పిల్లలకు బుద్దిగా పాఠాలు చెబుతున్నాడని నమ్మితే జీవితాంతం కష్టపడిన సొమ్మును కొట్టేసి పారిపోయాడో ట్యూషన్ మాస్టర్. బాగా చదువుకున్న వ్యక్తని.. ఎవర్నీ మోసం చేయడని అనుకున్నారు. కానీ ఒక్క సారిగా అందర్నీ మోసం చేసి పారిపోయే సరికి లబోదిబోమనడం వారి వంతయింది. ప్రైవేట్ వ్యక్తుల చిట్స్‌ను నమ్మి మోసపోయే బాధితుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. ఇలాంటి ఘటనే వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. 


వరంగల్ నగరం లోని లేబర్ కాలనీకి చెందిన వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఉన్నత విద్యావంతుడు. విద్యార్థులకు ట్యూషన్ లు చెప్పేవాడు.  బాగా చదువు చెబుతాడని పేరు తెచ్చుకున్నారు. ఈ పేరును అడ్డం పెట్టుకుని .. నమ్మిన వాళ్లందర్నీ నట్టేట ముంచాలనుకున్నాడు. అందు కోసం  2015లో కల్పవల్లి అసోసియేట్ ఫైనాన్స్ అనే సంస్థ ఏర్పాటు చేసి నెలవారి చిట్టీలు ప్రారంభించారు. విద్యావంతుడు కావడంతో పాటు అందరికీ అందుబాటులో ఉంటాడు.. చిట్స్ గురించి పూర్తి సమాచారం అందరికీ చెబుతూండటంతో నమ్మేశారు. కొంతమంది చిట్టీలు వేసి చిట్టి డబ్బులు కూడా రెండు రూపాయల వడ్డీకి వెంకటేశ్వర్లు కే ఇచ్చారు. 


ఒకరి నుంచి ఒకరికి బాగా ప్రచారం జరగడంతో  దాదాపుగా  900 మంది సభ్యులతో చిన్నపాటి వ్యాపార సంస్థనే నిర్వహించడం ప్రారంభించాడు. అందరి దగ్గర  నెలవారి చిట్టీలు కట్టించుకువాడు. ఇటీవలి కాలంలో చిట్ పాడుకున్న వారికి కూడా నగదు ఇవ్వడం లేదు. రేపు మాపు అని తిప్పడం ప్రారంభించారు. అప్పులు ఇచ్చిన వాళ్లకి వడ్డీ కట్టడం కూడా మానేశాడు. హఠాత్తుగా ఇంటి నుంచి మాయం అయిపోయాడు. పెట్టేబేడా సర్దుకుని వెళ్లిపోయాడు.  వెంకటేశ్వర్లు చేసిన మోసాన్ని ఆలస్యంగా గెలుచుకున్న చిట్టి సభ్యులు బాధితుని ఇంటి ముందుకు వచ్చి ఆందోళన చేపట్టారు .


సుమారు 40 కోట్ల రూపాయల మేర చిట్టి డబ్బులు బాధితులకు వెంకటేశ్వర్లు ఇవ్వాల్సింది అని బాధితులు ఆవేదనతో ఆరోపిస్తున్నారు. కొందరు పాప పెళ్లి కోసం... కొందరు ఇంటి నిర్మాణం కోసం ...కొందరు చదువు కోసం... పైసా పైసా కూడబెట్టి వేసిన చిట్టి డబ్బులతో వెంకటేశ్వర్లు పారిపోవడంతో న్యాయం చేయాల్సిందిగా బాధితులు మిల్స్ కాలనీ పోలీసులను ఆశ్రయించారు. 
వెంకటేశ్వర్లు అనే వ్యక్తి చిట్టీల పేరుతో మోసం చేశాడని తమకు ఫిర్యాదు అందిందని అసలు అతని కల్పవల్లి సంస్థ రిజిస్ట్రేషన్ అయిందా లేదా విచారణ చేయాల్సి ఉందని ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే తమ వివరాలను మిల్స్ కాలనీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ కు ఇవ్వాల్సిందిగా వరంగల్ ఏసిపి గిరి కుమార్ కలకోట తెలిపారు.