Girl Gang Raped In Metaverse: నిత్యం ప్రపంచంలో ఏదో ఒక మూలలో ఆడబిడ్డలపై ఆఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. మానవ మృగాల మధ్య భయంతో ఆడపిల్లలు బతుకుతున్నారు. నడిరోడ్డు, బస్సులు, ప్రయాణం, సినిమాలు ఇలా ప్రతి చోట ఏదో ఒకరంగా కొందరు దుర్మార్గులు వేధిస్తూనే ఉన్నారు. అంతటితో ఆగడం లేదు. ఏకంగా వర్చువల్‌గా కూడా మహిళలు, ఆడపిల్లలపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనే యూకేలో జరింది.  ఆన్‌లైన్ వర్చువల్ రియాలిటీ మెటావర్స్‌లో ఓ బాలికపై కొందరు దుర్మార్గులు లైంగిక దాడికి పాల్పడ్డారు. 


మానసిక వేదన 


వివరాలు.. యూకేకు చెందిన 16 ఏళ్ల బాలిక వర్చువల్ రియాలిటీ గేమ్‌లో డిజిటల్ అవతార్, డిజిటల్ క్యారెక్టర్‌పై ఆన్‌లైన్‌లో అపరిచిత వ్యక్తులతో సామూహిక అత్యాచారానికి గురైంది. ఈ ఘటనతో బాలిక తీవ్ర మనోవేదన అనుభవిస్తున్నట్లు ది న్యూయార్క్ వార్తాసంస్థ నివేదించింది. బాలిక ఆన్‌లైన్ గేమ్‌లో లీనమై ఉండగా.. కొంతమంది పురుషులు ఆమె క్యారెక్టర్‌పై ఆన్‌లైన్‌లో గ్యాంగ్ రేప్‌కి పాల్పడ్డారు. అయితే వాస్తవంగా బాలికపై అత్యాచారం జరగలేదు. ఎలాంటి గాయాలు అవలేదు. కానీ వర్చువల్‌గా జరిగిన ఘటనతో ఆమె తాను అత్యాచారానికి గురైనట్లు మానసిక బాధను అనుభవిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్న మొదటి వర్చువల్ లైంగిక నేరం ఇదే అని భావిస్తున్నారు.


ఇలాంటి కేసులు లేవు 


బాలికపై శారీరకంగా అత్యాచారం జరగలేదని, కానీ మానసికంగా ఆమె బాధను అనుభవిస్తోందని, ఇది ఎక్కువ కాలం ఆమెపై ప్రభావం చూపించే అవకాశం ఉందని పోలీస్ అధికారి చెప్పారు. అయితే ప్రస్తుతం ఇలాంటి కేసులపై ప్రత్యేకంగా చట్టాలు లేవని, దీంతో ఈ కేసులో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని పోలీసులు చెబుతున్నారు.  బాలిక ఏ గేమ్ ఆడుతుందనేది అస్పష్టంగా ఉందని చెప్పారు.


అసలు విచారించాలా వద్దా?


ఇలాంటి ప్రతిష్టాత్మక కేసు దర్యాప్తు విషయంలో వర్చువల్ నేరాలపై దర్యాప్తు కొనసాగించాలా..? వద్దా.? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ కేసుపై యూకే హోం సెక్రటరీ జెమ్స్ క్లివర్లీ మాట్లాడుతూ.. బాలిక సెక్సువల్ ట్రామాలోకి వెళ్లిందని చెప్పారు. ఇది వాస్తవంగా జరిగిన ఘటన కాదని, కానీ  దీనిని కొట్టిపారేయడం సులభం కాదన్నారు. ఘటనపై నెటిజన్లు సైతం స్పందిస్తున్నారు. వర్చువల్‌గా పిల్లలపై ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడేవారు, భౌతికంగా దారుణమైన పనులు చేయగలరని అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


ఇలాంటి వాటికి అవకాశం లేదు


ఫేస్‌బుక్ మాతృసంస్థ అయిన మెటాకు చెందిన హారిజోన్ వరల్డ్‌లో వర్చువల్ సెక్స్ నేరాలపై ఇప్పటికే అనేక నివేదికలు వచ్చాయి. తాజాగా యూకేలో 16 ఏళ్ల బాలికపై వర్చువల్‌గా జరిగిన లైంగిక దాడిపై మెటా సంస్థ స్పందించింది. తమ ప్లాట్‌ఫాంలో ఇలాంటి వాటికి స్థానం లేదని, తమ వినియోగదారులకు ఆటోమెటిక్ రక్షణ ఉంటుందని, అపరిచిత వ్యక్తుల్ని దూరంగా ఉంచుతుందని మెటా ప్రతినిధి చెప్పారు.