Hyderabad Crime news: దారిలో ఎవరైనా అమ్మాయి గానీ, మహిళ గానీ కనిపించి లిఫ్ట్‌ అడిగితే పోనీలే పాపం అని... చాలా మంది వాహనం ఎక్కించుకుంటారు. ఒంటరిగా  ఎలా వెళ్తుందో ఏమో అన్న జాలితో అడిగిన వెంటనే లిఫ్ట్‌ ఇచ్చేస్తారు. ఇది చాలా మంచి పనే. రవాణా సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్న మహిళలకు సాయం చేయడం  అభినందించదగ్గ విషయమే. కానీ... ఇదే అవకాశంగా మార్చుకుని దందాలు చేస్తున్నారు కిలేడీలు. అది గమనించుకోకపోతే.. చిక్కుల్లో పడక తప్పదు. ఎందుకంటే... పోనీలా  పాపం అని మహిళలకు లిఫ్ట్‌ ఇచ్చి.. చిక్కుల్లో పడుతున్నారు చాలా మంది. ఇలాంటి ఘటనలు హైదరాబాద్‌లో ఎక్కువగా నమోదవుతున్నాయి


లిఫ్టు పేరుతో నిలువు దోపిడీ 


అమాయక మహిళలు ఎవరు.. కిలేడీలు ఎవరు అని గుర్తించడం కూడా కష్టమే. ముఖానికి మాస్క్‌ ధరించి... టిప్పుటాపుగా తయారవుతారు. రోడ్డుపై ఒంటరిగా నిలబడతారు.  బైక్‌లు, కార్లలో ఒంటరిగా వెళ్లేవారిని గమనించి...లిఫ్ట్‌ అడుగుతారు. అయ్యో పాపం అని జాలిపడి... లిఫ్ట్‌ ఇచ్చారో... ఇక అంతే సంగతులు. కొద్దిదూరం వెళ్లగానే.. వారి అసలు  రూపం బయటపెడతారు. లైంగికదాడికి పాల్పడ్డారంటూ గగ్గోలు పెడతారు. బెదిరిస్తారు. ఉన్నదంతా దోచుకుంటారు. నిలువు దోపిడీ చేసేస్తారు. 


బంజారాహిల్స్‌లో కేసులు


హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఇటీవల జరిగిన ఓ సంఘటనలో ఓ మహిళ అరెస్ట్‌ చేశారు పోలీసులు. నిన్న (బుధవారం)  జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మరో మహిళను అరెస్ట్‌ చేశారు. బంజారాహిల్స్‌ రేషంబాగ్‌ ప్రాంతంలో నివసించే కారు డ్రైవర్‌ పరమానంద మంగళవారం (జనవరి 2వ తేదీ)  రాత్రి జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు నుంచి కేబీఆర్‌ పార్క్‌ వైపు కారులో వెళ్తున్నాడు. ఆ సమయంలో చెక్‌పోస్టు దగ్గర ఓ మహిళ లిఫ్టు అడిగింది. అతడు ఆమెను కారులో ఎక్కించుకొని  కొద్ది దూరం వెళ్లాడు. అంతే... ఆ లేడీ అసలు రంగు బయటపెడ్డింది. తనకు డబ్బులు ఇవ్వాలని.. లేదంటే లైంగిక దాడికి పాల్పడినట్టు పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటూ  బెదిరించింది. దీంతో కారు డ్రైవర్‌ పరమానంద కంగారుపడిపోయాడు. అయినా తెలివిగా వ్యవహరించి... కారును బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లాడు. పోలీసులకు  ఫిర్యాదు చేశాడు. బంజారాహిల్స్‌ పోలీసులు.. కేసును జూబ్లీహిల్స్‌ పోలీసులకు అప్పగించారు. 


న్యాయవాదిగా హల్‌చల్


బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌లో ఇలాంటి ఘటనలు పెరిగిపోతున్నాయని పోలీసులు చెప్తున్నారు. కిలేడీని అరెస్ట్‌ చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితురాలి పేరు నయిమా  సుల్తానా అని, ఆమె వయస్సు 32 సంవత్సరాలుగా గుర్తించారు. అయితే ఆమె... తను ఒక న్యాయవాదిగా చెప్పుకుంటోందని అంటున్నారు పోలీసులు. తాను ఒక అడ్వకేట్  అని.. తనకు అన్ని సెక్షన్లు తెలుసు అంటూ దబాయిస్తోందని చెప్తున్నారు. ఆమె దగ్గర దొరికిన ఒక పుస్తకంలో వందలాది కేసులకు సంబంధించిన కేస్ స్టడీస్ వివరాలు కూడా  ఉన్నట్టు తెలిపారు. వాటిని అడ్డుపెట్టుకుని ప్రతి కేసులో ఎలాంటి శిక్ష పడుతుంది అని బాధితులను బెదిరిస్తున్నట్టు గుర్తించారు. పలువురు అమాయకుల మీద కిలాడీ లేడీ  కేసులు పెట్టినట్లు దర్యాప్తులో వెల్లడైంది. 


ఈ కిలేడీపై హైదరాబాద్‌, సైబరాబాద్‌ కమిషనరేట్ల పరిధిలో 17కి పైగా కేసులు ఉన్నట్లు గుర్తించారు జూబ్లీహిల్స్‌ పోలీసులు. ఆమెపై ఐపీసీ (Ipc) 389 సెక్షన్ కింద కేసు  నమోదు చేశారు. ఆమె గురించి తెలుసుకోవడానికి బార్‌ అసోసియేషన్‌కు లేఖ కూడా రాయనున్నారు జూబ్లీహిల్స్‌ పోలీసులు తెలిపారు. కారు డ్రైవర్‌ పరమానంద అప్రమత్తంగా  వ్యవహరించడంతో... వాహనదారులకు వలవేస్తున్న కిలేడీ గ్యాంగ్‌ గుట్టు రట్టయ్యింది. ఆమెలా ఎంత మంది ఈ దందాలో ఉన్నారు అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు  చేస్తున్నారు. అమాయక వాహనదారులకు లిఫ్ట్‌ పేరుతో వలవేసి దోచుకుంటున్నా కిలేడీలను గుర్తించే పనిలో పడ్డారు. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు  పోలీసులు.