హైదరాబాద్‌లో వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ విభాగం అధికారులు వెల్లడించారు. కొద్ది వారాలుగా రోజురోజుకూ నగరంలో ఎండలు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఎండాకాలం ప్రారంభం నాటి ఈ వేడికే ప్రజలు ఉక్కిరి అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా చల్లని వాతావరణం నగరవాసులను పలకరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పడినం అసని తుఫాన్‌ బలపడుతున్న వేళ హైదరాబాద్‌ సహా తెలంగాణలోనూ కొన్ని ప్రాంతాల్లో ఒక్కసారిగా చల్లని వాతావరణం ఏర్పడింది. మంగళవారం మధ్యాహ్నం మబ్బులు కమ్మి వర్షం కురిస్తుందేమోఅని అనిపించింది. సోమవారం నుంచి ఇదే పరిస్థితి నెలకొని ఉంది.


సోమవారం అమీర్ పేట్, పంజాగుట్ట, జూబ్లీహిల్స్ సహా నగరంలో అనేక ప్రాంతాల్లో స్వల్పపాటి వర్షం కురిసింది. అయితే మంగళవారం కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.


దక్షిణ బంగాళాఖాతంలో ఆరు రోజుల కిందట ఏర్పడిన అల్పపీడనం తీవ్రరూపం దాల్చి, అసని తుఫాన్‌గా మారింది. ఇది తూర్పు ఈశాన్య దిశగా కదులుతూ ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న తూర్పు ఈక్వటోరియల్ హిందూ మహాసముంద్రం మీదగా కదులుతోంది. ఏపీలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురవనుండగా, తెలంగాణలో కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని అమరావతి కేంద్రం, హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొన్నాయి.


అల్పపీడనం, వాయుగుండం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో నేటి నుంచి రెండు రోజులపాటు వర్షాలు కురవనున్నాయి. అసని తుఫాన్ నేపథ్యంలో మరోవైపు తీరం వెంట గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్లడం క్షేమదాయకం కాదని వాతావరశాఖ హెచ్చరించింది. ఎండలు, ఉక్కపోత నుంచి ఉత్తర కోస్తా, యానాం ప్రజలకు కాస్త ఊరట లభించింది.