వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ముంబయి కేంద్రంగా ఆన్లైన్ క్రికెట్, రమ్మీ బెట్టింగ్ కు పాల్పడుతున్న ఇద్దరు బుకీలను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి సుమారు 2 కోట్ల 5 లక్షల 14 వేల రూపాయల నగదు, 7 సెల్ ఫోన్లు, వివిధ బ్యాంకులకు సంబంధించి 43 పాస్ బుక్ లు, ఏటీఎమ్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని వరంగల్ సీపీ తరుణ్ జోషి తెలిపారు. హన్మకొండ జిల్లాకు చెందిన మాడిశెట్టి ప్రసాద్ (40), మహారాష్ట్రకు చెందిన అభయ్ విలాస్ రావు అనే ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ఈ కేసు వివరాలను వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి సోమవారం మీడియాకు తెలిపారు. సీపీ మాట్లాడుతూ.. మాడిశెట్టి ప్రసాద్ కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్ హఫీజ్ పేటలో నివాసం ఉంటూ రెడీమెడ్ బట్టల వ్యాపారం చేస్తున్నాడు. ఈ బట్టల వ్యాపారం ద్వారా తన కుటుంబ పోషణ కష్టం కావడంతో సులభంగా డబ్బు సంపాదించాలని పక్కదారి పట్టాడు. ఇందుకోసం హఫీజ్ పేటలో కొంత మంది స్నేహితులతో కలిసి 2016 నుంచి క్రికెట్ బెట్టింగ్ ప్రారంభించాడు.
Also Read: పార్లమెంట్ ఆవరణలో టీఆర్ఎస్ ఎంపీల నిరసన... వరి ధాన్యాన్ని పూర్తిగా సేకరించాలని ప్లకార్డుల ప్రదర్శన
బెట్టింగ్ లావాదేవీల కోసం బినామీ పేర్లతో ఖాతాలు
2018లో నుంచి ప్రసాద్ ఆన్లైన్ క్రికెట్, మూడు ముక్కల పేకాట బెట్టింగ్ నిర్వహిస్తున్నాడని సీపీ తరుణ్ జోషి తెలిపారు. ఈ క్రమంలో ప్రసాద్ కు ముంబయిలో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్, రమ్మీ బెట్టింగ్ నిర్వహకుడు అభయ్ తో పరిచయం ఏర్పడిందన్నారు. ఈ పరిచయంతో ప్రసాద్ కి ఆన్లైన్ బెట్టింగ్ పై పూర్తిస్థాయిలో అవగాహన కలగడంతో పాటు, అభయ్ నిర్వహించే ఆన్లైన్ బెట్టింగ్ వెబ్‌సైట్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహించే బుకీగా మారాడని సీపీ తెలిపారు. ఆన్లైన్ బెట్టింగ్ లో పాల్గొనేవారికి అభయ్ నుంచి వచ్చిన యూజర్ నేమ్, పాస్వర్డలను వాట్సప్ ద్వారా బెట్టింగ్లో పాల్గొనే వారికి ప్రసాద్ అందజేసేవాడని, వీటి ద్వారా ఖాతాదారులు ఆన్లైన్ ద్వారా క్రికెట్, రమ్మీ బెట్టింగ్ లో పాల్గొనేవారని సీపీ జోషి తెలిపారు. బెట్టింగ్ లో వచ్చే డబ్బులో కమీషన్ మినహాయించుకుని మిగతా డబ్బును అభయ్ అందజేసేవాడని తెలిపారు. బెట్టింగ్ లావాదేవీల కోసం బినామీ పేర్లపై బ్యాంక్ ఖాతాలను నిర్వహించేవాడని వివరించారు.
హైదరాబాద్ నుంచి హన్మకొండకు మకాం
ముఖ్యంగా ఆన్లైన్ బెట్టింగ్, వెబ్ సైట్ నిర్వహణ తమ చేతుల్లో ఉండటంతో మూడు ముక్కల పేకాట బెట్టింగ్ సమయంలో తక్కువ మొత్తంలో పందెం పెట్టిన వారిని ముందుగా గెలిపించి వారితో ఎక్కువ మొత్తంలో పందెం కాసేలా చేశారు. ఇలా ఎక్కువ డబ్బును పందెం కాసినప్పుడు వారిని ఓడిపోయేలా మోసం చేసేవారు. ఈ క్రమంలోనే ప్రసాద్ మరో ఇద్దరితో కలిసి ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తుండగా 2019లో హైదరాబాద్ కమిషనరేట్ కు చెందిన చందానగర్, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో రామచంద్రాపురం పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. జైలు నుంచి విడుదలైన తర్వాత హైదరాబాద్ లో తిరిగి ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తే పోలీసులు గుర్తిస్తారని తన అత్తగారి ఊరు హన్మకొండకు ప్రసాద్ మకాం మార్చాడు. హన్మకొండ కేంద్రంగా ఐపీఎల్, టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లోపై బెట్టింగ్ నిర్వహించాడు. ఈ బెట్టింగ్ ద్వారా వచ్చిన డబ్బును బినామీ పేర్లపై బ్యాంకు ఖాతాల్లో జమచేయడంతో పాటు వివిధ స్థిరాస్తులను కొనుగోలు చేశాడు. మోసపోయిన వ్యక్తులు ఇచ్చిన ఫిర్యాదుతో నిందితులపై కేయూసీ పోలీస్ స్టేషన్ లో రెండు కేసులు, హన్మకొండ పోలీస్ స్టేషన్ లో ఒక కేసు నమోదు అయ్యాయి. సెంట్రల్ జోన్ డీసీపీ పుష్పా ఆధ్వర్యంలో కేయూసీ, సైబర్ క్రైం పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేసి నిందితులను పట్టుకున్నారని సీపీ జోషి తెలిపారు.
Also Read: ఆహారం తినకపోతే అంత ప్రమాదమా? మన శరీరం మనల్నే తినేస్తుందా?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి