తెలంగాణ వరి ధాన్యాన్ని కేంద్రమే కొనాలని టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన చేశారు. దిల్లీలోని పార్లమెంట్ ఆవ‌ర‌ణ‌లోని గాంధీ విగ్రహం వ‌ద్ద ఎంపీలు ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. తెలంగాణకు  అన్యాయం చేయొద్దని నినాదాలు చేశారు. జాతీయ రైతు ఉత్పత్తుల విధానాన్ని ప్రకటించాలని కోరారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు, లోక్‌స‌భ‌లో టీఆర్ఎస్ పార్టీ నేత నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డి, బండా ప్రకాశ్, జోగినపల్లి సంతోష్ కుమార్, లోక్‌స‌భ‌ సభ్యులు గడ్డం రంజిత్ రెడ్డి, బీబీ పాటిల్, మన్నే శ్రీనివాస్ రెడ్డి, పోతుగంటి రాములు, వెంకటేష్ ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు.


Also Read: యాంకర్ రవి ఎలిమినేన్ రచ్చ.. ఏం జరిగిందో చెప్పాలని ఎమ్మెల్యే డిమాండ్.. బ్యాన్ కోసం అమిత్ షాకి లేఖ రాస్తా


రైతుల కోసం ఆందోళన


సీఎం కేసీఆర్ ముందు చూపుతో రైతులకు సమృద్ధిగా సాగునీరు, ఎరువులు, విత్తనాలు, రైతు బంధు వంటి పథకాలు అందిస్తున్నామని ఎంపీలు అన్నారు. రైతులకు 24 గంటలూ నాణ్యమైన ఉచిత కరెంటు అందించడం వల్ల దిగుబడులు పెరిగాయన్నారు. ధాన్యం దిగుబడుల మేరకు ఎఫ్‌సీఐ కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేశారు. రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోవడమే కాకుండా రైతు సంక్షేమం కోసం అవసరమైన విధానాలను తీసుకురావాలని కోరారు. తెలంగాణలో రైతులకు ప్రయోజనం చేకూర్చే అనేక పథకాలు అమలవుతున్నాయని... వాటిని దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం విధి, విధానాలను రూపొందించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు రైతుల కోసం ఆందోళన చేస్తామని టీఆర్ఎస్ ఎంపీలు తెలిపారు.


Also Read: ఆహారం తినకపోతే అంత ప్రమాదమా? మన శరీరం మనల్నే తినేస్తుందా?


ధాన్యం సేకరణపై వాయిదా తీర్మానం
 
తెలంగాణలో ధాన్యం సేకరణపై కేంద్రం క్లారిటీ ఇవ్వాలని టీఆర్‌ఎస్ ఎంపీలు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వరి ధాన్యాన్ని పూర్తిగా సేకరించాలని పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్ ఎంపీలు వాయిదా తీర్మానం ఇచ్చారు. లోక్‌సభలో టీఆర్‌ఎస్ ఎంపీల వాయిదా తీర్మానాన్ని స్పీకర్ ఓం బిర్లా తిరస్కరించారు. దీంతో లోక్‌సభలో టీఆర్‌ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు, ఇతర సభ్యులు నిరసన తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ధాన్యం సేకరణపై కేంద్రం వైఖరికి నిరసనగా పార్లమెంట్‌ ఆవరణలోని గాంధీ విగ్రహాం వద్ద నిరసన చేశారు. తెలంగాణ రైతులను శిక్షించవద్దని ప్లకార్డులు ప్రదర్శించారు. ధాన్యం సేకరణలో పంజాబ్‌కు ఒక న్యాయం, తెలంగాణకు ఒక న్యాయమా? అని టీఆర్ఎస్ ఎంపీలు ప్రశ్నించారు. వానాకాలంలో తెలంగాణలో 1.2 కోట్ల టన్నుల ధాన్యం పండిందని, రాష్ట్రంలో 62 లక్షల ఎకరాల్లో వరి సాగైందని ఎంపీలు తెలిపారు. 


Also Read: సమ్మెకు సిద్ధమైన స్విగ్గి డెలివరీ బాయ్స్‌.. స్పందించకుంటే డెలివరీలన్నీ బంద్, కారణం ఏంటంటే..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి