Vijayawada Kanakaurga Temple | విజయవాడ: విజయదశమి వచ్చిందంటే చాలు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో పోలీసు ఆంక్షలు అధికం అవుతాయి. పోలీసు ఆంక్షలతో దుర్గమ్మ ఆలయం అష్ట దిగ్బంధనంలో చిక్కుకున్నట్లు కనిపిస్తోంది. అధికారులు, పోలీసుల వినూత్న ఆంక్షలతో భక్తులు అష్ట కష్టాలు పడుతున్నారు. దాంతో భక్తులు విజయవాడ కనకదుర్గ అమ్మవారి దర్శనానికి పడరాని పాట్లు పడుతున్నారు. కొండపైకి భక్తుల రాకపై ఆంక్షలు ఉండటంతో.. దుర్గమ్మ దర్శనం కోసం భక్తులు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటున్నారు.
దుర్గమ్మ దర్శనానికి అన్ని దారులు ముసుకుపోవడంతో కొందరు భక్తులు సాహసం చేసి కొండ పైకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రాణాలు లెక్కచేయకుండా, ఇబ్బందులు పడుతూ ప్రత్యామ్నాయ మార్గాల్లో ఇంద్రకీలాద్రిపైకి భక్తులు చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఎలాగైనా బెజవాడ దుర్గమ్మ దర్శనం చేసుకోవాలని చూస్తున్న భక్తులకు ఏమైనా జరిగితే ఎవరిది భాధ్యత అని ప్రశ్నిస్తున్నారు. పోలీసు వాహనాలకు రాచమార్గము అయితే, ఎంతో భక్తితో అమ్మవారిని దర్శించుకోవాలనుకున్న భక్తులకు నరక మార్గమా అని నిలదీస్తున్నారు.