Andhra Pradesh Assembly Elections Counting 2024: ఆంధ్రప్రదేశ్‌లో ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల సంఘం భారీ ఏర్పాట్లు చేస్తోంది. పోలింగ్ తర్వాత జరిగిన ఘర్షణలు, గొడవలు కారణంగా ఈసారి మరిన్ని జాగ్రత్తలు తీసుకుటోంది. లెక్కింపు ప్రక్రియను పకడ్బంధీగా చేసేందుకు మూడు అంచెల భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తోంది. కేంద్ర బలగాలతోపాటు స్థానిక పోలీసులతో సెక్యూరిటీని టైట్ చేసింది. ఈవీఎంలు భద్రపరిచిన కేంద్రాల్లో కూడా సీసీటీవీ,కేంద్ర బలగాలతో నిఘా ఏర్పాటు చేసింది. 


ఈ నెల 31 నాటికి కౌంటింగ్ కేంద్రాలను సిద్ధం చేయనున్నట్టు జిల్లా యంత్రాంగం తెలిపింది. ఇప్పటికే కొన్ని కౌంటింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లను అధికారులు పరిశీలిస్తున్నారు. భద్రతా విషయంలో రాజీ ప్రసక్తే లేదని చెబుతున్నారు. సూక్ష్మ పరిశీలన, సీసీ కెమెరాలతో పటిష్ట నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసినట్టు చేసినట్టు పేర్కొన్నారు. 


కౌంటింగ్‌కు హాజరయ్యే సిబ్బందికి, అధికారులకు, కౌంటింగ్‌ ఏజెంట్లకు, నియోజకవర్గ అభ్యర్థులకు టిఫెన్, మంచినీళ్లు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. అభ్యర్థులు తీసుకొచ్చే సెల్‌ఫోన్‌లు, ఇతర ఎలక్ట్రిక్ గాడ్జెట్లు భద్ర పరిచేందుకు ప్రతి కౌంటింగ్ కేంద్రంలో ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేయనున్నారు. 


ఈసారి భారీగా పోస్టల్ బ్యాలెట్‌లు వచ్చినందున వాటిని లెక్కించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అధికారులు ఇచ్చిన పాస్‌లు, గుర్తింపు కార్డులు ఉన్న ఏజెంట్లను మాత్రమే కౌంటింగ్ కేంద్రంలోకి రాణిస్తారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నారు. వచ్చిన వారి కార్లు, ఇతర వాహనాలు పార్క్ చేసేందుకు ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. 


18 ఏళ్ల పైబడిన వాళ్లనే కౌంటింగ్ ఏజెంట్లుగా నియమించుకోవాలని   పార్టీలకు అధికారులు సూచిస్తున్నారు. ఎన్ని కౌంటింగ్ కేంద్రాలు ఉంటే అంత మంది ఏజెంట్లను సిద్దం చేయాలి. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని... ఆలోపు అంటే ఆరు గంటలకే ఏజెంట్లు అభ్యర్థులు వచ్చి అధికారిక ప్రక్రియపూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు. 


ఎన్నికల లెక్కింపు తర్వాత కూడా అభ్యర్థులు, పార్టీలు, ఇతర ముఖ్య నాయకులు సంయమనంతో ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే అమల్లో ఉన్న రూల్స్ పాటించాలని చెబుతున్నారు. లేకుంటే కేసుల్లో ఇరుక్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. విజయం సాధించిన అభ్యర్థులు ఎలాంటి హడావుడి చేయొద్దని విజయోత్సవాలకు ఛాన్స్ లేదని అంటున్నారు. 


కౌంటింగ్‌ సమయంలో ఆయా కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని దాన్ని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్త వహించాలని పార్టీలకు, లీడర్లకు అధికారులు సూచనలు చేస్తున్నారు. ర్యాలీలు, డీజేలు, బాణసంచా కలిస్తే చర్యలు తప్పవని అంటున్నారు.