నువ్వే సర్వస్వం అంటూ అవసరాలు తీర్చుకొని ఓ మహిళను మోసగించిన కేటుగాడి కథ ఇది. సినిమా స్టోరీకి కావాల్సిన కంటెంట్‌తో ఓ నయవంచకుడు చేసిన రియల్ మోసం. భర్త చనిపోయి ఒంటరిగా ఉంటున్న మహిళను టార్గెట్‌గా చేసుకొని పన్నిన పన్నాగం.ప్రేమ పేరుతో మోసం చేయడమే కాకుండా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడా కంత్రీగాడు.
భర్తను కోల్పోయి ఓ ప్రభుత్వ శాఖలో ఉద్యోగం చేస్తూ కుమారుడితో కలిసి హన్మకొండలో జీవిస్తోందా మహిళ. హంటర్ రోడ్‌లోని కార్ రిపేరింగ్ సెంటర్ నడుపుతున్న ఓ వ్యక్తి ద్వారా కాశీబుగ్గ వాసి ఒకరు ఆమెకు పరిచమయ్యాడు. కొద్ది రోజుల్లోనే చాలా దగ్గరైపోయాడు. ఏవో మాయమాటలు చెప్పి సహజీవనం మొదలుపెట్టాడు. పథకం ప్రకారం ఆమె వద్ద ఉన్న నగదునంత మాయం చేశాడు.
ఆ మహిళ ఆస్తి సొంతం చేసుకొని 70 లక్షలకుపైగా దోచుకొని మొహం చాటేసి వీడియోలు, ఫోటోలు ఉన్నాయని బ్లాక్ మెయిల్ మొదలు పెట్టాడు. తనకు మంచి పలుకుబడి ఉందని ఎక్కడ ఫిర్యాదు చేసిన ప్రయోజనం ఉండదని హెచ్చరించాడు. ఆస్తిని కాజేయడానికి అబద్దాలు ఆడుతున్నావని అందర్ని నమ్మిస్తానని బెదిరింపులకు దిగాడు.
75 లక్షల నగదు, 20 తులాల బంగారం, కాస్తో కూస్తో భూమి, ఇల్లు కొనిస్తానని కాజేసిన నగదుతో సర్వం కోల్పోయిన ఆ మహిళ కొడుకుతో కలిసి రోడ్డున పడింది. అష్టకష్టాలు అనుభవిస్తోంది. పోలీసులకు ఫిర్యాదు చేసిన లాభం లేకపోవడంతో తన కన్నీటి గాథ ఎవరికి చెప్పుకోవాలో ఎవరు తీరుస్తారో తెలియని అయోమయంలో ఉంది.
ఒంటరి మహిళను లొంగదీసుకున్న యువకుడు..
స్థలం కొని ఇల్లు కట్టిస్తానని,సోమిడిలో భూమి కొనుగోలు చేస్తానని 20తులాల బంగారంతో సహా ఉన్న నగదునంత ఊడ్చేశాడు. టూర్ ల పేరిట ఆ మహిళ డబ్బులతోనే దేశం అంత చుట్టేశాడు. బ్యాంకు అక్కౌంట్ లు, పాస్వర్డ్ లు,ఏటీఎం అన్ని తన అధీనంలో ఉంచుకొని ఇష్టం వచ్చినట్లు వ్యవహరించాడు.ఇదంతా గమనించిన బాధిత మహిళ ఇదేంటని ప్రశ్నిస్తే మొహం చాటేసి బెదిరింపులకు దిగుతున్నాడు.
మాజీమంత్రి కొడుకునని చెప్పిన యువకుడు...
తాను మాజీమంత్రి కొడుకునని తన అమ్మ ప్రస్తుతం ఎంపీగా ఉందని ఓ తప్పుడు విజిటింగ్ కార్డు ప్రింట్ చేయించి ఆ మహిళను నమ్మించి మోసం చేశాడు.విషయం తెలిసిన ఆ మహిళ స్నేహితులు గూగుల్‌లో సెర్చ్ చేసి ఎంపీ వివరాలు లేవని అడిగితే సెక్యూరిటీ కారణాల దృష్ట్యా బ్లాక్ చేశారని సాకులు చెప్పాడు.
నగ్న ఫొటోలతో బ్లాక్ మెయిల్ చేసిన యువకుడు....
తన డబ్బు ,బంగారం తనకు ఇవ్వాలని మహిళ నిలదీయడంతో బ్లాక్‌మెయిల్‌కు దిగాడు ఆ మోసగాడు. తనతో కలిసి ఉన్నపుడు తనకే తెలియకుండా రహస్యంగా అమర్చిన కెమెరాతో తీసిన వీడియోలు, ఫోటోలు నెట్‌లో పెడతానని బెదిరింపులకు దిగుతున్నాడు.శాంపిల్ చూడమంటూ ఫొటోలు వాట్సాప్ చేసి బయపెడుతూ మానసికంగా తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నాడు. కాళ్ళవేళ్ళ పడిన కనికరం లేకుండా బూతులు తిడుతున్నాడని ఆ మహిళ మీడియా ముందు కన్నీటిపర్యంతమయ్యారు.