Car Crashed Into The Canal: ఓ కారు ప్రమాదవశాత్తు కాలువలోకి దూసుకెళ్లగా.. అందులో చిక్కుకున్న తండ్రీ కుమార్తెలను ఓ యువకుడు కారు అద్దాలు పగలగొట్టి సాహసోపేతంతో కాపాడాడు. ఈ ఘటన ప.గో జిల్లా (Westgodavari Distirict) తణుకులో (Tanuku) శనివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ప.గో జిల్లాలోని వెంకటరాయపురానికి చెందిన రాంబాబు తన కుమార్తెతో కలిసి విజయదశమి సందర్భంగా మండపాకలోని ఎల్లారమ్మ ఆలయానికి బయలుదేరారు. అయితే, తణుకు వద్ద కారు ప్రమాదవశాత్తు అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ఇది గమనించిన సాయిబాబు అనే యువకుడు వెంటనే సాహసోపేతంగా కాలువలోకి దూకి కారు అద్దాలు బద్దలుగొట్టి వారిని రక్షించాడు.


అప్పటికే అక్కడికి చేరుకున్న స్థానికులు క్రేన్ సాయంతో కారును బయటకు తీశారు. యువకుడి సాహసాన్ని అంతా అభినందించారు. తమను రక్షించిన యువకునికి తండ్రీకుమార్తెలు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, కారు అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లిపోయిందని.. కారు అద్దాలు లాక్ అయిపోయాయని.. ఎంత ప్రయత్నించినా తీయడానికి సాధ్యం కాలేదని బాధితులు తెలిపారు. యువకుడు వెంటనే స్పందించడంతో తాము ప్రాణాలతో బయటపడ్డామని.. లేకుంటో మరో 5 నిమిషాల్లో ప్రాణాలు పోయేవని కన్నీటిపర్యంతమయ్యారు.


తెలంగాణలోనూ విషాదం


అటు, పండుగపూట తెలంగాణలోనూ తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నదిలో స్నానానికని వెళ్లిన ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తేగడ గ్రామంలో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చర్ల మండలం గన్నవరం గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు తాలిపేరు నదిలో స్నానానికని వెళ్లారు. ప్రమాదవశాత్తు నదిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పండుగ పూట ఇద్దరు యువకుల మృతితో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.


Also Read: Andhra News: ఏపీలో తీవ్ర విషాదం - కోడికి ఈత నేర్పేందుకు వెళ్లి భర్త, ఇద్దరు పిల్లలు జలసమాధి, తట్టుకోలేక వివాహిత ఆత్మహత్య