Ysrcp Leader Murder In Madanapalle: అన్నమయ్య (Annamayya) జిల్లా మదనపల్లె (Madanapalle) పట్టణంలో దారుణం జరిగింది. శ్రీవారినగర్‌కు చెందిన వైసీపీ యువ నాయకుడు పుంగనూరు శేషాద్రిని దుండగులు కిరాతకంగా హతమార్చారు. అర్ధరాత్రి ఇంటి తలుపులు బద్దలు కొట్టి భార్య కళ్లముందే.. అతనిపై వేట కొడవళ్లు, కత్తులతో దాడి చేశారు. రక్తపు మడుగులో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. దాడి అనంతరం దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలు సృష్టించింది. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మదనపల్లె డీఎస్పీ ప్రసాద్‌రెడ్డి, సీఐలు వల్లి భాష, యువరాజు, శేఖర్ ఘటనా స్థలంలో పరిశీలించారు. నిందితుల కోసం గాలింపు చేపట్టామని.. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Continues below advertisement


లొంగిపోయిన నిందితులు


కాగా, ఈ హత్య కేసులో నిందితులు పోలీసులకు లొంగిపోయారు. ఓ ఇన్నోవా వాహనంతో సహా మదనపల్లి తాలూకా పోలీస్ స్టేషన్‌లో పోలీసుల ఎదుట లొంగిపోయారు. శేషాద్రి హత్యలో బహుజన సంఘం నేత కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. కొన్నాళ్లుగా వీరి మధ్య పార్టీల పరంగా ఆదిపత్య విభేదాలు ఉన్నట్లు సమాచారం. అంబేద్కర్ విగ్రహ ఏర్పాట్ల మధ్య వివాదం, భూ ఆక్రమణలు, కబ్జాల్లో సైతం ఇరు వర్గాల మధ్య ఘర్షణలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే, తన భర్త హత్య ఘటనలో పది మందికి పైగా ఉన్నట్లు భార్య చెబుతుండగా.. మిగిలిన వ్యక్తుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.


Also Read: AP Elections Counting 2024: మూడంచెల భద్రత- సీసీ కెమెరా నిఘా- ఏపీలో కౌంటింగ్ కేంద్రాల భద్రతపై ఈసీ ప్రత్యేక దృష్టి