్రవేశాల్లో ప్రాధాన్యమిస్తారు. వీరు నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి.. 


టీఎస్‌ఆర్టీసీ ఆధ్వర్యంలో న‌ర్సింగ్ క‌ళాశాల, ఈ ఏడాది నుంచే ప్రవేశాలు!
పౌరసేవల్లో వినూత్నంగా దూసుకుపోతున్న తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) వైద్యరంగానికి సైతం సేవలను విస్తరించింది. ఇందులో భాగంగా తార్నకలోని టీఎస్‌ఆర్టీసీ నర్సింగ్ కళాశాలలో ఈ ఏడాది నుంచి బీఎస్సీ నర్సింగ్ కోర్సును ప్రారంభించనుంది. 2023-24 విద్యా సంవత్సరానికి మేనేజ్‌మెంట్ కోటాలో బీఎస్సీ నర్సింగ్ కోర్సులో ప్రవేశాలకు మే 26 నుంచి దరఖాస్తు చేసుకోవ‌చ్చని ఆర్టీసీ ఎండీ స‌జ్జన్నార్ కోరారు. ఇంటర్ బైపీసీలో ఉతీర్ణులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. విద్యార్థుల వయసు 17 సంవత్సరాలు నిండి ఉండాలి. ఆసక్తిగల విద్యార్థినులు ప్రవేశాలకు 9491275513, 7995165624 ఫోన్ నంబర్లను సంప్రదించవ‌చ్చు. ఈ కళాశాల‌లో బాలిక‌ల‌కు మాత్రమే ప్రవేశం క‌ల్పించ‌నున్నారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..