హైదరాబాద్ నగర పరిధిలోని మాదాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో కారు బీభత్సం సృష్టించింది. సీఐఐ జంక్షన్ వద్ద ఆగివున్న ద్విచక్ర వాహనాన్ని కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న యువతి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనలో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ సైనిక్‌పురిలో నివాసం ఉండే అజయ్, జెన్నిఫర్ డిక్రూజ్ మాదాపూర్ ఐటీ జోన్లో సాఫ్ట్ వేర్ ఉద్యోగులు. ఈ మధ్యే వారిద్దరికీ పెళ్లి సంబంధం కుదరగా..పెద్దల సమక్షంలో ఘనంగా నిశ్చితార్ధం జరిగింది. త్వరలో పెళ్లి చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే శనివారం  అజయ్, జెన్నిఫర్ గచ్చిబౌలిలోని తమ బంధువుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి వెళ్లారు. ఆదివారం తిరుగు ప్రయాణమయ్యారు. రాయల్ ఎన్ ఫీల్డ్ వాహనంపై కొత్తగూడ వైపు నుంచి సైబర్ టవర్ వైపు వెళుతుండగా .. సీఐఐ జంక్షన్ వద్ద ట్రాఫిక్ సిగ్నల్ పడడంతో బైక్ ఆపారు. ఇంతలో వెనక వైపు నుంచి వేగంగా వచ్చిన మహీంద్రా కంపెనీకి చెందిన ఎక్స్‌యూవీ కారు బైక్ ని ఢీకొట్టింది. దీంతో బైక్ ఉన్న ఇద్దరూ కిందపడిపోయారు. జెన్నిఫర్ తలకు బలమైన గాయాలు కావడంతో సమీపంలోని మెడికవర్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే‌ ఆమె మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. బైక్ నడుపుతున్న అజయ్ ఎడమ చేయి, ఎడమ కాలు, వెన్నముకకు తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతం  చికిత్స అందిస్తున్నారు.


అయితే ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ అక్కడినుంచి పరారయ్యాడు. మృతురాలి తండ్రి జాన్ సిరిల్ డిక్రూజ్ ఫిర్యాదు మేరకు‌ కేసు నమోదు చేసిన మాదాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘనంగా నిశ్చితార్థం చేశారు. త్వరలోనే ఇరు కుటుంబాల్లో పెళ్లి సందడి మొదలవుతుందనుకున్నారు. ఇంతలోనే అంతులేని విషాదాన్ని నింపింది రోడ్డు ప్రమాదం. ఓ కుటుంబానికి కడుపుకోత మిగిల్చితే మరో కుటుంబానికి కొడుకు ఎప్పటికి  తేరుకుంటాడో తెలియని పరిస్థితిలోకి నెట్టేసింది. ఏన్ని ఘటనలు జరుగుతున్నా, ఎన్ని కేసులు నమోదు చేస్తున్నా, కఠిన చర్యలు తీసుకుంటున్నా ర్యాష్ డ్రైవింగ్ లు తగ్గడం లేదు. ఫలితంగా నిండు ప్రాణాలు బలైపోతున్నాయి.
Also Read:కామంతో కళ్లు మూసుకుపోయి కన్న కూతురిపై అఘాయిత్యం... మరో ఘటనలో వృద్ధురాలిపై అత్యాచారం చేసిన మృగాడు
Also Read:చిత్తూరు జిల్లాలో భారీ లాండ్ స్కామ్... నకిలీ పత్రాలతో 2320 ఎకరాలు కొట్టేసేందుకు పక్కా స్కెచ్... ఆన్లైన్ లో సొంత పేర్లకు మార్పు
Also Read: ఆడపిల్ల పుడితే ఇంటికి రావొద్దన్న ఫ్యామిలీ.. ఉరేసుకున్న గర్భిణీ
Also Read:సముద్రం మధ్యన షిప్‌లో సోదాలు ఎలా? అధికారులు అమలు చేసిన పక్కా ప్లాన్ ఏంటంటే..                                                                                                                                                  ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి