Model Divya Pahuja Murdered In Gurugram: గురుగ్రామ్‌లో దారుణం జరిగింది. ఏడేళ్ల క్రితం ఓ గ్యాంగ్‌స్టర్‌ని ట్రాప్ చేసి పోలీసులతో ఎన్ కౌంటర్ చేయించిన ఓ మాజీ మోడల్‌ను దుండగులు కాల్చి చంపేశారు. వివరాలు.. మోడల్‌గా పని చేస్తున్న దివ్యా పహుజా (Divya Pahuja)కు 2016లో అండర్ వరల్డ్‌తో సంబంధాలు ఏర్పడ్డాయి. అదే సంవత్సరం గురుగ్రామ్ (Gurugram)కు చెందిన గ్యాంగ్ స్టర్ సందీప్ గడోలి (Sandeep Gadoli)తో ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ సమీపంలోని ఓ హోటల్లో గడిపారు. ఆ సమయంలో సందీప్ గడోలిని పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. అతనితో పాటు హోటల్ రూమ్‌లోనే ఉన్న మోడల్ దివ్యా అహుజాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏడేళ్లు జైలులో గడిపిన తర్వాత, జూన్ 2023లో దివ్యకు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
కారులో డెడ్ బాడీ
బెయిల్ పై ఏడేళ్ల తర్వాత బయటకు వచ్చిన దివ్యా అహుజాను మంగళవారం ఐదుగురు బలవంతంగా గుర్‌గ్రామ్‌లోని ఓ హోటల్ కు తీసుకువెళ్లారు. అక్కడ ఆమెను తలపై గన్‌తో కాల్చి చంపేశారు. హత్యకు గల కారణాలు మాత్రం అస్పష్టంగా ఉన్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దివ్య డెడ్ బాడీ పారవేసేందుకు ప్రయత్నించిన హోటల్ యజమాని అభిజీత్ సింగ్, అతని ఇద్దరు ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై అభిజిత్ సింగ్ స్పందిస్తూ.. దివ్య తనను బెదిరించి డబ్బు వసూలు చేసిందని ఆరోపించాడు. దివ్య కుటుంబ సభ్యులు ఆరోపణలను ఖండించారు.
గడోలీ కుటుంబం ప్లాన్
దివ్య సోదరి నైనా తన సోదరి హత్యపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దివ్యను హత్య చేయడానికి గడోలీ కుటుంబ సభ్యులు సుదేష్ కటారియా, బ్రహ్మ ప్రకాష్ కటారియా అభిజిత్‌కు సుపారి ఇచ్చారని ఆరోపించారు. అంతేకాదు అభిజిత్ తీరుపై కూడా అనుమానం వ్యక్తం చేసింది. దివ్య హత్యకు గురైన హోటల్‌లోని CCTV ఫుటేజీలో అబిజిత్ ఉద్యోగుల సాయంతో ఆమె మృతదేహాన్ని పారవేసేందుకు ప్రయత్నించినట్లు ఆరోపించింది. దివ్యను జనవరి 1న అభిజిత్ కలిశాడు. జనవరి 2న ఉదయం 11:50 గంటలకు దివ్య చివరి సారి కుటుంబ సభ్యులతో మాట్లాడింది. ఆ రోజు తర్వాత ఆమె ఫోన్‌ను సంప్రదించడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలైంది.
అసభ్యకర ఫోటోలు డిలీట్ చేయలేదు
అయితే అభిజిత్ వాదన వేరేలా ఉంది. జనవరి 2న తాను దివ్య పహుజాతో కలిసి హోటల్ సిటీ పాయింట్‌కి వచ్చానని, ఆమె ఫోన్‌లో ఉన్న తన అసభ్యకరమైన ఫోటోలను డిలీట్ చేయాలనుకున్నానని, అయితే దివ్య పహుజా తన ఫోన్ పాస్‌వర్డ్ చెప్పలేదని అభిజిత్ తెలిపాడు. పోలీస్ అధికారి సుభాష్ బోకేన్ స్పందిస్తూ.. హోటల్ క్లీనింగ్, రిసెప్షన్ ఉద్యోగులతో కలిసి అభిజిత్ మోడల్ దివ్య పహుజాను హత్య చేసి మృతదేహాన్ని తన బీఎండబ్ల్యూ కారులో ఉంచినట్లు చెప్పారు. అనంతరం మృతదేహాన్ని పారవేయడానికి తన కారును వారికి ఇచ్చినట్లు వెల్లడించారు. గురుగ్రామ్ ఎస్పీ ముఖేష్ కుమార్ దివ్య హత్య కేసు గురించి మాట్లాడుతూ.. ఈ కేసులో మరింత లోతైన విచారణ జరగాలని ఇప్పటికైతే హోటల్ ఓనర్ అభిజిత్ సహా మరో ఇద్దరిని అరెస్ట్ చేశామని తెలిపారు. మృతదేహాన్ని వెలికితీసేందుకు పోలీస్ బృందాలు గాలిస్తున్నట్లు చెప్పారు.
Alsa Read: 16 ఏళ్ల బాలికపై వర్చువల్ గ్యాంగ్ రేప్, ప్రపంచంలోనే ఇది తొలి కేసు!
Also Read: జూనియర్ రెజ్లర్ల ఆందోళన, శుభవార్త చెప్పిన అడ్‌హక్ కమిటీ
- ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద జూనియర్ రెజ్లర్ల ఆందోళన స్పందించిన అడ్‌హక్ కమిటీ ఆరు వారాల్లో అండర్ -15, అండర్ – 20 నేషనల్ ఛాంపియన్‌షిప్స్.