Sujana Medical College : హైదరాబాద్‌లోని మెడిసిటీ మెజికల్ కాలేజీ గుర్తింపును నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) రద్దు చేసింది. 2023-24 అడ్మిషన్లు నిలిపివేయాలని ఎన్ఎంసీ ఆదేశించింది. ఈ మెడికల్ కాలేజీ బీజేపీ ఎంపీ సుజనా చౌదరికి చెందినదిగా భావిస్తున్నారు. మెడిసిటీ మెడికల్ కాలేజీ హైదరాబాద్ శివారులో కొంపల్లి, మేడ్చల్ ప్రాంతాల్లో మెడికల్ కాలేజీ నిర్వహిస్తోంది. నిబంధనల ప్రకారం ఆస్పత్రిని కూడా నిర్వహించాలి. ఇటీవలి కాలంలో నేషనల్ మెడికల్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం కాలేజీ నిర్వహించడం లేదన్న ఫిర్యాదులు పెద్ద ఎత్తున వెళ్లాయి. దీంతో నేషనల్ మెడికల్ కౌన్సిల్ తనిఖీలు నిర్వహించింది. ఈ సమయంలో లోపాలు బయటపడటంతో.. ఈ విద్యా సంవత్సరానికి మెడికల్ సీట్లను భర్తీ చేయకుండా నిషేధం విధించింది.
రాష్ట్ర విభజన తరువాత వరంగల్‌లోని కాళోజీ నారాయణ రావు హెల్త్ యూనివర్శిటీ పరిధిలోకి చేరింది. ప్రతి విద్యా సంవత్సరంలో మొత్తంగా 150 సీట్లను భర్తీ చేసుకోవడానికి వీలు ఉంది. ఈ ఇన్‌స్టిట్యూట్ ఇన్ టేక్ 150. 2002 నుంచి 2017 వరకు ప్రతి విద్యా సంవత్సరంలో 100 సీట్లను భర్తీ చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. 2017 ఫిబ్రవరిలో మెడిసిటీ మెడికల్ కాలేజీ సీట్ల సామర్థ్యం పెరిగింది. 100 సీట్లకు అదనంగా మరో 50 సీట్లను మంజూరు చేసింది ఎంసీఐ. డిగ్రీ కింద ఈ 50 సీట్లను కూడా ఈ ఇన్‌స్టిట్యూట్‌కు మంజూరు చేసింది. ఇప్పుడు తాజాగా ఈ ఇన్‌స్టిట్యూట్ గుర్తింపును రద్దు చేసినట్లు ఎంసీఐ ప్రకటించినట్లు తెలుస్తోంది. నేషనల్ కౌన్సిల్ యాక్ట్- 2019లోని 26 క్లాజ్ ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఈ విద్యా సంవత్సరం నుంచే అడ్మిషన్లను నిలిపివేయాలంటూ ఉత్తర్వులను జారీ చేసింది. దీనికి గల కారణాలు స్పష్టంగా తెలియరావట్లేదు. దీనితో త్వరలోనే కాళోజీ నారాయణ రావు మెడికల్ యూనివర్శిటీ లేదా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఓ ప్రకటన విడుదల చేయవచ్చని తెలుస్తోంది. ఈ గుర్తింపు రద్దు కావడం వల్ల తెలంగాణ 100 మెడికల్ సీట్లను కోల్పోయిందనే అభిప్రాయాలు ఉన్నాయి.
ప్రతి విద్యాసంవత్సరం నీట్ కౌన్సెలింగ్ నిర్వహించే ముందు మెడికల్ కళాశాలల్లో సౌకర్యాల ఏర్పాటుపై నేషనల్ మెడికల్ కౌన్సిల్ తనిఖీలు చేస్తుంది. ఆ తర్వాత అన్ని మౌలిక సదుపాయాలు బాగున్నాయనుకుంటే అనుమతులు ఇస్తుంది. అడ్మిషన్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. నీట్ లో భాగంగా ర్యాంకర్లకు సీట్లు కేటాయిస్తారు ఇప్పటికే రెండు దఫాలుగా తనిఖీలు పూర్తి కాగా మూడో విడత ఆన్‌లైన్ పరిశీలనలో వైద్య కళాశాలకు అనుమతిని నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెండు విడతల తనిఖీల్లో ఎన్‌ఎంసీ అధికారుల సూచనల మేరకు మార్పులు, చేర్పులు చేసినప్పటికి అనుమతులు ఇవ్వలేదని తెలుస్తోంది. ప్రస్తుత పరిణామంతో వంద ఎంబీబీఎస్ సీట్లు భర్తీ అయ్యే అవకాశం లేదు.